More

    ఆకాశ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం.. యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేసే మరో క్షిపణి కూడా..!

    భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) తయారు చేసిన కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమయ్యింది. న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (ఆకాష్-ఎన్జీ)ని బుధవారం పరీక్షించారు. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందని డీఆర్డీవో తెలిపింది. లక్ష్య ప్రమాణాల మేరకు టెస్ట్‌ జరిగినట్లు పేర్కొంది. మల్టీఫంక్షన్ రాడార్, కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, డిప్లాయ్‌మెంట్ కాన్ఫిగరేషన్‌లో పాల్గొనే లాంచర్ వంటి అన్ని ఆయుధ వ్యవస్థ అంశాలను ఈ క్షిపణి కలిగి ఉంది. బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణిని ప్రయోగించారు. 60 కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశ్‌-ఎన్‌జీ మ్యాక్‌ 2.5 (గంటకు 3087కి.మీ.) వేగంతో ప్రయాణించిందని వెల్లడించింది. భారత వాయుసేన (ఐఏఎఫ్‌)లో ప్రవేశపెట్టేందుకు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఆకాశ్‌-ఎన్‌జీ అభివృద్ధిలో భాగస్వాములైన డీఆర్‌డీవో, ఐఏఎఫ్‌ విభాగాలు, బీడీఎల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ శాస్త్రవేత్తలు, సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు.

    భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది. ఎమ్‌పీఏటీజీఎమ్‌(మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌) క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. మ్యాన్‌ పోర్టబుల్‌ లాంచర్‌ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. థర్మల్ సైట్‌తో అనుసంధానించిన మ్యాన్-పోర్టబుల్ లాంచర్ నుండి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్డీవో తెలిపింది. ట్యాంక్‌ నమూనా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో నాశనం చేసిందని, కనీస పరిధి పరీక్ష విజయవంతమైందని, మిషన్ లక్ష్యాలన్నీ నెరవేరాయని వెల్లడించింది.

    ఈ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ఫ్రా రెడ్‌ సీకర్‌, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు ఉన్నాయని.. ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 2.5 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేశారు. ఆయుధాల తయారీలో ఆత్మనిర్భర్‌ సాధన దిశగా డీఆర్‌డీవో మరో ముందడుగు వేసింది. ‘శత్రుదేశ యుద్ధట్యాంకులను ధ్వంసం చేసే ఈ మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం నిజంగా గర్వకారణని.. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని, భారత సైన్యానికి అందించబోతున్నాము’ అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    Trending Stories

    Related Stories