More

    నిన్న పినాకా, నేడు అగ్ని ప్రైమ్..! ఇక చైనాకు చుక్కలే..!!

    శత్రుదేశాల నుంచి కవ్వింపులు పెరుగుతున్న కొద్దీ.. భారత్ తన అస్త్రాలకు పదునుపెడుతోంది. డీఆర్డీవో వరుస ప్రయోగాలతో దూసుకుపోతోంది. మొన్ననే పినాకా రాకెట్లను సక్సెస్‎ఫుల్‎గా నింగిలోకి పంపింది. తాజాగా అణ్వస్త్రాలను అవలీలగా మోసుకెళ్లగల.. అగ్ని ప్రైమ్ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసింది. అగ్ని సిరీస్‌లో అత్యధునికమైన వేరియంట్‌ ఇది. వెయ్యి కిలో మీటర్ల నుంచి 2 వేల కిలో మీటర్ల దూరం వరకు దూసుకుపోగల సామర్థ్యం దీని సొంతం. ఒడిశాలోని బాలాసోర్ లో వున్న.. అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది డీఆర్డీవో. ప్రయోగ పరీక్షలో ఇది కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడంతో డీఆర్డీవో వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తూర్పు తీరం వెంబడి ఉన్న పలు టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాలను క్షుణ్ణంగా ట్రాక్ చేసి పర్యవేక్షించాయి. క్షిపణి ఓ క్రమపద్ధతిని అనుసరించి అన్ని లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకుంది. అన్నివిధాలుగా డీఆర్డీవో నిర్దేశించిన ప్రమాణాలను ఇది అందుకోవడంతో, పరీక్ష విజయవంతం అయినట్టు ప్రకటించింది.

    అగ్ని ప్రైమ్ క్షిపణి.. వాస్తవానికి రెండు ప్రధాన క్షిపణుల శక్తిసామర్థ్యాల కలయిక అని చెప్పాలి. అగ్ని-4, అగ్ని-5 క్షిపణుల్లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అగ్ని ప్రైమ్ కు రూపకల్పన చేశారు. అగ్ని-1 మిస్సైల్ కంటే ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది. డీఆర్డీవో ప్రయోగించిన అగ్ని సిరీస్‌లో అగ్ని ప్రైమ్ ఇది. ఈ అధునాతన రాకెట్ గరిష్ఠంగా 1,500 కిమీ దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలదు. 1000 కిమీ దూరం వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. అంతేకాదు, ఈ బాలిస్టిక్ క్షిపణి.. దీనిని రైలు, రహదారి గుండా తరలించవచ్చు. అలాగే ఎక్కవ కాలం నిల్వచేయవచ్చు. అలాగే రవాణాకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని డీఆర్డీవో తెలిపింది. ఇండో-పసిఫిక్‌ లోని శత్రువులను టార్గెట్ చేసుకుని ప్రయోగించేందుకు వీటిని ఉపయోగించవచ్చని చెప్పింది. భారత అమ్ములపొదిలో అగ్ని ప్రైమ్ చేరితో చైనా గుండెల్లో గుబులు రేగుతోంది. ఎందుకంటే, చైనా భూభాగంలో సగం దూరాన్ని ఈ మిస్సైల్ అవలీలగా చేధించగలదు.

    కొద్దిరోజుల ముందే.. పినాకా రాకెట్లను కూడా విజయవంతంగా ప్రయోగించింది డీఆర్డీవో. వరుగా రెండు రోజులపాటు.. ఒడిశాలోని చాందీపూర్ లో గల టెస్టింగ్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించింది. పరీక్షలో భాగంగా మొత్తం 25 రాకెట్లను ప్రయోగించారు. అన్నీ కూడా విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని.. అనుకున్న మేరకు సత్ఫలితాలను అందించాయని డీఆర్డీవో తెలిపింది. పినాక రాకెట్ 45 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌లను సక్సెస్‌ఫుల్‌గా ఛేదించింది. భారత ఆర్మీ సూచనల మేరకు పినాక రాకెట్ లో పలు మార్పులు చేసింది. టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో పినాక రాకెట్ల కక్ష్యను డీఆర్డీవో పరిశీలించింది. మొత్తానికి సామర్థ్యం పెంచిన తరువాత కూడా పినాక రాకెట్లు విజయవంతం కావడంతో డీఆర్డీవో వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. పినాకా రాకెట్లు అనుకున్న ఫలితాలు ఇవ్వడంతో.. త్వరలోనే ఆర్మీకి అప్పగించనున్నట్లు ఆర్మీ ప్రకటించింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో తరుచూ చొరబాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 45 కిలోమీటర్ల రేంజ్ ను చేధించగల.. ఈ షార్ట్ రేంజ్ రాకెట్లు శత్రువును దీటుగా ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

    Trending Stories

    Related Stories