ఇది నిజంగా భారతీయులకు తీపి కబురే. దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత యుద్ధ విమానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ శుక్రవారం తొలిసారి విజయవంతంగా పరీక్షించింది.
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించారు. మానవ రహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద విజయం సాధించినట్లు డీఆర్డీవో తెలిపింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ తొలి విమానాన్ని శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
కాగా, మానవరహిత యుద్ధ విమానానికి సంబంధించిన మరిన్ని వివరాలను డీఆర్డీవో వెల్లడిచింది. ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తి మోడ్‌లో పనిచేస్తుందని తెలిపింది. టేకాఫ్, వే పాయింట్ నావిగేషన్, స్మూత్ టచ్‌డౌన్‌తో సహా ఖచ్చితమైన అన్ని ప్రమాణాలను ఈ విమానం చేరుకున్నట్లు చెప్పింది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఈ విమానం ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని వివరించింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా ముఖ్యమైన అడుగు అని వెల్లడించింది.
మరోవైపు మానవరహిత వైమానిక వాహనంను డీఆర్డీవో ఆధ్వర్యంలోని ప్రధాన పరిశోధనా ప్రయోగశాల అయిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూపొందించడంతోపాటు అభివృద్ధి చేసింది. ఇది చిన్న టర్బోఫ్యాన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. మానవరహిత విమానం కోసం ఉపయోగించిన ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్, ఏవియానిక్స్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవోను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వ్యూహాత్మక సైనిక వ్యవస్థల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ప్రశంసించారు.