Defence SpecialKshaatramNational

రక్షణ రంగంలో అద్భుత ఆవిష్కరణలు..! యాంటి ట్యాంక్ మిస్సైల్ గ్రాండ్ సక్సెస్..!!

భారత్ రక్షణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ వస్తోంది. ఆయుధ సంపత్తిలో అగ్రరాజ్యాలతో పోటీ పడేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

అలాగే క్షిపణీలు, అడ్వాన్స్డ్ ఆయుధాల తయారీకి ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలు తయారు చేసేందుకు డీఆర్డీవోను అన్ని విధాలుగా కేంద్రం ప్రభుత్వం ప్రొత్సహిస్తూ వస్తోంది. అయితే ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా ఇప్పటికే డీఆర్డీవో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేపట్టింది. తాజాగా రక్షణ రంగం మరో మైలు రాయిని దాటింది. ఇప్పటి వరకు విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడిన భారత్ తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ మిస్సైల్ని అభివృద్ధి చేసింది.

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ట్రయల్‌ని విజయవంతం చేసినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో, భారత సైన్యాన్ని అభినందించారు. డీఆర్డీవో, భారత సైన్యం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ని అర్జున్ యుద్ధ ట్యాంక్ నుండి విజయవంతంగా ప్రయోగించామని మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

ఏటీజీఎం పరీక్షలో ఖచ్చితమైన లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. అలాగే టెలిమెట్రీ వ్యవస్థలు సంతృప్తికరమైన విమాన పనితీరును నమోదు చేసినట్లు స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు ఏటీజీఎం డైమెన్షనల్ పరిమితుల కారణంగా దిగువ శ్రేణులలోని లక్ష్యాలను చేధించడం ఒక సవాలుగా ఉండేదని.. ఇది అర్జున్ ట్యాంక్ కోసం ఏటీజీఎం ద్వారా విజయవంతం అయ్యిందని తెలిపింది. ఈ ట్రయల్ తో గరిష్ట లక్ష్యాలను సైతం ఏటీజీఎం చేరుకుందని వెల్లడించారు.

అయితే గత మూడేళ్లుగా రక్షణ శాఖలో రాజ్ నాథ్ సింగ్ అనేక సంస్కరణలకు తెర తీశారు. చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గామిని అత్యంత ఖచ్చితత్వంతో పేల్చివేసే అధునాతన ఆయుధ వ్యవస్థను భారత్‌ గతేడాది విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్త తరం క్షిపణి ప్రళయ్‌ తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే క్షిపణి. అలాగే రక్షణ రంగంలోని ఏడు కొత్త పీఎస్యూలను ప్రధాని మోదీ గతేడాది అక్టోబర్‌లో జాతికి అంకితం చేశారు. 200 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ స్థానంలో ఈ ఏడు పీఎస్యూలు ఆవిర్భవించాయి. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌లో 41 ఫ్యాక్టరీలు, 9 అనుబంధ సంస్థలు ఉండేవి. వాటన్నింటిని విలీనం చేసి ఏడు కొత్త ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చారు.

అలాగే శత్రు దేశాలు ప్రయోగించే రాడార్‌ గైడెడ్‌ క్షిపణుల నుంచి యుద్ధ విమానాలను కాపాడుకొనేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అధునాతన చాఫ్‌ పరిజ్ఞానాన్ని గతేడాది ఆగస్ట్‌లో అభివృద్ధి చేసింది. శత్రు రాడార్‌, రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి యుద్ధ విమానాన్ని రక్షించే వ్యవస్థలో ఒక భాగమే చాఫ్‌ వ్యవస్థ. అధునాతన శత్రు క్షిపణుల నుంచి యుద్ధ విమానాలను రక్షించుకొనేందుకు కౌంటర్‌ మెజర్‌ డిస్పెన్సింగ్‌ సిస్టమ్‌ను వినియోగిస్తారు. ఇందులోనే చాఫ్‌ వ్యవస్థ భాగం. ఇక ల్యాండింగ్ గేర్‌ వ్యవస్థలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ నౌకాదళానికి అప్పగించింది. ఇవి మానవ రహిత విమానాలు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. దేశీయంగా తయారు చేసిన జలాంతర్గామి వేలా గతేడాది భారత నౌకాదళంలోకి చేరింది. నేవీలో ఇది నాలుగో తరం స్కార్పీన్‌ రకం జలాంతర్గామి. ఇలా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ శాఖలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

20 − 4 =

Back to top button