పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులతో రక్షణ రహస్యాలను పంచుకున్నందుకు ఒడిశా పోలీసులు కొద్దిరోజుల కిందట డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క నలుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. బాలసోర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, మన దేశం యొక్క భద్రత, సార్వభౌమత్వం మరియు సమగ్రతకు తీవ్రమైన హాని కలిగించే నేరానికి పాల్పడినందుకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నలుగురు డీఆర్‌డీఓ కాంట్రాక్టు ఉద్యోగులు.. బాలాసోర్‌జిల్లా చాందీపూర్‌లోని డీఆర్‌డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్‌లో పనిచేస్తు ఉండేవారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందని.. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని వీరి అరెస్టు సమయంలో పోలీసులు తెలిపారు. ఇప్పటి దాకా ఈ కేసులో మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రహస్యాల లీకేజీ వెనక ఓ మహిళ పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుల్లో ఒకరి బ్యాంకు ఖాతాకు దుబాయ్ నుంచి రెండు విడతలుగా రూ. 38 వేలు వచ్చినట్టు గుర్తించారు. ఓ మహిళతో నిందితులు ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసిన విషయం కూడా దర్యాప్తులో వెల్లడైంది. పాక్ కు చెందిన మహిళ అని అనుమానిస్తున్నారు. యూకేకు చెందిన ఫోన్ నంబరు ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఆమె చాటింగ్ చేసినట్టు గుర్తించారు. ఆమె ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతో పరిచయం ఏర్పడగా రహస్యాలు పంపేందుకు వారితో డీల్ కుదుర్చుకున్నారు. ఆ మహిళ వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. భారత వైమానిక దళాధికారులు కూడా కటక్‌లో రెండు రోజులపాటు నిందితులను ప్రశ్నించారు. యూపీ వ్యక్తుల చేతుల్లో చిక్కిన నిందితులు వారి ఆదేశాల మేరకు రహస్యాలు సేకరించి పంపేవారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నగదు లావాదేవీలు మాత్రం పాక్, బంగ్లాదేశ్‌లోని స్లీపర్ సెల్స్ ద్వారా జరిగేవని తెలుసుకున్నారు.
అలా పట్టుకున్నారు:
నిందితులకు పలు ఐఎస్‌డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చేవి. దీన్ని గమనించిన వెంటనే నలుగురు డీఎస్‌పీలతో ఏర్పాటైన పోలీసు టీములు దర్యాప్తు ఆరంభించాయి. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికిపోయారు. సమాచారాన్ని విదేశీ ఏజెంట్‌లతో పంచుకున్నారని స్పష్టమైన ఆధారాలు దొరికాయి. అనుమానిత ఏజెంట్లు నిందితులను వేర్వేరు ISD ఫోన్ నంబర్లను ఉపయోగించి సంప్రదించారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.