భారత్ లో వ్యాక్సినేషన్ కొరత తీర్చడానికి రష్యా నుండి స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు వచ్చాయి. హైదరాబాద్ లో నేడు స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ రెడ్డీస్ సిబ్బంది అశోక్ కు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను ఇచ్చారు. మరి కొందరు డా రెడ్డీస్ సిబ్బందికి స్పుత్నిక్ వ్యాక్సిన్ వేశారు. మే 1న 1.5 లక్షల టీకా డోసులు, ఆదివారం నాడు 60 వేల టీకా డోసులు రష్యా నుంచీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నాయి.మొత్తం 2.10 లక్షల డోసులతో నేటి నుంచీ మనదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ మొదలవుతోంది. డా రెడ్డీస్ సిబ్బంది 10వేల మందికి మొదట ఈ వ్యాక్సిన్ ను వేయనున్నారు. స్పుత్నిక్ వి టీకా పంపిణీకి ఆర్డీఐఎఫ్, డాక్టర్ రెడ్డీస్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఈ టీకాపై డాక్టర్ రెడ్డీస్ అన్ని దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించి టీకా పంపిణీకి అనుమతి పొందింది.
రష్యా ప్రభుత్వ సంస్థ గమాలియా రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కరోనా వైరస్‌లోని ఎస్ ప్రొటీన్‌ను అడినోవైరస్లతో కలపి ఆర్ఏడీ26, ఆర్ఏడీ5 అనే డోసులుగా వ్యాక్సిన్‌ను చేశారు. 40 వేల మందిపై మూడో ఫేజ్ ట్రయల్స్ నిర్వహించారు.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఇటీవలే ప్రకటించింది. ఒక్కో డోస్ ధర రూ.995గా నిర్ణయించింది. టీకా వాస్తవ ధర రూ.948 కాగా.. దీనికి జీఎస్టీ అదనమని తెలిపింది. ఇది దిగుమతి చేసుకున్న టీకా ధర మాత్రమేనని తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేసే టీకా ధరపై క్లారిటీ రావాల్సి ఉంది. దేశీయ వ్యాక్సిన్ ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి భారత్‌లో రెడ్డీస్ ల్యాబొరేటరీ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ రెడ్డీస్ నిర్వహించింది. దేశీయంగా ఏడాదికి 85 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయబోతున్నామని రెడ్డీస్ ల్యాబొరేటరీ ప్రతినిధులు తెలిపారు.
స్పుత్నిక్-వి టీకా 91.6% ప్రభావశీలత కలిగినదిగా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు ఆర్డీఐఎఫ్ ప్రకటించింది. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేయాలి. ఇది కూడా 2 డోసుల టీకానే.. మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వాలి. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.