More

    పద్మశ్రీ డాక్టర్ కెకె అగర్వాల్ ఇక లేరు

    సోమవారం(మే 17) రాత్రి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ కన్నుమూశారు. ఆయన క‌రోనాతో క‌న్నుమూశారని వైద్యులు తెలిపారు. 62 ఏళ్ల వయస్సులో డాక్టర్ అగర్వాల్ కరోనా మహమ్మారి సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన(ఐ.ఎం.ఏ.)కు ఆయన ప్రెసిడెంట్ గా సేవలు అందించారు.

    రిపోర్టుల ప్రకారం డాక్టర్ అగ‌ర్వాల్ సోమ‌వారం రాత్రి 11:30 గంటలకు ఢిల్లీ లోని ఎయిమ్స్ లో మృతి చెందారని కుటుంబం ప్రకటించింది. ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఉంచారని చెప్పారు. డాక్టర్ కెకె అగర్వాల్ ఆరోగ్యం గురించి వివిధ‌ ర‌కాల వ‌దంతులు వ‌స్తున్నాయ‌ని వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని వారు దానిలో పేర్కొన్నారు. డాక్ట‌ర్ కేకే అగ‌ర్వాల్‌ భార్య కూడా కరోనా బారిన‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందినప్పటి నుండి సోషల్ మీడియా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీడియోలను చేస్తూ వచ్చారు. బ్లాక్ ఫంగస్ కేసులను ఎలా ఎదుర్కోవాలో కూడా కీలక సూచనలు ఇచ్చారు. కరోనా సోకిన వాళ్లు కుంగిపోవాల్సిన అవసరం లేదని తన వీడియోల ద్వారా ఆత్మ స్థైర్యాన్ని నింపే దిశగా అడుగులు వేశారు.

    ప్రముఖ జార్డియాలజిస్ట్ మాత్రమే కాదు.. ఆయన హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించారు. ఢిల్లీలో ప్రైమరీ విద్యను అభ్యసించిన అగర్వాల్ నాగపూర్ యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. 2005లో డాక్టర్ బి.సి.రాయ్ అవార్డును అందుకున్నారు. డాక్టర్ అగర్వాల్ 2010 పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) మాజీ అధ్య‌క్షుడుగా ఎనలేని సేవలు చేశారు.

    ఆయన మరణంపై కుటుంబం అధికారిక స్టేట్మెంట్ ను విడుదల చేసింది. డాక్టర్ పట్టా పొందినప్పటి నుండి చనిపోయే ముందు రోజుల వరకూ ప్రజా సేవకే అంకితమయ్యారని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. భారత్ లో కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో కూడా సోషల్ మీడియా ద్వారా వీడియోలను చేస్తూ చాలా మందిలో ధైర్యాన్ని నింపారు. 100 మిలియన్ల మందిలో అగర్వాల్ ఆత్మస్థైర్యాన్ని నింపారని డాక్టర్ కెకె అగర్వాల్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన చేసిన మంచిని గుర్తు పెట్టుకుందామని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

    జనవరి నెలలో డాక్టర్ కెకె అగర్వాల్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వ్యాక్సిన్ వేయించుకోడానికి వెళ్లిన అగర్వాల్ కు భార్య నుండి ఫోన్ రాగా.. తనను ఎందుకు తీసుకుని వెళ్లలేదని ఆయన భార్య ప్రశ్నించడం గమనించవచ్చు. ఈ వీడియో నవ్వులు పూయించింది.

    Trending Stories

    Related Stories