బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ ఎంపీ హోదాలో పార్లమెంటు భవన్లోకి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ కోటా నుంచి లక్ష్మణ్ ఎంపీగా ఎన్నికయ్యారు. శుక్రవారం నాడు 31 మంది కొత్త ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో లక్ష్మణ్ కూడా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించిన కె.లక్ష్మణ్ ఇకపై రాజ్యసభ సభ్యుడిగా కొత్త ప్రస్థానాన్నిమొదలుపెట్టారు. పార్లమెంటు భవనంలోకి ఎంపీ హోదాలో తొలిసారిగా అడుగుపెట్టిన సందర్భంగా లక్ష్మణ్ పార్లమెంటు భవన్ మెట్లకు దండం పెట్టారు.
డా.కె.లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు లక్ష్మణ్. యూపీ నుంచి తనని రాజ్యసభకు ఎంపిక చేయడం.. తెలంగాణపై జాతీయ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నాకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపని చెప్పుకొచ్చారు.