యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్, పొరుగు దేశాలలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలిస్తామని కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ మంగళవారం ఉదయం ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. వారు ఉన్న చోటే ఉండాలని, చెప్పే వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని కోరారు. “Stay where you are, don’t move until you are told, and don’t panic. Your country will safely evacuate you. Jai Hind,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సోమవారం ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. నలుగురు మంత్రులు ఉక్రెయిన్ పొరుగున ఉన్న వివిధ దేశాలకు వెళ్లి ‘ఆపరేషన్ గంగా’ లో భాగంగా భారతీయుల తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయాలని నిర్ణయించారు. వీకే సింగ్‌ను పోలాండ్‌కు పంపగా, హర్దీప్ పూరీ హంగేరీలో ఉంటారు. జ్యోతిరాదిత్య సింధియా రొమేనియా నుండి తరలింపు ప్రయత్నాలను చూసుకుంటారు. మోల్డోవా, స్లోవేకియాలో ఉక్రెయిన్ నుండి భూ సరిహద్దుల ద్వారా వచ్చిన భారతీయుల తరలింపును కిరెన్ రిజిజు చూసుకోనున్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారి కుటుంబాలకు మీ పిల్లలు త్వరలో తిరిగి వస్తారు అని రోడ్డు రవాణా, హైవేలు మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ VK సింగ్ హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడులకు దిగింది. అప్పటి నుండి, భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులందరినీ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
తక్షణమే కాల్పులు ఆపాలని రష్యా, ఉక్రెయిన్ దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. సంయమనం పాటించాలని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చర్చలను ప్రారంభించాలని ఐరాస జనరల్ అసెంబ్లీ సూచించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని సోమవారం అత్యవసరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా సంయమనం పాటించాలని ఐరాస సూచించింది. పెరిగిపోతున్న హింస ద్వారా అనేక మంది సాధారణ పౌరులు చనిపోతున్నారని ఐరాస సెక్రటరీ జనరల్ ఆటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా జరిగిన దానిని పక్కనపెట్టేసి ఇరు దేశాల సైనికులు తమ స్థావరాలకు వెళ్లిపోవాలని సూచించారు.