2024లో మళ్లీ మోదీ

0
936

వివరం బహిర్గతం చేయకుండా చేయాల్సింది మౌనంగా చేసేవాళ్లూ, ఏమీ మాట్లాడకుండా ఏమీచేయకుండా ఉండేవాళ్లూ, ఎన్నోమాట్లాడి ఏమీ చేయకుండా ఉండేవాళ్లు మూడురకాల మనుషులు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కోవలోకి వస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అది జగమెరిగిన సత్యం. హుజూరా బాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ బీజేపీ విషయంలో తన వైఖరి మార్చుకున్నట్టూ ప్రజలకు అనిపించేలా తరచూ మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలను వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషిస్తున్నారు.

తాజాగా తమిళనాడు వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యారు. కాంగ్రెసేతర కూటమి గురించి చర్చించారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ ప్రస్తావించి ఆ తర్వాత తిరిగి మళ్లీ ఊసే మరిచిపోయారు. అప్పుడు కూడా తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. తాజాగా మరోసారి డీఎంకేతో తృతియ కూటమి చర్చలకు తెరలేపారు. కాంగ్రెస్ లేని కూటమిలో తాము ఉండబోమనీ, సమాఖ్యభావనకు అవకాశం తక్కువంటూ కుండబద్దలు కొట్టారు స్టాలిన్.

కేసీఆర్ పదేపదే అంటున్న ‘సమాఖ్య స్ఫూర్తి’ తరచూ వైఖరులు మార్చుకునే ప్రాంతీయ పార్టీల వల్ల సాధ్యమా? కాంగ్రెస్ రహిత ‘కూటమి’ సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీని ఎన్నికల మైదానంలో ఎదిరించి అనుకున్న ఫలితాలను సాధించగలదా? రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కాంగ్రెస్ ను ఒంటరి చేయడంలో, అంతర్గత అసంతృని మరింత పెంచడంలో, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోయేలా చేయడంలో కమలం పార్టీ వ్యూహాత్మకంగా పై చేయి సాధించిందా? 2024లో జరిగే సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్-ప్రాంతీయ  పార్టీల మైత్రిని భగ్నం చేసేందుకు ప్రణాళిక ప్రకారమే వ్యవహరించిందా?

మొత్తంగా కేసీఆర్ వ్యూహమేంటి? 2024 సాధారణ ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉండనుందో చెప్పే ప్రయత్నం చేస్తాను.

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక బెంగళూరు ఎడిషన్.. అక్టోబర్ 1న ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ‘‘Will BJP be the only national party in 2024? ’’ అంటూ ఆకర్శించే శీర్షకను పెట్టింది. ఢిల్లీలో జరిగిన సీపీఎం పొలిట్ బ్యూరోలో చర్చకు వచ్చిన కాంగ్రెసేతర కూటమి గురించి ఈ కథనంలో పేర్కొంది.

‘బలహీనపడిన కాంగ్రెస్ తో కూటమికట్టి 2024లో బీజేపీని ఎదర్కోవడం అసాధ్యమనీ, ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసినా కమలం పార్టీని నిలువరించడం ఏ మేరకు సాధ్యమనే చర్చ సీపీఎం పొలిట్ బ్యూరో లో వచ్చిందనీ టైమ్స్ ఆఫ్  ఇండియా కథనం వెల్లడించింది. అంతేకాదు, మూడు రకాల ప్రత్యామ్నాయాలను చర్చించిందట!

కాంగ్రెస్ క్రమంగా రాష్ట్రాల్లో బలహీనపడుతోంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో ‘జాతీయ స్థాయి పార్టీ’కి ఉండాల్సిన ప్రాబల్యాన్ని కోల్పోతుంది కాబట్టి బీజేపీ మాత్రమే ఏకైక జాతీయ పార్టీగా మారే అవకాశముందనీ, గతంలో వామపక్షాల చొరవతో ఏర్పడిన ‘మూడో ఫ్రంట్’ ఇప్పుడు కూడా అసాధ్యం కాబట్టి మిగిలింది ఏకైక ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం మాత్రమేనని పొలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడిందట.

అరుదుగా అయినా కమ్యూనిస్టులు వాస్తవాన్ని గ్రహిస్తారు. సీపీఎం ఎదుర్కోబోయే స్థితిని సరిగ్గానే గణించింది. అయితే, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అర్థబలం, అంగబలం ఉన్న పార్టీలు బలహీన స్థితిలో చతికిలపడ్డ వామపక్షాల మాటవిని కాంగ్రెస్ కుంపటి వద్దనుకుంటారా అంటే…పార్లమెంట్ లో 60కి పైగా స్థానాలున్న రోజుల్లో విన్నారేమో గానీ, అరడజను మంది బలం కూడా లేని కాలంలో వినడం అసాధ్యం కూడా.

ప్రాంతీయ పార్టీలకూ, కాంగ్రెస్ పార్టీకి మధ్య అగాధం హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. యూపీఏ-2 నాటికి దాని ఇరుసులు సడలిపోయాయి. బీజేపీ లోకి వెళ్లలేని సీనియర్ లు, అసంతృప్తితో ఉన్న యువనేతలు సందిగ్థావస్థలోనే కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే తన వ్యూహంతో, ప్రచార అస్త్రాలతో కాంగ్రెస్ పతన వేగంలో స్పీడును పెంచడంలో విజయవంతమైంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లాగూ బలహీనపడుతోంది. కాబట్టి, త్వరగా కూల్చే వ్యూహాలను అనుసరించింది.

ఈ నేపథ్యం నుంచి చూస్తే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. తాము ఐదుపదేళ్ల కోసం అధికారంలోకి రాలేదని అమిత్ షా పోసుకోలుగా అనలేదు. ఈ ప్రకటన వెనుక సుదీర్ఘ కసరత్తు జరిగింది. అందులో నుంచి పుట్టుకువచ్చిందే ‘కాంగ్రెస్ రహిత భారత్’ నినాదం. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో తమకు బలమైన పోటీదారుగా ఉన్న జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను బలహీన పరిస్తే…ప్రాంతీయ పార్టీలకు సహజంగానే ఆ పార్టీపై విశ్వాసం పోతుంది.

ఐక్యత బీటలు వారుతుంది. ప్రాంతీయ పార్టీలు ఎలాగూ ఐక్యం కావు, అయినా తమను నిలువరించలేవు కాబట్టి 2024 నాటికి జాతీయ పార్టీగా బీజేపీ మాత్రమే ఉండే అవకాశం ఉందని ముందే ఆ పార్టీ గుర్తించింది. ప్రాంతీయ పార్టీలు ఒక వేళ కూటమిగా ఏర్పడినా పోటీ ఇవ్వలేవు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ ప్రయోజనాలూ, అధికారం కోసం కూడా…కాంగ్రెస్ ను బలహీనపరచడం ఖాయమని అంచనా వేసింది. అందుకే 2019లో రెండోసారి బీజేపీకి పూర్తిమెజారిటీ-303 స్థానాలు వచ్చినా ఎన్డీఏని జాగ్రత్తగా కాపాడుకుంది. బలం వచ్చిందని మిత్రపక్షాలను దూరం చేసుకుంటే వ్యతిరేకత హెచ్చుతుంది.

ఈ కారణం వల్లే రాందాస్ అథవాలే ఒక్కడే ఉన్న రిపబ్లికన్ పార్టీనీ, ఒకే ఒక్క ఎంపీ ఉన్న ఎల్జేపీ, హర్యానాలో చిన్నపార్టీ అయిన జననాయక్ జనతా పార్టీని ఎన్డీఏలో భాగస్వాములుగా కొనసాగించింది. బిహార్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఎల్జేపీని ఒంటరి పోరుకు దింపి, ఓట్లను చీల్చి నితీశ్ బలాన్ని కుదించింది. అయినా సరే నితీశ్ కుమార్ కే ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నితీశ్ సాయం అవసరమని బీజేపీ భావిస్తోంది. ఒకరిద్దరు ఎంపీలున్నా, అతిచిన్న పార్టీలైనా సరే తన ఛత్రఛాయలో ఉండాలని బీజేపీ కోరుకుంటోంది.

అకాలీదళ్, కాంగ్రెస్ బలంగా ఉన్న పంజాబ్ లో ఉన్నఫళాన ఫలితాలు సాధించడం సాధ్యం కాదు, కాబట్టి కేప్టెన్ అమరీందర్ సింగ్ కు- కాంగ్రెస్ అధిష్ఠానానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఉపయోగించి సొంతకుంపటి పెట్టేలా ప్రోత్సహించడం వెనుక చాలా తతంగం, మంత్రాంగం నడిచింది. ఈ కారణంగానే కాంగ్రెస్ ను వీడగానే అమిత్ షా తో భేటీ ఆయ్యారు అమరీందర్.

బీజేపీ సైద్ధాంతికంగా ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమే అయినా తాత్కాలిక వ్యూహాత్మ అవసరాల ప్రాధాన్యతను గుర్తించడం కూడా ముఖ్యం. కేప్టెన్ బీజేపీలో చేరితే ఫలితాల్లో మార్పురాదు. పైగా రైతు చట్టాల విషయంలో పంజాబ్ లో ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి వేరుకుంపటి పెట్టడమే ఉత్తమమని తలచారు కమలనాథులు. కేప్టెన్ వేరు కుంపటి పెట్టడమూ, బీజేపీతో కలిసి పోటీచేయడం కూడా ఖరారైపోయింది.

పంజాబ్ విషయంలో ‘కశ్మీర్’ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంది బీజేపీ. కశ్మీర్ లో ప్రాంతీయ పార్టీలకు దశాబ్దాల తరబడి అధికారాన్ని వదిలేయడం వల్ల పాలన వ్యవహారాల రహస్యాలు మంత్రకవాటంలోనే ఉండిపోయాయి. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు పీడీపీతో పొత్తు పెట్టుకుని క్రమంగా పాలనాయంత్రాంగంపై పట్టుబిగించింది బీజేపీ. ప్రభుత్వ ఉద్యోగులు ఉగ్రవాద గూఢచారులుగా మారిపోయాయి. సరిహద్దు రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంటేనే భద్రతా వ్యూహం సమగ్రంగా అమలవుతుందని బీజేపీ గుర్తించింది. పైగా పంజాబ్ లో ఇటీవలి పరిణామాలు ప్రమాదకరంగా మారాయి.

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గినా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో సంఖ్యను పెంచుకునే విషయంలో అమిత్ షా ప్రత్యేకమైన, పకడ్బందీ వ్యూహాన్ని అనుసరిస్తారు. రాష్ట్రాల్లో బీజేపీ బలపడటం అనేది వెనువెంటనే జరిగేది కాదు కాబట్టి, కేంద్రంలో అధికారం కాపాడుకోవడం తక్షణ అవసరం. దీన్నే అనుసరిస్తున్నారు అమిత్ షా. ఒడిశా, బెంగాల్, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలను పెంచుకోవడంపై ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై దృష్టిసారించడం, అనుకూలమైన ప్రాంతీయ పార్టీలను తన గొడుగు కిందకు తెచ్చుకోవడం లాంటి ఎత్తుగడలను అనుసరిస్తోంది బీజేపీ.

రాహుల్ ను విఫలసారథిగా అందరూ ఆమోదముద్ర వేసేలా చేయడం, కాంగ్రెస్ లోని గ్రూప్-23 విషయంలో సానూకూలంగా వ్యవహరించడం, ప్రధాని మోదీ పార్లమెంట్ లో కాంగ్రెస్ సీనియ్ నేత గులాంనబీ ఆజాద్ ని పొగడ్తలతో ముంచెత్తడం ప్రతిదీ…అనుకుని చేసిందే తప్ప యాదృచ్చికంగా చేసినవి కాదు.

ప్రతి ఎన్నికా భిన్నమైంది. ఏ రెండు ఎన్నికలనూ పోల్చలేం. అంతిమ ఫలితాలను కచ్చితంగా అంచనావేయలేం. కాబట్టి ప్రతిక్షణాన్ని స్వీయ బలాన్ని పెంచుకోవడానికీ, బలహీనతను అధిగమించడానికి, మిత్రపక్షాలను చేరదీయడానికి ఉపయోగిస్తోంది బీజేపీ.

ఇవేవీ సరికొత్త మహాద్భుత వ్యూహాలేమీ కావు. గతంలో పార్టీలు అనుసరించనవే! కాకపోతే బీజేపీ వాటిని పొందిగ్గా, పద్ధతిగా, దీర్ఘకాల వ్యూహంతో, సంయంనమంతో, సమన్వయంతో సంధిస్తోంది.

కేసీఆర్ కాంగ్రెస్ రహిత కూటమి నిజంగా రూపం పోసుకుంటుందా? చూద్దాం….

రాష్ట్రం దాటి విస్తరించడానికి వీలులేని ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావడం అసాధ్యమనే విషయం కేసీఆర్ కు స్పష్టంగా తెలుసు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ కూటమి సాధ్యాసాధ్యలను అంచనావేయలేరని అనుకోలేం. అయితే ఎందుకు పదే పదే ఫెడరల్ ఫ్రస్తావన తెస్తున్నట్టూ అనే సందేహం రావచ్చు.

తెలంగాణలో బలపడుతున్న బీజేపీని తన మాటబలంతో నిలువరించాలన్న పట్టుదల, నిలువరించగలనన్న విశ్వాసాలే ఇందుకు కారణం. అయితే కేసీఆర్ మాటదురుసుతనం, ఒంటికాలిపై లేవడం, హడావిడి సృష్టించడం లాంటి ప్రవర్తన బీజేపీ విస్తరణను నివారించలేవు. కేసీఆర్ మాటల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందనే భావన కొన్నాళ్లు కలిగేలా చేయవచ్చు కానీ, ప్రజాదరణ స్థిరంగా కొనసాగేందుకు ఉపకరించవు.

మరి 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏం జరిగే అవకాశం ఉంది?

కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో చేరాలా వద్దా అనే ప్రాంతీయ పార్టీల మీమాంస, జాతీయ పార్టీ అయిన తాను ప్రాంతీయ పార్టీలను ప్రాధేయపడటమేంటనే కాంగ్రెస్ అహంభావం వెరసి సందిగ్ధత మరింత కాలం కొనసాగుతుంది. మిగతా ప్రాంతీయ పార్టీల మాటెలా ఉన్నా ….వామపక్షాలకు కాంగ్రెస్ బతకడం ప్రాణావసరం కాబట్టి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఏమైనా చేసి ఒప్పిస్తే చివరి రోజుల్లో సయోధ్య కుదరవచ్చు కానీ, అది విశ్వాసం లేని మైత్రి కావడం వల్ల చివరకు అది విఫల ప్రయోగంగానే మిగులుతుంది. మొత్తంగా జాతీయ పార్టీగా ప్రయాణం ఆరంభించి, దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ చివరికి చిన్నా చితకా ప్రాంతీయ పార్టీల ఈసడింపులను భరించవలసి స్తోంది. అవరోహణా క్రమాన్ని నివారించలేని స్థితిలో జాతీయ పార్టీ ప్రాబల్యాన్ని క్రమంగా కోల్పోతుంది. ఏకైక జాతీయ పార్టీగా బీజేపీ మరోసారి 2024లో మరోసారి అధికారం సాధిస్తే.. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు బీజేపీ విషయంలో మౌనాన్ని వహిస్తాయి. మరికొన్ని రాజీ మార్గాన్ని అనుసరిస్తాయి. కాంగ్రెస్ పార్టీ కకావికలమైపోతుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

7 − 4 =