అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్, ఫేస్‌బుక్ ఖాతాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేయడంతో హింసను ప్రేరేపించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని.. పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రంప్ పై సోషల్ మీడియా దిగ్గజాలు నిషేధం విధించాయి. క్యాపిటల్ హిల్స్ భవనంలో హింస చెలరేగేలా తన ఫాలోవర్లను ప్రేరేపించినందుకు ఆయన ఖాతాలపై నిరవధిక నిషేధం విధించాయి. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను మూకుమ్మడిగా బ్యాన్ చేశారు. ఇటీవల ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్రంప్ ను ట్విట్టర్ లోకి ఆహ్వానించగా.. ఇప్పుడు యూట్యూబ్, ఫేస్‌బుక్ లోకి కూడా వచ్చేశారు.
ఈ ఏడాది జనవరిలో ‘మెటా’ ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. గత నెలలో ఆయన ఇన్‌స్టాగ్రాం ఖాతాను పునరుద్ధరించింది. తాజాగా ఫేస్‌బుక్, యూట్యూబ్ ఖాతాలపై కూడా బ్యాన్ తొలిగిపోయింది. రెండేళ్ల తర్వాత ఆయన ఎఫ్‌బీ, యూట్యూబ్ యాక్టివ్ అయ్యాయి. 2024లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ పునరుద్ధరించబడడం ఆయన వర్గానికి ఊరటనిచ్చే విషయం. గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగానే ఆయన భారీగా నిధులు సమకూర్చుకున్నారు. ఈసారి కూడా ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాలు భారీగా సహాయపడనున్నాయి. ట్రంప్ తన ఫేస్‌బుక్ పేజీతో పాటు యూట్యూబ్‌లో I’M BACK! అనే క్యాప్షన్‌తో 2016లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.