కాబూల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్ళిపోయారు. అష్రఫ్ కు సహాయం చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక ప్రకటన చేసింది. అష్రఫ్ ఘనీకి ఆయన కుటుంబానికి తాము ఆశ్రయం ఇచ్చామని యూఏఈ ప్రకటించింది. దేశంలోని ఏ నగరంలో ఆయన ఉన్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది.
అష్రఫ్ ఘనీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ దిగజారుతున్న పరిస్థితిపై ట్రంప్ స్పందిస్తూ “అష్రఫ్ ఘనీపై పూర్తి విశ్వాసం ఎప్పుడూ లేదని” అన్నారు. అష్రఫ్ ఘనీ మా సెనేటర్లతో భోజనం చేయడానికి మాత్రమే తన సమయాన్ని వెచ్చించాడని ఆరోపించారు. “అష్రఫ్ ఘనీ మోసగాడు అని బహిరంగంగా మరియు స్పష్టంగా చెప్పాను” అని ట్రంప్ అన్నారు. తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరదార్ తో కూడా ఘనీ ఒప్పందం కుదుర్చుకున్నాడని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న అమెరికా పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు బైడెన్ ప్రభుత్వానికి ట్రంప్ ఓ చెత్త సలహా ఇచ్చారు. ‘మొదటగా అమెరికా పౌరులను, ఆ తర్వాత పరికారలను తరలించిన అనంతరం అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాల్సింది. చివరగా మిలటరీని వెనక్కి రప్పించాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదెక్కడి సలహా అని ట్రంప్ ను తప్పుబడుతూ ఉన్నారు.
డబ్బుతో పారిపోయాడంటూ తీవ్ర ఆరోపణలు.. వివరణ ఇచ్చిన అష్రఫ్
అష్రఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన ఆరోపణలు చేసింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు అంటున్నారు. నాలుగు కార్లలో నిండుగా డబ్బులు నింపారు. ఇంకా మిగిలిన డబ్బును ఒక హెలికాప్టర్లో కుక్కారు. అయినా మొత్తం డబ్బును తీసుకెళ్లలేకపోయారు. కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని కళ్లారా చూశారని.. అయితే ఈ మాటల్లో ఎంత వరకూ నిజముందనే విషయంలో సరైన స్పష్టత లేదని రష్యన్ ఎంబసీ చెప్పుకొచ్చింది. తజకిస్థాన్‌లోని ఆప్ఘనిస్థాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోతూ దేశ ఖజానా నుంచి రూ. 1,255 కోట్లు (169 మిలియన్ అమెరికన్ డాలర్లు) తస్కరించారని ఆరోపించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని ఇంటర్‌పోల్‌ను డిమాండ్ చేశారు.
తన మీద వచ్చిన ఆరోపణలపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించారు. యూఏఈ నుంచి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. డబ్బులతో పరారైనట్టు వచ్చిన ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. రక్తపాతం జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను కాబూల్‌ను విడిచిపెట్టినట్టు చెప్పారు. ఆ సమయంలో తనకు బూట్లు ధరించే సమయం కూడా లేకుండా పోయిందని, చెప్పులతోనే ఆదివారం అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టినట్టు చెప్పారు. అధ్యక్షుడు మిమ్మల్ని అమ్మేసి తన దారి తాను చూసుకున్నాడంటూ ఎవరేం చెప్పినా నమ్మకండని అష్రఫ్ చెప్పారు. దుబాయ్‌లోనే ప్రవాస జీవితం గడపాలని తనకు లేదని, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నానని అన్నారు. తాను కాబూల్‌లోనే ఉండి ఉంటే ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తనను ఆఫ్ఘన్ ప్రజల కళ్లముందే ఉరితీసేవారని ఘనీ తెలిపారు.