టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ ఎంతో మంది ప్రముఖులు బ్రూనో అనే కుక్కకు న్యాయం జరగాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. మనుషుల క్రూరత్వానికి ఓ అమాయకమైన మూగ జీవి ప్రాణాలు పోయాయి. మనుషులు ఎంత కిరాతకులో చెప్పే ఘటన ఇది. కేరళలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. యజమానులతో వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ముగ్గురు వ్యక్తులు ఎనిమిదేళ్ల నల్ల లాబ్రడార్ను చంపారు. నిందితులు చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందరూ చూసి షాక్ అవుతూ ఉన్నారు.

కేరళలోని తిరువనంతపురంలోని ఆదిమలతుర ప్రాంతంలోని క్రిస్తురాజ్ కుటుంబం బ్రూనో అనే లాబ్రడార్ను చూసుకుంటూ ఉండేది. బ్రూనో అప్పుడప్పుడు బీచ్ కు వెళుతూ ఉండేది. పడవల కింద పడుకుంటూ ఉండేది. బ్రూనో బయటకు వెళ్లినా మధ్యాహ్నం సమయానికల్లా ఇంటికి తిరిగి వచ్చేసేదని బ్రూనోను చూసుకునే సోనీ తెలిపింది. బ్రూనో సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో, సోనీ బంధువు ఆండ్రూ కుక్కను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆండ్రూ బీచ్ దగ్గరకు చేరుకున్నప్పుడు బ్రూనోను ఒక పడవతో కట్టివేసి, ముగ్గురు యువకులు దారుణంగా కొడుతుండడం చూశాడు. ఆపడానికి ప్రయత్నించగా ఆండ్రూను కొట్టి పక్కకు తోసేశారు. కుక్కను పడవలో ఫిషింగ్ హుక్తో కట్టి, దానిని కర్రతో కొట్టి కొట్టి హింసించి మరీ చంపారు. అది చనిపోయేంత వరకు దానిని కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు. తరువాత ఆ మూగ జీవాన్ని సముద్రంలోకి విసిరేశారు.
కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలని కోరుతూ ఉన్నారు. సెలెబ్రిటీలు తాజాగా సోషల్ మీడియా ద్వారా ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుష్క శర్మ, అలియా భట్, టైగర్ ష్రాఫ్, దిషా పటాని, రష్మీ తదితరులు సోషల్ మీడియాలో ఈ సంఘటనపై స్పందిస్తూ జంతు హింసపై కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బ్రూనోను చేరదీస్తున్న కుటుంబానికి.. కొట్టి చంపిన వాళ్లకు మధ్య గతంలో వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. వ్యక్తిగత ద్వేషం కారణంగానే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రూనో ఓనర్లు విజింజం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు సిలు అయ్యన్, సునీల్, ఇంకో మైనర్ ను అరెస్టు చేశారు. మంగళవారం ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సోనీ ఆరోపించారు. నిందితులను ఇప్పటికే బెయిల్ పై విడుదల అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత కూడా నిందితులు సోనీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించారు. పోలీసులలో నిందితుల బంధువులు ఉండడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సోనీ ఆరోపించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశామని.. మా బ్రూనోకు ఏమి జరిగిందో అందరికీ తెలుస్తుంది అని.. అలాగైనా పోలీసులపై ఒత్తిడి పెరిగి న్యాయం జరుగుతుందేమోనని సోనీ అన్నారు.