పట్టపగలు.. అందరూ చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య

పట్టపగలు అందరూ చూస్తుండగానే డాక్టర్ దంపతులను నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. భరత్ పూర్ లోని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ హత్య చోటు చేసుకుంది. సీసీటీవీ కెమెరాలో కూడా ఈ ఘటన నమోదైంది. పాయింట్ బ్లాంక్ రేంజిలో ఈ హత్యను చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. డాక్టర్ సుదీప్ గుప్తా, అతడి భార్య సీమా గుప్తాను కాల్చి చంపారు.
రోడ్డు మీద వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి డాక్టర్ సుదీప్ గుప్తా కారును ఆపారు. కారు ముందు వైపు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న సుదీప్ బైక్ నుండి దిగిన ఓ వ్యక్తితో మాట్లాడాడు. ఇంతలో ఆ వ్యక్తి తుపాకీని తీసి డ్రైవింగ్ సీట్ లో ఉన్న సుదీప్ గుప్తాపై గురి పెట్టి కాల్చాడు. ఆ తర్వాత ఆయన భార్య సీమా గుప్తాను కూడా కాల్చి చంపాడు. ఒక వ్యక్తి పింక్ రంగు గుడ్డతో ముఖాన్ని కప్పుకోగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి ముఖాన్ని కూడా చూడొచ్చు. అతడు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరపడంతో కారులోనే ఇద్దరు దంపతులు కుప్పకూలి పోయారు. కాల్చేసిన తర్వాత బైక్ లో వెళ్లిపోయారు.
ఓ కారులో వెళ్తుండగా దాని వెనకాలే బైకుపై ఈ ఇద్దరు యువకులు వచ్చి, నడిరోడ్డుపై కారు ముందు బైకును ఆపారు. కారును ఆపిన డాక్టరు విండో తెరచాడు. ఆ వెంటనే ఓ యువకుడు బైకు దిగి తుపాకీ తీసి డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో మరో యువకుడు బైకుపైనే కూర్చున్నాడు. కాల్పులు జరిపిన యువకుడు ఆ వెంటనే బైకు ఎక్కగా, మరో యువకుడు బైకును నడిపాడు. ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. రెండేళ్లుగా విచారణ జరుగుతోన్న ఓ యువతి హత్య కేసులో డాక్టర్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం హత్యకు గురైన యువతి సోదరుడే డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్తో గతంలో ఆ యువతికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువతి హత్య కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆయన తల్లి కూడా నిందితులుగా ఉన్నారు. మే 28వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. నీమ్ దర్వాజా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు.
2019 సంవత్సరంలో దీపా గుర్జార్ అనే మహిళ హత్య కేసులో దంపతుల మీద అభియోగాలు ఉన్నాయి. 25 సంవత్సరాల దీపా గుర్జార్ డాక్టర్ సుదీప్ గుప్తా ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తూ ఉండేది. సుదీప్ గుప్తా భార్య సీమ గుప్తాకు దీపకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందని భావించింది. దీంతో దీపా గుర్జార్ ను ఉద్యోగం నుండి తీసి వేయించింది సీమా. ఆ తర్వాత సుదీప్ సహాయం చేయడంతో దీపా ఓ బ్యూటీ పార్లర్ ను మొదలుపెట్టింది. దీపా అంతకు ముందే ఓ వ్యక్తితో విడాకులు తీసుకుని తన కొడుకుతో ఉంటోంది. సుదీప్ తన భార్యకు తెలియకుండా తనకు ఉన్న విల్లాలో దీపాకు ఆశ్రయం ఇచ్చాడు. దీపా తన బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డులపై డాక్టర్ సుదీప్ గుప్తా అనే పేరును వేయించింది. ఇది సీమా గుప్తాకు ఆగ్రహం తెప్పించింది. తన అత్తను తీసుకొని దీపా ఇంటికి వెళ్ళింది సీమా.. అప్పుడు వారి మధ్య గొడవ జరిగింది. దీపా, ఆమె ఆరేళ్ళ కుమారుడు సూర్య లపై సీమా నిప్పంటించింది. ఈ కేసులో సీమా, ఆమె అత్తను పోలీసులు అరెస్టు చేశారు. సుదీప్ గుప్తా మీద కూడా కొన్ని అభియోగాలు మోపబడ్డాయి. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఇలా నడిరోడ్డు మీద డాక్టర్ దంపతులు హత్యకు గురయ్యారు.