More

  దళిత నాయకుడిని అవమానించిన ‘డీఎంకే’..!

  దక్షిణాదిలో దళిత కార్డును ప్రయోగించడంలో, అందరికన్నా మందుండే పార్టీ డీఎంకే. దళితులకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ఢంకా భజాయిస్తూవుంటారు. బాహుబలి హీరో ప్రభాస్ భద్రుడిని తన భుజాలపై మోసినట్టు.. దళితులను మోస్తున్నది తాము మాత్రమేనని కలరింగ్ ఇస్తారు. డీఎంకేలో అధినాయకుల నుంచి గల్లీ లీడర్ల వరకు ఇదే వరస. కానీ, దళితులకు డీఎంకే ఇచ్చే ట్రీట్ మెంట్ ‘సెపరేటు’గా వుంటుంది.

  విషయానికొస్తే.. అంతియూర్ సెల్వరాజ్ అనే.. గౌరవ డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇటీవల కోయంబత్తూర్ లో జరిగిన పార్టీ బహిరంగ సభకు హాజరయ్యారు. మరి, ఎంపీ అయిన సెల్వరాజ్.. అధినేత స్టాలిన్ తో కలిసి వేదిక పంచుకోకుండా.. ఇలా డయాస్ కింద కూర్చున్నారేమిటి..? పార్టీ కార్యక్రమంలో అలా సెపరేటుగా కూర్చోవడానికి కారణమేంటి..? ఈ సందేహం నాలాగే మీకూ వచ్చిందా..? అయితే, వినండి.. గౌరవ పార్లమెంట్ సభ్యుడు పార్టీ మీటింగ్ లో వేదిక కింద కూర్చోవడానికి కారణం అంటరానితనం. మీరు ఆశ్చర్యానికి గురైనా ఇది కఠిన సత్యం. కంటి ముందు కనిపిస్తున్న కఠోర నిజం. అయన పుట్టిన సామాజివర్గమే ఆయనను వేదికకు ‘దూరం’ చేసింది. అంతియూర్ సెల్వరాజ్ అరుంధతియార్ సామాజికవర్గానికి చెందినవారు. తమిళనాడులో ఇది ఎస్సీ సామాజికవర్గం. ఇప్పుడు డీఎంకే తత్వం బోధపడిందనుకుంటా..!

  ఈ ఘనకార్యంతో డీఎంకే చెప్పేదానికి, చేసేదానికి ఎలాంటి సంబంధం ఉండదని మరోసారి రుజువైంది. హిందూ దళితులకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం ఏపాటిదో తేటతెల్లమైంది. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. దశాబ్దాల క్రితమే అంటరానితనం అంతమైనా.. తమిళనాడులు మాత్రం ఇప్పటికీ దళిత హిందువులు సాంఘిక వివక్షను ఎదుర్కొంటూనేవున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వారికి ఆలయ ప్రవేశం నిషేధం. స్టెయిన్ లెస్ స్టీల్ కప్పుల్లో టీ తాగడానికి కూడా నోచుకోరు. డీఎంకే లాంటి కొన్ని పార్టీలు.. తమ రాజకీయ లబ్దికోసం దళితులను పేపర్ కప్పుల్లా వాడిపారేస్తున్నాయి. అంటరానితనాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న డీఎంకే నేతలు.. మరోసారి అడ్డంగా దొరికిపోయారు.

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో డీఎంకే ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. ఆయన కనుసన్నల్లో ఎన్నికల సభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 22న ఈరోడ్ లో డీఎంకే భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డీఎంకే చేసిన ఘనకార్యం ఇది. సాధారణంగా పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శలకు వేదికపై ఓ మూలన ప్లాస్టిక్ చైర్లే వేసి కూర్చోబెడతారు. వేదిక కింద నిలుచుకోవడానికి గానీ, కూర్చోవడానికి గానీ ఎవర్నీ అనుమతించరు. కానీ, 22న జరిగిన సభ మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ అయిన ఎంపీ అంతియూర్ సెల్వరాజ్ ను.. డయాస్ పక్కన నిల్చోవాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. స్టాలిన్ వేదికపైకి వచ్చిన తర్వాత.. సెల్వరాజ్ ను వేదిక కింద కుర్చీ వేసి ఇలా సెపరేట్ గా కూర్చోబెట్టారు.

  ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అరుంధతియార్ సామాజికవర్గం అన్నివేళలా అండగా వుంటున్నది తమ పార్టీయేనని స్టాలిన్ గొప్పలు చెప్పుకోవడం. రెండేళ్ల క్రితం అరుంధతియార్ సామాజికవర్గానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడైన పొల్లాన్ స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. సీఎం పళనిస్వామి ప్రకటించారు. దీంతో అరుంధతియూర్ సామాజిక వర్గంపై స్టాలిన్‎కు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో జరిగిన ఓ సభలో పొల్లాన్ పై ప్రశంస జల్లు కురించాడు స్టాలిన్. నిజానికి పొల్లాన్ కు సముచితగౌరవం ఇచ్చింది తామేనంటూ ప్రకటించాడు. తన తండ్రి కరుణానిధి సీఎంగా వున్న సమయంలోనే తాను పొల్లాన్ కు విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పానన్నాడు. అంతేకాదు, తాను డిప్యూటీ సీఎంగా వున్న సమయంలనే అరుంధతియార్ సామాజికవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గంగా గుర్తిస్తూ జీవో ఇచ్చామని కూడా చెప్పుకొచ్చాడు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టే.. సీఎం పళనిస్వామికి పొల్లాన్ పై ప్రేమ పుట్టుకొచ్చిందంటూ ఎద్దేవా కూడా చేశాడు. పొల్లాన్ కు విగ్రహం కట్టిస్తామని పళనిస్వామి కంటే స్టాలినే మందు ప్రకటించాడు సరే.. మరి, విగ్రహం ఎక్కడ..? ఈ విషయం మాత్రం డీఎంకే నేతల్ని మాత్రం అడగొద్దు. హర్టవుతారు.

  డీఎంకే చేసిన ఈ పనికిమాలిన పనిపై ఆ పార్టీ క్యాడరే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అరంధతియార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించింది తామేనని చెబుతున్న స్టాలిన్.. నిజంగా వారిపై గౌరవముంటే సెల్వరాజ్ ఇంత ఘోరంగా అవమానించేవారు కాదని మండిపడుతున్నారు. ఇదిలావుంటే, సెల్వరాజ్ ఘటనతో డీఎంకేపై హిందూ వ్యతిరేక ముద్ర పడే అవకాశం వుందని.. రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు, డీఎంకేకు ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు కూడా దూరం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఓవైపు, బీజేపీ.. పార్టీలో దళితులకు పెద్దపీట వేస్తుంటే,.. డీఎంకే వారిని అవమానాల పాలు చేస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న మురుగన్, దురైస్వామి దళిత సామాజికవర్గానికి చెందినవారే. అంతేకాదు, పుతియ తమిళగమ్ పార్టీ డిమాండ్ మేరకు.. ఇటీవలే ఏడు దళిత వర్గాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు సైతం బీజేపీ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా.. గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టింది. అరుంధతియార్ కులంతో పాటు.. మరో ఏడు కులాలను ఎస్సీ సామాజికవర్గమైన ‘దేవేంద్ర కుల వెల్లలార్’లతో కలుపుతూ బిల్లు తీసుకొచ్చింది. ఈ పరిణామాలు డీఎంకేకు కు ఇబ్బందికరంగా మారే అవకాశం వుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి తోడు ఇలాంటి విపరీత చర్యలు.. ఆ పార్టీకి ఎస్సీ, ఎస్టీ ఓటుబ్యాంకును దూరం చేస్తాయని భావిస్తున్నారు.

  ఇదిలావుంటే, డీఎంకే పార్టీ సభలో ఓ దళిత ఎంపీని అవమానించడంపై ‘నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి’ చైర్మన్ ఎం. వెంకటేషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సభలో ఓ దళిత ఎంపీని అవమానించిన డీఎంకే చీఫ్ స్టాలిన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్’ సభ్యురాలు శ్రీమతి అంజు బాలాకు లేఖ రాశారు. గత నెల 23న దినమలర్ పత్రికలో ప్రచురితమైన వార్త ఆధారంగా.. చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషన్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

  Trending Stories

  Related Stories