More

  డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ

  తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతూ ఉన్నాయా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. పలువురు నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. గండిపేటలోని డీకే అరుణ ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో వారు ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో ఉద్యమకారులతో వరుస భేటీలు నిర్వహించాలని డీకే అరుణ భావిస్తూ ఉన్నారు. వాటిపై కూడా చర్చ జరుగుతూ ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరుతారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

  పార్టీలో చేరికపై ఇద్దరి మధ్యా చర్చ జరిగిందని.. ఆలస్యం చేయొద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు కొండా కూడా సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు అగ్రనాయకులతో ఆయన సమావేశమయ్యారు. గత నెల 31వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ గురువారం ఉదయం హైదరాబాద్ కు చేరుకొన్నారు. జూన్ 8 లేదా 9వ తేదీల్లో బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఈటల రాజేందర్ చర్చించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో బుధవారం సాయంత్రం ఈటల భేటీ అయ్యారు. ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేశాక బీజేపీలో చేరనున్నారు.

  Trending Stories

  Related Stories