హిందువుల పండుగకు అమెరికా మొత్తం హాలిడే..!

0
264

హిందూ సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రపంచం మొత్తం దాసోహం అంటోంది. హిందువుల పూజలను విదేశీయులు సైతం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. అలాగే హిందువుల పండుగలను ఇతర దేశాల్లో కూడా ఘనంగా జరుపుతుంటారు. ఇక అగ్రరాజ్యంలో కూడా హిందువుల పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగ వేడుకలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది ఏర్పాటైన దీపావళి సంబరాలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అప్పట్లో 250 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వైట్‌హౌస్ చరిత్రలోనే అరుదుగా చెప్పుకొనే వేడుకలు అవి. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో అంతమంది అతిథులు హాజరుకావడం దీపావళి పండగ ప్రత్యేకతను చాటి చెప్పింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వైట్‌హౌస్ ఈ వేడుకలను నిర్వహించింది. సాంస్కృతిక ప్రదర్శనలను సైతం ఏర్పాటు చేసింది. అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపావళి పండగ మరో మైలురాయిని అందుకోబోతోంది. దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఈ ఏడాది దీపావళి పండగ నాటికి ఇది వాస్తవరూపాన్ని దాల్చే అవకాశాలు లేకపోలేదు. దీపావళి పండగ రోజున ఫెడరల్ హాలిడే ప్రకటించాలంటూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్.. ఓ బిల్లును ప్రతిపాదించింది. దివాళీ డే యాక్ట్ పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్ ప్రవేశపెట్టారు. న్యూయార్క్ ఆరవ కాంగ్రెస్సోనియల్ డిస్ట్రిక్ట్‌కు ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. దివాళీ డే యాక్ట్‌ను సభలో ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. దీపావళి పండగ రోజును ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్ హాలిడేలు అమలులో ఉన్నాయి. జనవరి 1- న్యూ ఇయర్ డే, జనవరి 16- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే, ఫిబ్రవరి 20- ప్రెసిడెంట్స్ డే, మే 29- మెమోరియల్ డే, జూన్ 19- జునెటెంత్ డే, జులై 4- ఇండిపెండెన్స్ డే, సెప్టెంబర్ 4, లేబర్ డే, అక్టోబర్ 9- కొలంబస్ డే, ఇండిజీనస్ పీపుల్స్ డే, నవంబర్ 11- వెటరన్స్ డే, నవంబర్ 23- థ్యాంక్స్ గివింగ్, డిసెంబర్ 25- క్రిస్మస్ ను ఫెడరల్ హాలిడేగా అమెరికన్లు జరుపుకొంటారు. దీవాళి డే యాక్ట్ గనక యూఎస్ కాంగ్రెస్ ఆమోదం పొందితే ఈ సంఖ్య 12కు చేరుతుంది. ఈ బిల్లును స్వాగతిస్తోన్నట్లు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ప్రకటించారు. ఈ సంవత్సరం దీపావళి పండగను ఫెడరల్ హాలిడేగా జరుపుకొందామని అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here