More

    అప్పుడు జవాన్లు.. ఇప్పుడు దివ్యాంగులు.. అయోధ్యలో మోదీ వినూత్న దీపావళి..!

    చీకట్లను పటాపంచలు చేస్తూ.. వెలుగు జిలుగులు వెదజల్లే ఆనందాల సమాహార శోభావళి దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అంతటి విశిష్ట దీపావళి పండుగను అనాదిగా వేడుకగా చేసుకోవడం ఆనవాయితీ. యుగయుగాలుగా దీపావళి పండుగ నిర్వహించుకోవడం జరుగుతోంది.

    ద్వాపరంలో అసుర సంహారం అనంతరం అట్టహాసంగా ప్రారంభమైన దీపావళి పండువ, త్రేతాయుగంలో సైతం అయోధ్యలో జరిగినట్టు పురాణాలు విశదపరుస్తున్నాయి. రాక్షస సంహారం అనంతరం లంకలో విభీషణుని చక్రవర్తిగా చేసిన శ్రీరామచంద్రుడు. అయోధ్యకు తిరిగి వస్తాడు. లంకా విజయం.. మంగళ వార్త విని అయోధ్య పౌరులు ఉప్పొంగిపోయారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీరామ పట్టాభిషేకాన్ని కన్నులారా చూసిన అయోధ్యవాసులు ఆనందోత్సాహాలతో దీపాల పండుగ నిర్వహించుకున్నారని పండిత శ్రేష్ఠులు తెలియజేస్తున్నారు. అంతటి విశిష్ట దీపావళి పర్వదిన వేడుకలను అయోధ్యలో అమిత భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు.

    అయోధ్యలో రామమందిర స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ, దాదాపు 15 లక్షల మంది దివ్యాంగులతో జరిగే దీపోత్సవంలో పాల్గొంటారు. ఉత్తమ రాష్ట్రంగా కీర్తింపడుతున్న ఉత్తర ప్రదేశ్‎లోని పవిత్ర అయోధ్య నగరంలో ప్రధాని మోదీ హిందూ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో, ఆనంద వెలుగు జిలుగుల శోభావళిగా పేరొందిన దీపావళి పండుగ.. అయోధ్యలో ఈ ఏడాది మరీ ప్రాధాన్యం సంతరించుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ దీపావళి పర్వదినాన్ని.. సరిహద్దుల్లో జవాన్లతో జరుపుకునేవారు మోదీ. కానీ, ఈసారి దివ్యాంగులతో పండుగ జరుపుకోనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది.

    అక్టోబర్ 23 ఆదివారం నాడు ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటిస్తారు. నగరంలో నిర్మాణంలో వున్న శ్రీరామ మందిర స్థలాన్ని ప్రధాని పరిశీలించి, భగవాన్ శ్రీరాంలాలా విరాజమానుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు సాయంత్రం శ్రీరామచంద్ర భగవానునికి ప్రధాని మోదీ, అట్టహాసంగా రాజ్యాభిషేకం చేస్తారు. అనంతరం కొత్తఘాట్ వద్ద సరయా నదికి హారతి ఇస్తారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అయోధ్యను అందంగా తీర్చిదిద్దుతున్నారు. అయోధ్యాపురిని దీపశోభితంగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని సమక్షంలో ఘనంగా జరిగే ఈ ఏడాది దీపోత్సవ్‌ లో సుమారు 15 లక్షల దీపాలను వెలిగించేందుకు ప్లాన్ చేశారు.

    వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, విద్యుత్ వెలుగుల నడుమ దీపోత్సవ వేడుక కడు రమ్యంగా జరగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నృత్యకళాకారులు నృత్యరూపాలు ప్రదర్శించనున్నారు. ఇదే రీతిలో ఎందరో కళాకారులు అయోధ్య నగరిలో..దీపోత్సవ వేడుకలో తమ కళా ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఈ వేడుకలన్నీ ప్రధాని సమక్షంలో జరగనున్నాయి. గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోతో పాటు సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను సైతం ప్రధాన మంత్రి వీక్షించనున్నారు.

    Trending Stories

    Related Stories