More

    లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ పై అనర్హత వేటు రద్దు..!

    ఎన్సీపీ నేత, లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై వేసిన అనర్హత వేటును లోక్‌సభ రద్దుచేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. హైకోర్టు చెప్పినప్పటికీ తనను సభలోకి అనుమతించడం లేదంటూ ఫైజల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్‌ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.

    2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్‌ అల్లుడు మహ్మద్‌ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్‌ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. కవరత్తి కోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అనర్హత వేటు వేసింది. ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించినా, లోక్‌సభ సెక్రటేరియట్‌ మాత్రం తనను అనర్హునిగా ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడం లేదంటూ సుప్రీం కోర్టులో ఫైజల్ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్‌ రద్దుచేసింది.

    Trending Stories

    Related Stories