ఒక్కసారి జాగ్రత్తగా పక్కనున్న ఫోటోలను గమనించండి. గుంతలు పడ్డ రోడ్లు, పూర్తిగా చెత్తతో నిండిపోయిన రైల్వే ట్రాక్‌లు, డ్రగ్స్‌కు బానిసై కనీసం నిలబడే పరిస్థితుల్లో కూడా లేని యువత. అయితే ఈ ఫోటోలు ఎక్కడివో ఊహించగలరా..? కొద్దిగా ఎక్కువ సమయమిచ్చినా ఇవి ఎక్కడివో ఊహించడం కాస్తంత కష్టమే. ఎందుకంటే ఇటువంటి గుంతల రోడ్లు, చెత్తా చెదారంతో కూడిన రైల్వే ట్రాక్‌లు చూస్తే.. మన ఊహంతా భారత్ లోని మురికివాడల చుట్టే తిరుగుతుంది. అయితే ఈ ఫోటోలు అసలు భారత్ లోనివే కావు. ఆఫ్రికా ఖండంలోని ఏ పేద దేశాల్లోనివో అనుకున్నా.. మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, ఈ ఫోటోలు అగ్రరాజ్యమని విర్రవీగే అమెరికాకు చెందినవి. ఏంటి షాకయ్యారా..? మీరు షాక్‌కు గురైనా ఇదే నిజం..! అమెరికాలో పేదరికానికి ఈ ఫొటోలే నిలువెత్తు నిదర్శనం.
సాధారణంగా అమెరికాను భారతీయులు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తారు. ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడలతో చూడముచ్చట గొలిపే అందాలు సినిమాల్లో కనిపించగానే, పుడితే అమెరికాలాంటి దేశాల్లో పుట్టాలిరా.. అని అందరూ అనుకుంటుంటారు. అక్కడ రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండదట రా.. అని అప్పుడప్పుడే ఊహ తెలిసిన కుర్రకారు మాట్లాడుకుంటుంటారు. అయితే నిజంగా అమెరికాలో అటువంటి పరిస్థితి ఉటుందా..? అని ఎప్పుడైనా మీలో మీరే ప్రశ్నించుకున్నారా..? పదండయితే ఒకసారి అమెరికా రోడ్లు, అక్కడి మురికివాడల్లోకి తొంగిచూద్దాం.
అమెరికా ఆర్థికంగా అగ్రదేశమే అయినా కూడా అక్కడ గుంతలు పడిన రోడ్లుంటాయి. భారత్ లో లాగే వర్షాలు పడితే గుంతల్లో నీళ్ళు ఆగి స్విమ్మింగ్ పూల్ తలపించే హైవేలుంటాయి. అయితే ఇవేవో ఎక్కడో మారుమూల గ్రామాల్లో అనుకుంటే అది కూడా పొరపాటే. ఏకంగా అమెరికా రాజధాని నగరంలోనే ఇటువంటి రోడ్లు తారసపడతాయి. ఆ దేశ పార్లమెంటు భవనం యూఎస్ కాపిటోల్ ముందున్న రోడ్ల దుస్థితి ఇది. దీంతో పాటు పార్లమెంటు ఆవరణలో రోడ్లపక్కన టెంట్లు వేసుకుని బతుకుతున్న బడుగుజీవులు కూడా మీకు దర్శనమిస్తారు. ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న అమెరికాలో.. కొన్ని వర్గాలకు కనీసం బ్రతకడానికి ఇళ్ళు కూడా లేవన్న నిగూఢ సత్యాన్ని ఈ ఫొటోలు నిరూపిస్తున్నాయి. భారత్ లాంటి దేశంలో పేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇళ్ళు కట్టిస్తోంది. కానీ అమెరికాలో అటువంటి పథకాలేమీ ఉండవు. దీంతో సరిగ్గా ఇళ్ళు కూడా లేనివారెందరో మనకు తారసపడతారు. సాక్షాత్తు అమెరికన్ పార్లమెంటు వెనుకభాగంలోనే టెంట్లు వేసుకుని నివసించేవారు కనిపిస్తుంటారు.
అంతేకాదు, అక్కడ తరచూ లూటీలు, దారిదోపిడీలు కూడా జరుగుతుంటాయి. డ్రగ్స్ తీసుకుని ఫుట్ పాత్ లపై పొర్లాడే వ్యక్తులు కూడా తారసపడుతుంటారు. పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా రోడ్లపై మత్తులో జోగుతూవుంటారు. అక్కడ డ్రగ్స్ వ్యతిరేక చట్టాలున్నా కూడా వాటి అమలు ఏమేర ఉందో వీరిని చూస్తే అర్థమవుతుంది. భారత్ లో డ్రగ్స్ తీసుకోవడం ఎక్కడో నాలుగు గోడలమధ్యో లేక పెద్ద పెద్ద పార్టీల్లోనో గుట్టుగా జరుగుతుంటుంది. డ్రగ్స్ మత్తులో ఎవరైనా రోడ్లపై కనిపిస్తే పోలీసులు పట్టుకుని బొక్కలో తోస్తారు. అయితే అమెరికాలో మాత్రం అదేమీ ఉండదు. రోడ్లపై తూగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. ఈ మత్తులో వారు లోకం తెలియకుండా ప్రవర్తించడం, పక్కవారితో గొడవలు పడటం, దారిలో వెళ్ళేవారిపై దోపిడీలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు.
ఇక అమెరికాలోని రోడ్ల పరిశుభ్రత కూడా చూద్దాం. మనం సినిమాల్లో చూసేంత నీట్ గా అక్కడి రోడ్లు ఉంటాయనుకుంటే పొరపాటే. కొన్ని చెత్తా చెదారం ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటుంది. రోడ్లపై మొత్తం ప్లాస్టిక్ కవర్లు అట్టపెట్టెలతో నిండిపోయినా శుభ్రం చేసే నాథుడే ఉండడు. అదికూడా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ పరిస్థితులు కనిపిస్తాయి.
ఇక రైల్వేలది అయితే మరీ వింత పరిస్థితి. సాధారణంగా భారత్ లో కటిక పేదవారు బొగ్గువ్యాగన్లలోని కొంత బొగ్గును దొంగిలించడం వంటిచి చూస్తూ ఉంటారు. ఏదో ఒక చిన్న సంచి తీసుకొచ్చి దాన్ని నింపుకుని ఇంట్లో వంటచెఱకుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఇప్పుడు చాలా తగ్గిపోయినా అక్కడక్కడా ఇటువంటి సంఘటనలు తారసపడుతుంటాయి. కానీ అమెరికాలో కూడా ఇటువంటి రైలు దోపిడీలు జరుగుతుంటాయని మీకు తెలుసా..? అయితే అదేదో సాధారణ వస్తువుల దోపిడీ కాదు. ఏకంగా అమెజాన్, వాల్ మార్ట్ వంటి ఆన్ లైన్ ఫ్లాంట్ ఫాంలలో బుక్ చేసిన పార్శిళ్ళను దొంగిలించడం భారీ యెత్తున జరుగుతోంది. అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో రైల్వే ట్రాకులపై పడిఉన్న అట్టపెట్టెలను చూసే ఈ దోపిడీ ఎంతగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వందలాది పార్శిళ్ళు దోపిడీకి గురవుతున్నాయి. దీంతో రైల్వేల్లో రక్షణ వ్యవస్థ ఎంతగా ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
ఈ విధంగా అమెరికాలో కూడా తరచూ దారి దోపిడీలు, గుంతలు పడ్డ రోడ్లు, చెత్తతో నిండిపోయిన వీధులూ, డ్రగ్స్ తో ఊగిపోతున్న యువత కనిపిస్తుంటారు. అయితే భారత్ లో కూడా గుంతలు పడ్డ రోడ్లు కనిపిస్తాయి. కానీ, అవి పార్లమెంటుకు వెళ్ళే ప్రధాన రహదారులపై కాకుండా చిన్న చిన్న రోడ్లపై కనిపిస్తాయి. ఇక చెత్త శుభ్రం చేసే విషయంలో సఫాయీ కార్మికులు రాత్రింబవళ్ళూ కష్టపడి రోడ్లను శుభ్రంగా ఉంచుతారు. ఇక అమెరికాలో లాగా డ్రగ్స్ బానిసైన యువత నడిరోడ్లపై తిరిగే వారు భారత్ లో ఎక్కడా కనిపించరు. గుట్టుగా పోలీసులకు తెలియకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారు. డ్రగ్స్ విషయంలో మాత్రం భారత పోలీసులను అభినందించాల్సిందే. చట్టాలను కఠినంగా అమలు చేసి సాధ్యమైనంత వరకు కట్టడి చేయడంలో విజయం సాధిస్తున్నారు. రైల్వే పార్శిళ్ళలో దోపిడీ వంటివి భారత్‌లో ఎక్కడా కనిపించే ప్రసక్తే లేదు. అందుకే అమెరికా లాంటి దేశాలను చూసి భారత్‌ను తిట్టేవారు ఇటువంటి సంఘటనలను కూడా గుర్తించాల్సిన అవసరముంది.