తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కొండా సురేఖ భర్త కొండా మురళి జీవిత కథ ఆధారంగా కొండా పేరిట దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కొండా సురేఖ తన కుటుంబంతో పాటు చిత్ర బృందంతో కలిసి సోమవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కొండా ఫ్యామిలీ కోరిక మేరకు రాంగోపాల్ వర్మ కూడా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయంలో కొండా సురేఖ పక్కనే కూర్చుని రాంగోపాల్ వర్మ దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ… ‘కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి’ అంటూ ఓ కామెంట్‌ను కూడా జత చేశారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం’ అని పేర్కొన్నారు.
ఆర్జీవీ మాట్లాడుతూ ‘విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను’ అని తెలిపారు.