ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కొందరు బీజేపీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. సినిమాలపై వ్యాఖ్యానించవద్దని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడమే మంచిదని సూచించారు. కొన్ని సినిమాల విషయంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు మీడియాలో హైలైట్ అయ్యాయని.. అవసరమా మనకు ఇలాంటివి అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ సలహాపై సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ స్పందించారు. మోదీ నాలుగేళ్ల క్రితం ఈ సూచన చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికే బాలీవుడ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు అనురాగ్. ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది.. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదని అనురాగ్ చెప్పుకొచ్చారు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదని.. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేదని అన్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ ట్రయిలర్ విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.