అమలాపురం అల్లర్లపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు మాట్లాడుతూ.. అల్లర్లలో పాలుపంచుకున్న వారిలో ఇప్పటిదాకా 19 మందిని అరెస్ట్ చేశామని, అమలాపురం అల్లర్లకు రౌడీ షీటర్లే కారణమని కూడా ఆయన తెలిపారు. అల్లర్లలో పాల్గొన్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిపై 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్ర వంతెన దగ్గర బస్సును దగ్ధం చేసిన కేసులో అమలాపురం పోలీస్ స్టేషన్‌లో మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 341,143,144,147, 148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేశారు. అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తామని తెలిపారు. అరెస్టులు ముగిశాక దశలవారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని పాలరాజు చెప్పారు.