More

  ‘తాలిబన్’లో చైనా SPY NETWORK..?

  ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా నిష్క్రమణ ఆసియాఖండంలో సరికొత్త వ్యూహాత్మక పునరేకీకరణకు బీజాలు వేసింది. తాలిబన్లకు మద్దతుపలికే దేశాలు జట్టుగా ఏర్పడేందుకు కారణమైంది. ఆఫ్ఘనిస్థాన్ స్వాధీనంలో మీడియా తెరలపై కనిపిస్తున్న తాలిబన్ల సాయుధ మందబలం వెనుక కనిపించని అనేక లోపాయికారి ఒప్పందాలూ, రహస్య ఓడంబడికలూ, గూఢచార కుట్రలూ దాగున్నాయని గుర్తించాలి. అంతస్సారంలో తాలిబన్లు కేవలం పావులు మాత్రమే అనే వాస్తవాన్ని భవిష్యత్తు ఖచ్చితంగా రుజువుచేసి తీరుతుంది.

  ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ప్రత్యేకమైన, సంక్లిష్టమైన వ్యూహాత్మక భూభాగాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్థాన్ లోకి చైనా ప్రవేశం సునాయాసంగా జరిగిపోయింది. చైనా పద్ధతిగా పావులు కదిపింది. ఇతరుల అభ్యంతరానికి ఆస్కారం లేకుండా వ్యవహరించింది.

  ఆఫ్ఘనిస్థాన్ కు ఎందుకింత ప్రాధాన్యత? అమెరికా 2 ట్రిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చు చేసింది? రెండు దశాబ్దాలుగా చైనా ఎందుకు ఆఫ్ఘనిస్థాన్ లో అడుగుపెట్టాలని చూస్తోంది? గాంధార రాజ్యానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత ఏంటి? ‘ఖురసాన్’లో అంతులేని సంపద ఉందా?  ఆఫ్ఘనిస్థాన్ ను Graveyard of empires అని ఎందుకన్నారు? తాలిబన్ లో అంతర్గతంగా చైనాకు గూఢచార నెట్ వర్క్ పెంచుకునే ఛాన్స్ ఉందా? తాలిబన్ నేత బరాదరీని చైనా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎలాంటి పథకాన్ని వేసింది?  హక్కానీ నెట్ వర్క్ తో చైనాకు ఉన్న బంధమేంటి?

  ఆఫ్ఘనిస్థాన్ సుసంపన్నమైన దేశమేమీ కాదు. రాగి, ఇనుము, కోబాల్ట్, లిథియం లాంటి ఖనిజాలున్నమాట నిజమే అయినా, భద్రతా కారణాలరీత్యా వాటిని వెలికితీసేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు రావడం లేదు. దక్షిణ, మధ్య, పశ్చిమాసియాల నడి మధ్యన ఉన్న వ్యూహాత్మక భూభాగంలోని దేశమిది. ఒకవైపు క్యాస్పియన్ సముద్రం, మరోవైపు అరేబియా మహా సముద్రం ఉన్న దేశం.

  దక్షిణ, మధ్య ఆసియాల కూడలిగా ప్రసిద్ధి చెందింది. ఆఫ్ఘనిస్తాన్ కు తూర్పు, దక్షిణ భాగాల్లో పాకిస్థాన్, పశ్చిమాన ఇరాన్, తూర్పున తుర్క్ మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, ఈశాన్యంలో చైనా సరిహద్దు దేశాలు.

  ప్రపంచ చమురు దాహాన్ని తీర్చే పశ్చిమాసియా, అపార వనరులున్న మధ్య, దక్షిణాసియా దేశాల్లో ప్రాపకం వెలగబెట్టాలంటే ఆఫ్ఘనిస్థాన్ వ్యూహాత్మకంగా కీలకమైన దేశం. ఓడరేవులు, రేవు పట్టణాలు, జలసంధులు, రహదారి మార్గాలూ అన్నిటిపై ఆధిపత్యం సంపాదించాలంటే ఆఫ్ఘన్ గడ్డమీద పరోక్షంగా అయినా సరే, అధికారంలో ఉండి తీరాలి.

  19 వ శతాబ్దంలో బ్రిటన్ మొదలు ఆ తర్వాత రష్యా, 21 శతాబ్దంలో అమెరికాలు ఆఫ్ఘనిస్థాన్ పై పట్టుసాధించాలని విఫలయత్నం చేస్తూ వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్ లో ఇప్పుడు మోహరించిన కొత్త బేహరి చైనా. 1839-42 నాటి తొలి ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం  నుంచి 2021లో అమెరికా పలాయనం వరకూ ఏ దేశమూ పూర్తి స్థాయిలో ఖురసాన్ పై పట్టు సాధించలేకపోయాయి. పైగా అవమాన భారంతో కాలికి బుద్ధి చెప్పాయి. అందుకే ఆఫ్ఘనిస్థాన్ ను ‘Graveyard of empires’-మహాసామ్రాజ్యాల స్మశానంగా అభివర్ణించారు.

  సోవియట్ వ్యతిరేక యుద్ధం జరిగిన కాలంలో తొరాబొరా కొండల్లో తలదాచుకున్న బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్థాన్ లోని వివిధ సాయుధ తెగలను ఇస్లాం  విశ్వాస ప్రాతిపదికన ఐక్యం చేయాలని ప్రయత్నించాడు. అది అసాధ్యమని తేలడంతో తర్వాత సుడాన్ వెళ్లిపోయాడు. సుడాన్ లో ప్రఖ్యాత బ్రిటీష్ పాత్రికేయుడు రాబర్ట్ ఫిస్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఆఫ్ఘన్ల జీవితంలో తెగ సంస్కృతి అత్యంత బలీయమైంది, సాయుధ తెగలుగా విడిపోయిన వారిని ఇస్లాం ప్రాతిపదికన ఐక్యం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదంటూ’’ వాపోయాడు. ఆఫ్ఘన్లను ఆయుధ సంపత్తితో ఓడించడం, ఏ ప్రాతిపదికన అయినా వారిని ఒక అంశంపై ఏకతాటిపైకి తేవడం అసాధ్యం.

  శక్తివంతమైన దేశమని చెప్పుకునే అమెరికా రెండు దశాబ్దాలు యుద్ధం చేసినా తాలిబన్లతో చివరకు శాంతి ఒప్పందం చేసుకున్న నేపథ్యం ఎదురుగా ఉండగా చైనా ఎందుకు తాలిబన్ దోస్తీ కోసం ఉబలాటపడుతుంది? పాలనా రాహిత్యం, అస్థిరత, అభద్రత, సాయుధ తెగల బెదిరింపుల మధ్య చైనా ఎందుకు పెట్టుబడులు పెట్టాలనుకుంటుంది అనే సందేహం రావడం సహజం.

  ఆగస్ట్ 20న ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో పీఎల్ఏలో 20 ఏళ్లపాటు కల్నల్ స్థాయిలో పనిచేసిన జౌబో ఆసక్తికరమైన వ్యాసం రాశారు. ‘‘In Afghanistan, China Is Ready to Step Into the Void’’ శీర్షికతో రాసిన వ్యాసంలో చైనా పారిశ్రామిక విధానంలోని స్వభావాన్ని విశ్లేషిస్తూ…‘‘ Chinese companies have a reputation for investing in less stable countries if it means they can reap the rewards. That doesn’t always happen so smoothly, but China has patience’’ అన్నారు. చైనా కంపెనీలు అస్థిర దేశాల్లోనే పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించాలని చూస్తాయి. సాఫీగా సాగిపోయే వ్యవహారం కాకపోయినా చైనాకు సహనం ఉంది’’ అంటూ విశ్లేషించారు.

  వనరుల వేట కోసం మాత్రమే కాదు, నిర్మాణంలో ఉన్న బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ కోసం కూడా ఆఫ్ఘనిస్థాన్ తో వ్యూహాత్మక బంధం అనివార్యమని చైనా గుర్తించింది. తూర్పు తుర్క్ మెనిస్థాన్ లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన డ్రాగన్ అక్కడ బలంగా ఉన్న ఉగ్రసంస్థ ఈస్ట్ తుర్క్ మెనిస్థాన్ ఇస్లామిక్ మువ్ మెంట్-ETMI తో తాలిబన్ కు ఉన్న సంబంధం తనకు అడ్డంకి కాకుండా చూసుకోవాలి. మొత్తంగా ఆసియాలో తమ ప్రభావాన్ని నెరపుతున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో చెట్టాపట్టాలేసుకుని తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది చైనా.

  కేవలం పశ్చిమాసియా చమురు వనరులపై ఆధిపత్యం కోసం అమెరికాకు ఆఫ్ఘనిస్థాన్ పై పెత్తనం అవసవమవుతే, చైనాకు అంతకన్నా ముఖ్యంగా మొత్తం ఆసియాలో తన శక్తిని పెంచుకోవడానికి అత్యవసరం.అంతేకాదు చైనాకు ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు బంధం కూడా ఉంది. ఆఫ్ఘనిస్థాన్ మీదుగా ప్రాచీన సిల్క్ రోడ్ పై ఆధిపత్యం కూడా చైనాకు ప్రాణావసరం.

  వన్ బెల్డ్ వన్ రోడ్ ప్రాజెక్ట్ వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రూపొందించింది కాదు. దానిచుట్టూ సైనిక, గూఢచార, దౌత్య వ్యూహాలు ఉన్నాయి. ఈ అవసరాలను గుర్తించిన చైనా దశాబ్దకాలంగా వైద్యం, సౌరవిద్యుత్ రంగం, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ లో ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ సంపదపై కూడా చైనా కన్ను పడింది. అంతేకాదు పెషావర్ నుంచి కాబుల్ వరకూ మోటార్ వే నిర్మించగలిగితే పశ్చిమాసియా మార్కెట్ కు అతి సమీపంలోకి వచ్చినట్టే!

  తాలిబన్లతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో చైనాకు స్పష్టత ఉంది. తాలిబన్ నేతల మధ్య ఉన్న విభేదాలు, తాలిబన్ నిర్ణయాలపై అధికార ముద్ర వేసే ‘షూరా’ మధ్య ఉండే అభిప్రాయ భేదాలను చైనా ఉపయోగించాలని చూస్తోంది. అందుకోసం పాక్ సహాకారం ఎలాగూ ఉంటుంది.

  తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కు సన్నిహితుడిగా పనిచేసిన హైబతుల్లా అఖున్ జాదా,  ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ మధ్య విభేదాలు పొడచూపే అవకాశాలు ఉన్నాయని చైనా ఆశలు పెట్టుకుంది. మరోవైపు తాలిబన్ మిలటరీ వ్యవహారాలు చూసే ముల్లా యూకూబ్ ను పావుగా వాడుకోవచ్చని కూడా చైనా భావిస్తోంది.

  ముల్లా యూకూబ్ కు పాకిస్థాన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు 2010లో అరెస్టెయిన బరాదర్ సుమారు 8ఏళ్లపాటు పాక్ జైల్లో మగ్గాడు. ఇటీవల చైనాలో పర్యటించిన అబ్దుల్ గనీ బరాదర్ తో డ్రాగన్ రహస్య ఒప్పందం చేసుకుందన్న వార్తలూ వెలవడుతున్నాయి.

  ఆఫ్ఘనిస్థాన్ లోని వివిధ తెగలకు ప్రాతినిథ్యం వహించే, నిర్ణయాధికారమున్న మూడు ‘షూరా’ల మధ్య భిన్నాభిప్రాయాలను చైనా మరింత పెంచే విధంగా ఎత్తుగడలు రచించే అకాశాన్ని కాదనలేం! క్వెట్టా షూరా, రాహ్ బరీ షూరా, రావల్పండీ షూరాల మధ్య విభేదాలకు కారణం పాకిస్థాన్ తో కలిసి ఉండాలా, స్వతంత్రంగా ఉండాలా అనే అంశంపైనే అంటారు నిపుణులు. క్వెట్టా షూరాపై ఐఎస్ఐ ప్రభావం ఉంటుంది. మిగతా రెండు ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర్యంగా ఉండాలని కోరుకునేవి. చైనా బరాదరిని తమ మనిషిగా చిత్రించి తాలిబన్ల మధ్య విభేదాలు సృష్టించే అవకాశాలూ ఉన్నాయి.

  ఈ ఏడాది జనవరిలో హక్కానీ గ్రూప్ తో సంబంధాలున్న పది మంది చైనా పౌరులను ఆఫ్ఘన్ ప్రభుత్వం నిర్బంధించింది. భారత నిఘా సంస్థ RAW, ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలీజెన్స్ శాఖకు సమాచారం ఇవ్వడంతో ఈ కొత్తకోణం వెలుగుచూసింది. చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ లో వీగర్ ముస్లీంల ఉగ్రకార్యకలాపాలు గుట్టు తెలుసుకునేందుకే హక్కాని గ్రూప్ తో సంబంధాలు పెట్టుకున్నారని తర్వాత బట్టబయలైంది. చైనాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వీగర్ ముస్లీం ఉగ్రవాదులను ట్రాక్ చేయడమే ఈ ఆపరేషన్ ఉధ్దేశం.

  రేడియో ఫ్రీ ఆసియా ఆగస్ట్ 17న ఓ ఇంటర్వ్యూను ప్రచురించింది. ‘‘Taliban Sharing Info with China ‘Poses a Danger for Uyghurs’’ టైటిల్ తో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూలో బ్రాడ్లీ జార్డిన్ అనే అమెరికా విశ్లేషకుడు అనేక కొత్త విషయాలు బయటపెట్టాడు. తాలిబన్లు వీగర్ ముస్లీంల ఆచూకీ చెప్పడం వల్ల బలవంతంగా తిరిగి చైనాకు డిపోర్ట్ చేసేవీలుందని ఆందోళన వ్యక్తం చేశాడు. మధ్య ఆసియా దేశాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల వద్ద సఖ్యంగా ఉంటూ వీగర్ ముస్లీంల కార్యకలాపాల గుట్టు తెలుసుకుంటున్న చైనా ఆఫ్ఘనిస్థాన్ లోనూ హక్కానీ గ్రూప్, తాలిబన్ల వద్ద కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొత్తంగా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను కూడా తన గూఢచార కేంద్రాలుగా మార్చుకుంటున్న చైనా రాబోయే రోజుల్లో ఆసియాలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? భారత్ చైనా, భారత్-పాక్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఆఫ్ఘనిస్థాన్ భవితవ్యం ఏం కానుంది? అనే ప్రశ్నలు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకమైనవి.

  Trending Stories

  Related Stories