Sports

దటీజ్ ధోని.. భారత్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు

భారత్ ఐసీసీ ట్రోఫీ గెలిచి చాలా సంవత్సరాలే అవుతోంది. ఇంకో రెండు వారాల్లో మొదలయ్యే టీ20 ప్రపంచ కప్ ను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని బీసీసీఐ పటిష్ట జట్టును ప్రకటించింది. ఐపీఎల్-2021 సెకండ్ లెగ్ కూడా దుబాయ్ లో నిర్వహించడంతో.. భారత ఆటగాళ్లకు కూడా మంచి ప్రాక్టీస్ లభించినట్లే..! పిచ్ ల మీద కూడా మంచి అవగాహన వచ్చింది. ఇక భారత జట్టు మెంటార్ గా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనిని కూడా పిలుచుకుని వెళ్తోంది. అయితే మెంటార్ గా సేవలు అందించడానికి ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టుకు మెంటార్‌గా సేవలందించేందుకు మహేంద్రసింగ్‌ ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. తన సారధ్యంలో టీమిండియాకు రెండుసార్లు విజేత(2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌)గా నిలిపిన ధోని భారత జట్టుకు సేవలందించడం తన బాధ్యతగా భావిస్తానని చెప్పాడని, అందుకుగాను ఎలాంటి ఫీజులు తీసుకోనని మెంటార్‌గా ఎన్నికైనప్పుడే స్పష్టం చేశాడని షా తెలిపారు. దేశం కోసం ధోని కమిట్మెంట్‌ గొప్పదని షా ప్రశంసించారు. మెంటార్‌గా ధోనిని ఎంపిక చేయడం టీమిండియాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని.. భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులోని సభ్యులందరికీ ధోని అంటే అమితమైన గౌరవముందని, కొత్త బాధ్యతల్లో ధోని తప్పక రాణిస్తాడని అన్నారు. అతని ఆధ్వర్యంలో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాలని యావత్‌ భారత దేశం ఆకాంక్షిస్తుందని తెలిపారు.

మెంటర్‌గా సేవలంధించేందుకు ధోనీ ఎలాంటి ఫీజులు తీసుకోరని తాజా ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఎలాంటి ఫీజు లేకుండా ధోనీ టీమిండియాకు సేవలందిస్తుండటం పట్ల సోషల్ మీడియాలో ధోనికి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Back to top button