‘అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న’ అంటారు. ఈ ప్రపంచంలో రక్తం సరైన సమయంలో అందక ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు కానీ పత్రికల్లో వార్త కథనాలు వచ్చినప్పుడు చూసీ చలించిపోతాం. కానీ సహాయం చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ మన దైనందిన జీవితంలో మన పనులు అవసరాల వల్ల రక్తదానం చేయలేక పోతాం… సహాయం చేయాలన్న ఆలోచన అందరికీ ఉన్నా ఆచరణలో పెట్టడానికి ముందుకు రాలేక పోతాం. ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేకుండా, అందరికీ సరైన సమయంలో రక్తం అందేవిధంగా “దాత్రుత” ఫౌండేషన్ అత్యద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రక్తం కోసం రక్తదాన శిబిరాలు తిరగాల్సిన పనిలేదు. రెండు జతల జోళ్లు, ఒక జత కాళ్లు అరిగేలా తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే రక్తం సేకరించుకునే అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహిస్తున్నారు. దీని కోసం మనందరం చేయవలసిందల్లా ఒక్కటే… ప్రతీ ఒక్కరికీ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ లో మన సన్నిహితులవి కానీ.. స్నేహితులవి కానీ ఫోన్ నెంబరు సేవ్ చేసేటప్పుడు పేరుతో కాకుండా పేరుకు జతగా వాళ్ల బ్లడ్ గ్రూప్ ని కూడా సేవ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అత్యవసర సమయంలో బ్లడ్ బ్యాంక్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫేస్ బుక్ లలో వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేయాల్సిన అవసరం అంతకంటే ఉండదు. మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్లని సంప్రదించి అత్యవసర సమయంలో రక్తం సేకరించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు మీకే కాకుండా అత్యవసర సమయాల్లో రక్తం కోసం విలవిల్లాడుతున్న అభాగ్యులకు ఎందరికో ప్రాణం పోసిన వారవుతారు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్లకి పునర్జన్మనిచ్చిన దేవుళ్లవుతారు.అందుకే ప్రతీ ఒక్కరి కాంటాక్ట్ లిస్టే వారి బ్లడ్ బ్యాంక్..
ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించాలన్న దృఢసంకల్పం తో, కృతనిశ్చయంతో ముందుకు వచ్చిన దాత్రుత ఫౌండేషన్ వారిని అభినందించవలసిందే. ప్రతీ ఒక్కరూ ఇక పై ఇలానే నెంబరు సేవ్ చేస్తారని ఆశిస్తున్నాము.
Foundation Phone Number: +91 93927 84225