More

    ఏపీలో హాట్ టాపిక్ గా మారిన దేవినేని ఉమా అరెస్టు వ్యవహారం..!

    టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు, 307 కింద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. గత రాత్రి ఉమను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో పరిశీలనకు వెళ్లిన ఉమ తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది. వైసీపీ గూండా రాజకీయాలను ఖండిస్తున్నట్టు, ఒక్కరిపై 100 మంది దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిందితులను వదిలేసి, బాధితులను అరెస్ట్ చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలన, మైనింగ్ మాఫియా, అవినీతి, అక్రమాలకు అడ్డుపడుతున్నారనే దేవినేని ఉమపై వైసీపీ నేతలు దాడి చేశారని.. దాడి చేసిన వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిన పోలీసులు.. వైసీపీ సెక్షన్ల కింద దేవినేని ఉమపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులనే నిందితులుగా మార్చిన దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ ఏపీలో ఉండడం దురదృష్టకరమని.. ఓ మాజీ మంత్రినే చట్ట వ్యతిరేకంగా ఇంతలా హింసిస్తే.. సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులూ తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకున్న మీ బాస్ కు పట్టిన గతే మీకూ పడుతుందంటూ లోకేశ్ హెచ్చరించారు. దానికి కొద్దిగా టైమ్ పడుతుందంతే అంటూ విరుచుకుపడ్డారు నారా లోకేష్.

    వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వసంత కృష్ణప్రసాద్ చేతిలో పొందిన ఓటమిని దేవినేని ఉమ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలు ఛీ కొట్టినా ఆయన బుద్ధి మారడం లేదని అన్నారు. మైనింగ్ లో అక్రమాలు జరిగితే అధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ అర్ధరాత్రి పరిశీలనకు వెళతారా? అని ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. రాత్రిపూట పరిశీలనకు వెళ్లిన ఉమను నిలదీసినందుకు వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని.. ఈ డ్రామాలను ఇకనైనా ఆపాలని మండిపడ్డారు. వసంత కృష్ణప్రసాద్ పై బురదజల్లేందుకు నాటకాలు ఆడుతున్నారని.. జక్కంపూడిలో ప్రజలే దేవినేనిని తరిమికొట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

    Related Stories