ఎన్డీఏలోకి జనతా దళ్..!

0
144

ఎన్డీయే కూటమిలోకి జనతా దళ్ సెక్యులర్ పార్టీ చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. సమావేశం ముగియగానే ఎన్డీయేలో చేరినట్టు కుమారస్వామి ప్రకటించారు. ఈ భేటీపై జేపీ నడ్డా స్పందిస్తూ… ఎన్డీయేలో భాగస్వామి కావాలని జేడీఎస్ నిర్ణయించుకోవడం సంతోషకరమని చెప్పారు. వారిని ఎన్డీయే కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోదీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. భారతదేశ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ జనతాదళ్ స్థాపించారు. జూన్ 1996 నుండి ఏప్రిల్ 1997 వరకు భారత ప్రధానిగా పనిచేశారు దేవె గౌడ.

జేడీఎస్ భారతీయ జనతా పార్టీలో చేరబోతోందనే చర్చ చాలా కాలంగా సాగుతూ ఉంది. బీజేపీతో చేరిపోతున్నారా..? అని ఇటీవల మీడియా కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఎన్డీయే కూటమిలో చేరిక అధికారికంగా ప్రకటించారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ మధ్య పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘోర పరాభవం పొందింది. బీజేపీ అధికారం కోల్పోడానికి కూడా జేడీఎస్ కారణమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని బీజేపీతో జేడీఎస్ పొత్తును ప్రకటించింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప కొద్దిరోజుల కిందట జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 36.35% ఓట్లు రాగా, 2023లో 0.35% తగ్గి 36 శాతం ఓట్లు సాధించింది. గత ఎన్నికలతో సమానంగా ఓట్ల శాతం సాధించింది. కానీ సీట్లు మాత్రం సాధించలేకపోయింది. ఇక జేడీఎస్ ఓట్ల శాతం తగ్గి, అవి కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యాయి. 2018లో 18.3 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్ 2023లో 13.29 శాతానికి పడిపోయింది. 5.01 శాతం ఓట్లు జేడీఎస్ కోల్పోవడం కాంగ్రెస్ కు ప్లస్ అయింది. అధికారాన్ని కైవసం చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఈ తప్పు రిపీట్ అవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. అందుకే జేడీఎస్ తో కలిసి పోటీ చేయనుంది.