అసలే.. మూడూ విభిన్న ధృక్పదాలు కలిగిన పార్టీల కూటమి ప్రభుత్వం.! ఆపై రాష్ట్ర మంత్రులపై రోజుకో అవినీతి ఆరోపణలు! మహా వికాస్ అఘాడీ సర్కార్ కాస్తా.., మహా వసూళ్ల సర్కార్ గా మారిందంటూ ఇటు విపక్ష బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది…! అటు అంబానీ ఇంటి వద్ద కారు బాంబు కేసు విచారణను సీబీఐ, ఎన్ఐఏలు వేగవంతం చేశాయి.
మరోవైపు ప్రజల్లో ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతుంది. అదుపులోకి వచ్చిందనుకున్న కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. సీఎం ఉద్దవ్ థాక్రేను కొంతమంది అయితే చేతకాని సీఎం అని విమర్శస్తుండగా…, మరికొందరైతే ఉత్సవ విగ్రహం అంటున్నారు. ఆయన్ను సీఎం కూర్చీలో కూర్చొబెట్టి… అసలు పవర్ అంతా శరద్ పవార్, సోనియా చేతుల్లోనే ఉందంటూ నెటిజన్లు ట్రోలింగులు చేస్తున్నారు.! రోజు రోజుకూ దిగజారిపోతున్న ప్రభుత్వ పరువును కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరగకుండా., న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి.? బోర్డుపై గీతను చెరపకుండా దాన్ని చిన్నది చేయాలంటే.., దాని పక్కనే ఓ పెద్ద గీత గీయాలి. ఇప్పుడు మహా సర్కార్ కూడా ఇదే చేస్తోందా? తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసలు ఇష్యూలను డైవర్ట్ చేయడమే పనిగా పెట్టుకుందా? అంటే అవునని చెప్పక తప్పదు.
గత మూడు రోజులుగా…, మహారాష్ట్ర సర్కార్ కోవిడ్ టీకాల సరఫరా విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్రలో టీకాల కొరత ఉందని.. తమకు అవసరమైన మేరకు వ్యాక్సిన్లను కేంద్రం అందించడం లేదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. రాష్ట్రంలో వారానికి 40 లక్షల టీకా డోసులు అవసరం కాగా.. ప్రస్తుతం మహా ఆరోగ్యశాఖ వద్ద 14 లక్షల డోసులే నిల్వ ఉన్నాయని, ఇవి కేవలం మూడు రోజులకే సరిపోతాయని ఆయన చెప్పుకోచ్చారు. తమకు మరో 15 నుంచి 20 లక్షల వరకు డోసులు పంపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
అంతేకాదు మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే ఒక అడుగు ముందుకు వేసి కేంద్రంపై వ్యంగ్యోక్తులు విసిరారు. మొదట దేశ ప్రజల అవసరాలు తీర్చాలని, ఆ తర్వాత ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయాలంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించాడు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే అయితే 25 ఏళ్ళ పై బడిన యువకులందరికి కూడా వెంటనే కొవిడ్ టీకాలు వేసేలా అనుమతించాలని కోరారు. అందుకు అనుగుణంగా తమకు వ్యాక్సిన్లను సరఫరా చేయాలన్నారు.
మరోవైపు కేంద్రం తగినన్ని వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదని మహా సర్కార్ చేసిన విమర్శలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మండిపడ్డారు. కొవిడ్ టీకాల సరఫరా కొరతనే లేదని, మహారాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోందని…, కరోనా కట్టడి సమయంలో కూడా మహా సర్కార్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తోందని, కరోనాతో పోరాటంలో ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని హర్షవర్ధన్ మండిపడ్డారు.
అటు కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం పెరగడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ వివాదాన్ని చల్లబర్చే ప్రయత్నం చేశారు. తాను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడానని, మహారాష్ట్రకు వ్యాక్సిన్ల కొరత లేకుండా చూస్తామని కేంద్రమంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చారని పవర్ చెప్పుకొచ్చారు.
దీంతో వ్యాక్సిన్ల కొరతకు సంబంధించి మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి చేసిన కామెంట్లను గత మూడు రోజులుగా మహారాష్ట్ర లోని లోకల్ మీడియాతోపాటు అక్కడి పత్రికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ హెడ్డింగుల మాటున ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల వార్తలు సైడ్ లైన్ అయ్యాయి. సో ఒక వార్తను చిన్నది చేయాలంటే.. మరో కొత్త వార్తను క్రియేట్ చేసి అనుకూల మీడియాలో ప్రచారం చేయడం ద్వారా శివసేనకు కనీసం తాత్కాలిక ఉపశమనమైనా వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.