More

  మరో కరోనా వేరియంట్ డెల్టాక్రాన్.. భారత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..!

  కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూనే ఉంది. ఒమిక్రాన్ తాజాగా కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. సైప్రస్ లో ఈ వేరియంట్ బయటపడింది. దీనికి డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు. ఈ కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. ఈ వేరియంట్ ను సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ గుర్తించారు. డెల్టాక్రాన్ వేరియంట్ గురించి సైంటిస్టులు మాట్లాడుతూ దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.

  సుప్రీంకోర్టులో కూడా కరోనా కలకలం చెలరేగింది. సుప్రీంకోర్టులో 150 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుప్రీంకోర్టులో మొత్తం 3 వేల మంది వరకు సిబ్బంది ఉంటారు. సుప్రీంకోర్టు ఆవరణలోనే ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సుప్రీంకోర్టు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా ఉద్ధృతికి తోడు ఒమిక్రాన్ కూడా తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండడంతో సుప్రీంకోర్టులో ఈ నెల మొదటి వారం నుంచి ఆన్ లైన్ విచారణలు చేపడుతున్నారు.

  ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నివాసంలో కొవిడ్ కలకలం రేగింది. సీఎం నివాసంలో ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్ తో పాటు వారి ఇద్దరి కుమారులు నితిన్, విశ్వజిత్ కు, హేమంత్ సొరెన్ బంధువు సరళా ముర్ము, ఓ సెక్యూరిటీ గార్డుకు కూడా కరోనా సోకింది. సీఎం అధికారిక నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో హేమంత్ సొరెన్, ఆయన మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్, సహాయకుడు సునీల్ శ్రీవాస్తవలకు కరోనా నెగెటివ్ వచ్చింది. సీఎం నివాసంలో కరోనా పాజిటివ్ వచ్చినవారందరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

  పార్లమెంటులో 400 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్ లో మొత్తం 1,409 మంది పనిచేస్తుండగా జనవరి 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో భారీగా కేసులు బయటపడ్డాయి. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడడంపై ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన సిబ్బందిలో వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్ సభ సిబ్బంది కాగా.. 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.

  బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆయన స్వయంగా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తాలూకు బలమైన లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తల రక్షణ కోసం ఈసీ చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ కోరారు. ‘‘కరోనా మూడో విడత, ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం. ఎన్నికల అభ్యర్థులు, కార్యకర్తలకు ముందస్తు కరోనా టీకా డోసులను ఇచ్చే చర్యలను ఈసీ తీసుకోవాలి’’అని వరుణ్ గాంధీ కోరారు.

  దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా మరోసారి సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేశ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు.

  సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాజేంద్రప్రసాద్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.

  Trending Stories

  Related Stories