దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించింది. మూడు వారాల తర్వాత ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాల్స్, మార్కెట్లు, దుకాణాలు సరి-బేసి విధానంలో తెరువనుండగా.. సినిమా థియేటర్లు, రెటస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు మూసే ఉండనున్నాయి. ప్రైవేటు కార్యాలయాలు సైతం 50శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఏ సిబ్బంది వంద శాతం సామర్థ్యంతో, గ్రూప్-బీలో 50శాతం మంది సిబ్బందితో పని చేయనున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మే 31న అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ సడలింపులు పెంచుతున్నామని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రజలకు సూచించారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు కృషి చేస్తూనే కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు. కరోనా నివారణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోవద్దని చెప్పారు. వచ్చిపోయే వినియోగదారుల కోసం మాల్స్ రక్షణ చర్యలు చేపడుతున్నాయి. మెట్రో ప్రారంభమైనా ప్రస్తుతానికి సగం రైళ్లనే నడుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో మే 20 నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో సేవలను నిలిపివేసింది. అందుబాటులో ఉన్న రైళ్లలో సగం మాత్రమే నడుస్తాయని డీఎంఆర్‌సీ అధికారి తెలిపారు. రైళ్ల వేళల్లోనూ మార్పులు చేశారు. ఇంతకు ముందు ఐదు నిమిషాలకో రైలు వచ్చేది. ఇప్పుడు దానిని 15 నిముషాలకు పెంచారు. అన్ లాక్ విషయంలో కేజ్రీవాల్ తొందరపడ్డారా అనే విమర్శలు కూడా వస్తున్నాయి.