More

  అన్ లాక్ అంటున్న కేజ్రీవాల్.. తొందరపాటు చర్య కాదు కదా..!

  ఢిల్లీలో ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇన్ని రోజులూ లాక్ డౌన్ ను అమలు చేసిన ఢిల్లీ ప్రభుత్వం ఇకపై అన్ లాక్ మీద దృష్టి పెట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మే 31 నుండి ఢిల్లీలో అన్ లాక్ మొదలవ్వబోతోందని తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అందుకే అన్ లాక్ గురించి ఆలోచిస్తూ ఉన్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఒక్కొక్కటిగా సడలింపులను తీసుకొని వస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆర్థికంగా కూడా రాష్ట్రం మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అన్ లాక్ లో భాగంగా ఫ్యాక్టరీలకు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. రోజువారీ కూలీలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. మిగిలినవన్నీ మూసే ఉంచామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకండని కేజ్రీవాల్ కోరారు.

  ‘కోవిద్-19 కేసులు ఢిల్లీలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజలు లాక్ డౌన్ కు సహకరించడం వలనే ఇది సాధ్యమైందని అన్నారు. ఒక నెల రోజులోనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చామని అన్నారు. గత 24 గంటల్లో 1100 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని.. 1.5 శాతం మాత్రమే పాజిటివిటీ రేటు ఉందని అన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్లు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి’ అని కేజ్రీవాల్ వెల్లడించారు.

  ఈ నిర్ణయం తీసుకోడానికి ముందు కేజ్రీవాల్ పలువురు నిపుణులతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ మే 31 ఉదయం 5 గంటల వరకూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ‘ఎన్నో కఠిన నిర్ణయాలు, చర్యల కారణంగా కరోనా కట్టడి వీలైంది. కరోనా మీద ఇంకా గెలవలేదు. ఒక నెల పాటూ లాక్ డౌన్ వలన వచ్చిన ఫలితాలను వెంటనే కాల రాయాలని అనుకోవడం లేదు. నిపుణులు సూచించినట్లుగా ఒక్కో ఫేజ్ లో అన్ లాక్ అన్నది జరుగుతుంది’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఎంతో మంది ఢిల్లీకి వలస వచ్చి కూలీలుగా జీవనం సాగిస్తూ ఉన్నారని.. అలాంటి వారికి అన్ లాక్ వలన ఉపాధి లభిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ ను ఎవరూ ఇష్టపడరని, ప్రభుత్వం కూడా లాక్ డౌన్ కు ఫేవర్ గా లేదని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా కేసులు మరోసారి పెరిగితే మాత్రం అన్ లాక్ అన్నది ఆగిపోతుందని మీడియాతో తెలిపారు.

  Trending Stories

  Related Stories