More

    ఢిల్లీ అల్లర్లకు పశ్చిమ బెంగాల్‎లో మూలాలు

    దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లకు పశ్చిమ బెంగాల్ లో మూలాలు వెలుగులోకి వస్తున్నాయి. జహంగీర్ పురిలో జరిగిన హింసాత్మక ఘటనలకు బెంగాల్ వ్యక్తులతో సంబంధాలు బయట పడుతున్నాయి. హనుమాన్ జయంతి సంధర్భంగా జరిగిన శోభాయాత్రపై జరిగిన దాడిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఫరీద్ అలియాస్ నీతూను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా బెంగాల్ లో జల్లెడ పట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫరీద్ చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఢిల్లీ అల్లర్లలో ఫరీద్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫరీద్ ను పోలీసులు ఢిల్లీకి తరలించి విచారణ జరపనున్నారు.

    వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పోలీసులు కూడా ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన హింసలో రాళ్లు రువ్వడంతోపాటు కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన తర్వాత అల్లరిమూకలపై తీసుకున్న చర్యలు ఒక ఉదాహరణగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఐదుగురు నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.

    మత విద్వేషాలతో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి జహంగీర్‌పురి హింసాత్మక ఘటనలో ఐదుగురు ప్రధాన నిందితులను ఢిల్లీ కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పర్మిషన్​ ఇచ్చింది. కాగా, ఈ కేసులో మరో నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఐదుగురు నిందితులు- అన్సార్, సలీం, దిల్షాద్, సోనూ, అహిర్‌లపై జాతీయ భద్రతా చట్టం విధించబడింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోహిణి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ అంశం చాలా సున్నితమైనదని, కుట్రలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది.

    విచారణలో నిందితులను పశ్చిమ బెంగాల్, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది. నిందితులను ఎనిమిది రోజుల రిమాండ్‌కు పోలీసులు కోరారు. ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను కోర్టు ఎనిమిది రోజుల పోలీసు రిమాండ్‌కు పంపగా, మిగిలిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితులను బెంగాల్ తీసుకెళ్లి విచారించిన పోలీసులు ఫరీద్ ను అల్లర్లకు ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

    Trending Stories

    Related Stories