కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బిజినెస్ మ్యాన్, ఖాన్ చాచా రెస్టారెంట్ ఓనర్ నవనీత్ కల్రా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నవనీత్ కల్రాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి హోటళ్లలో 524 ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను గత వారంలో పోలీసులు సీజ్ చేశారు. అప్పటి నుండి నవనీత్ కల్రా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. గురుగ్రామ్ లో నవనీత్ కల్రాను అదుపులోకి తీసుకున్న సౌత్ డిస్ట్రిక్ట్ పోలీసులు అతన్ని క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించారు.
నవనీత్ కల్రా ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ తరలించాడు. భారత్ లో ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్ల అవసరం ఎంతగానో ఉంది. ఇలాంటి సమయంలో నవనీత్ కల్రా వీటిని బ్లాక్ మార్కెట్ కు తరలించి పెద్ద ఎత్తున లాభపడ్డాలని అనుకున్నాడు. నవనీత్ కల్రా వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. నవనీత్ కల్రాకు చెందిన ప్రాంతంలో ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న వెంటనే.. అతడు ముందస్తు బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు. అతడి బెయిల్ ను హై కోర్టు రిజెక్ట్ చేసింది.

మే 6న ఢిల్లీ పోలీసులకు ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లకు సంబంధించిన బ్లాక్ మార్కెటింగ్ సమాచారం అందింది. కొన్ని రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను దాచారని తెలుసుకుని లోధి రోడ్ లో ఉన్న నేగె&జు బార్ ను పోలీసులు జల్లెడ పట్టారు. అందులో కొన్ని డజన్ల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు బయట పడ్డాయి. ఆ రెస్టారెంట్ లో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకోగా ‘ఖాన్ చాచా’ రెస్టారెంట్ తో లింక్ లు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ రెస్టారెంట్ కు నవనీత్ కల్రా ఓనర్. మొత్తం ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్ల బ్లాక్ మార్కెటింగ్ దందా బయటకు వచ్చింది. మే 7 నుండి నవనీత్ కల్రా కనిపించడం మానేశాడు. తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాడు. నవనీత్ కల్రా ఉండే చోటులకు ప్రత్యేకంగా పోలీసు టీమ్ లు వెళ్లినప్పటికీ దొరక్కుండా తప్పించుకున్నాడు. చత్తార్పూర్ లోని ఫామ్ హౌస్ లో కూడా కనిపించలేదు. అలా తప్పించుకుని తిరిగిన నవనీత్ కల్రా ఈరోజు అరెస్టు అయ్యాడు. ఈ బ్లాక్ మార్కెట్ దందాకు కు విదేశాల్లో కూడా లింక్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిక్స్ సెల్యూలార్ కంపెనీ ఓనర్ గగన్ దుగ్గల్ కు కూడా ప్రమేయం ఉందని కనుక్కున్నారు. 20000 రూపాయలకు ఒక్కో ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్ ను చైనా నుండి కొనుక్కుని.. వాటిని లండన్ లో ఉన్న గగన్ దుగ్గల్ భారత్ కు పంపేవాడు. ఇక్కడ వీటిని 50000 నుండి 70000 రూపాయల మధ్య అమ్ముతూ ఉన్నారు. ఇంకొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కున్న వాళ్లు ఉన్నారు. దుగ్గల్ కంపెనీ సి.ఈ.ఓ. గౌరవ్ ఖన్నాకు కూడా ఈ బ్లాక్ మార్కెటింగ్ దందాలో ప్రమేయం ఉందని తెలిసి అరెస్టు చేశారు.