More

    ఢిల్లీలో ఏకే-47తో ఉన్న తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో అష్రఫ్ అలీ అనే పాకిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది దగ్గర నుండి AK47, ఇతర ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా పర్యవేక్షిస్తున్నారు. అష్రఫ్ అలీ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవాడని తెలుస్తోంది. భార‌త జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామ‌ణి అవుతూ ల‌క్ష్మీన‌గ‌ర్‌లోని ర‌మేష్ పార్క్ ప్రాంతంలో ఉంటున్నాడు.

    అత‌ని ద‌గ్గ‌రి నుంచి పోలీసులు ఏకే-47తోపాటు అద‌నంగా ఉన్న‌ మ్యాగ‌జైన్‌, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్‌, 2 పిస్ట‌ళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్ర‌వాదిపై చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల (నిరోధ‌క‌) చ‌ట్టం, పేలుడు ప‌దార్థాల చ‌ట్టం, ఆయుధాల చ‌ట్టంతోపాటు ఇత‌ర సంబంధిత చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఉంటున్న ఇంట్లోనూ సోదాలు నిర్వ‌హించారు. పండుగల సమయంలో భారత్ లో అలజడి సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేశంలోని పలు నగరాల్లో పోలీసులు సెక్యూరిటీని మరింత పెంచేశారు.

    భారత్ లో విధ్వంసానికై ఎన్నో ప్లాన్లు:

    ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తున్న టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. 6 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో 2 మంది పాకిస్తాన్‌లో శిక్షణ పొందారు. ఈ టెర్రర్ మాడ్యూల్ కు గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో లింక్స్ ఉన్నట్లు కూడా తెలిసింది. ఉగ్రవాదులు 15 రోజుల పాటు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని పోలీసులు తెలిపారు. పండగ సీజన్‌లో దాడులను పాల్పడ్డానికి కొన్ని ప్రాంతాలపై నిఘా కూడా ఉంచారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లలో పలువురిని అరెస్టు చేసినట్లు సమాచారం. రాజస్థాన్‌లోని కోటాలో సమీర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు, ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్టు చేశారు. ముగ్గురు ఉత్తరప్రదేశ్ లో పట్టుబడ్డారు.

    Trending Stories

    Related Stories