More

  5జీ వద్దంటూ కోర్టుకు ఎక్కిన జూహీ చావ్లాకు ఊహించని షాక్

  బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 5జీ నెట్వర్క్ ద్వారా మానవాళికి ఎంతో ప్రమాదం జరుగుతుందని.. అంతేకాకుండా పర్యావరణ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పే అవకాశం ఉందని ఆమె తన పిర్యాదులో కోరారు. అనేక రకాల మొక్కలు మరియు జంతువులలో డిఎన్ఏ, కణాలు, అవయవ వ్యవస్థలకు నష్టం వాటిల్లినట్లు ప్రయోగాత్మక ఆధారాలతో పాటు క్లినికల్ సాక్ష్యాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామని.. ఇలాంటి వాటి వలన క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్ వంటివి మనుషులను పట్టి పీడించే అవకాశం లేకపోలేదని అన్నారు. సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును మేం వ్యతిరేకించడంలేదని ఆమె ఇటీవలే వివరణ ఇచ్చారు. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న కొత్త ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నామని.. తదుపరి తరం పరికరాల వినియోగంలోనే అసందిగ్దత ఏర్పడుతోందని ఆమె అన్నారు. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయని.. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నదానికి తగిన కారణం ఇదేనన్నారు. 5జీ టెక్నాలజీ విషయంలో చోటు చేసుకుంటున్న రేసు గురించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరించారు. ఎన్నో పరిశోధనలు చేయాలని.. మనుషులకు, జంతువులకు, జీవరాశులకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాతనే భారత్ లో 5జీకి అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.

  ఢిల్లీ హై కోర్టు మాత్రం ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. 5జీ వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించి ఇండియాలో ట్ర‌య‌ల్స్‌ను వ్య‌తిరేకిస్తూ ఆమె వేసిన పిటిష‌న్‌ను శుక్ర‌వారం కొట్టివేయడమే కాకుండా.. ఆమెకు రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. ఆమె న్యాయ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసింద‌ని కోర్టు తీర్పు స్ప‌ష్టం చేసింది. ఈ దావా కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం వేసిన‌ట్లుగా ఉన్న‌ద‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు విచార‌ణ‌కు సంబంధించిన లింకును జూహీ చావ్లా.. సోష‌ల్ మీడియాలో పెట్టడం కూడా వివాదాస్పదమైంది. మూడుసార్లు విచార‌ణ‌కు అడ్డంకులు ఎదుర‌య్యాయ‌ని కోర్టు చెప్పింది. ఇక విచార‌ణ సంద‌ర్భంగా అడ్డంకులు సృష్టించిన వ్య‌క్తుల‌ను ప‌ట్టుకొని, త‌గిన చర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది.

  ఇక విచారణ సమయంలో ఓ అభిమాని పాటలు పాడడం కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే..! జూహీ తరఫున న్యాయవాది దీపక్‌ ఖోస్లా వాదనలు వినిపిస్తున్న సమయంలో ‘లాల్‌ లాల్‌ హోటోంపర్‌ గోరీ కిస్కా నామ్‌ హై’ అంటూ ఓ అభిమాని పాటపాడాడు. చిరాకు పడిన న్యాయమూర్తి సైలెంట్ గా ఉండాలని లేకపోతే విచారణ నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికి ‘మేరి బన్నోకి ఆయేగి బారాత్‌’ అంటూ మరో పాట విచారణ సమయంలో పాడడం జరిగింది. పాటలు పాడుతున్న వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉంటాడో వెంటనే కనుక్కోమని సిబ్బందిని న్యాయమూర్తి ఆదేశించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టు ధిక్కారం కింద నోటీసులు ఇవ్వాలని చెప్పారు.

  Trending Stories

  Related Stories