కేజ్రీవాల్ ఇంటి రిపేర్లకు 9 కోట్లట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో మార్పులు చేయడానికి 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. అది కూడా ప్రజల డబ్బును ఖర్చు చేశారని బిజెపి నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసం ప్రాంగణం బయట చిత్రీకరించిన వీడియోలో జిందాల్ పలు ఆరోపణలు చేశారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఢిల్లీ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల కోసం ఎంతగానో ఇబ్బందులు పడుతున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన నివాసానికి మెరుగులు దిద్దడానికి కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ వాసులు నివాసితులు 1 లీటర్ స్వచ్ఛమైన నీటి కోసం కష్టపడుతున్న సమయంలో.. అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఈత కొలను నిర్మిస్తున్నాడని జిందాల్ కొన్ని పత్రాలను చూపిస్తూ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో అదనంగా కొన్ని మార్పుల కోసం టెండర్ ఆమోదించబడిందని తెలియజేస్తూ కాంట్రాక్టర్కు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వును జిందాల్ ప్రదర్శించారు. ఈ పనులకు 8,61,63,422 రూపాయలను ఆమోదించారు. ఇంత ఎక్కువ ఖర్చుతో ఎలాంటి మార్పులు చేస్తున్నారోనని బిజెపి ఆశ్చర్యపోయింది. వారు స్విమ్మింగ్ పూల్, వాటర్ పార్క్ తయారు చేస్తున్నారా అని ఆయన అడిగారు. ప్రభుత్వ నివాసం నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు.. పన్ను చెల్లింపుదారుల డబ్బును మరింతగా వాడుకొని ఇంటికి మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జిందాల్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి నివాసం నవీనీకరణపై మీడియా సంస్థలు సైలెంట్ గా ఉన్నాయని.. సోషల్ మీడియా వినియోగదారులు, ఢిల్లీ ప్రజలు తమ గొంతును పెంచాలని కోరారు. కరోనా మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేసినందుకు కేజ్రీవాల్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు . ప్రజలకు ఉచిత టీకాలు ఇస్తానని వాగ్దానం చేసిన కేజ్రీవాల్ ఆ మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని జిందాల్ విమర్శించారు. ఓ వైపు రామ జన్మభూమి విషయంలో ‘భూ కుంభకోణం’ చోటు చేసుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు కథనాలను ప్రచారం చేసి.. శ్రీ రాముడి ఆలయ నిర్మాణానికి అవరోధాలను సృష్టిస్తున్నారని.. మరోవైపు, వారు తమ లగ్జరీ కోసం ప్రజల డబ్బును ఎంతగానో వాడుకుంటూ ఉన్నారని విమర్శించారు జిందాల్.
ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు:
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును వాడుకుంటూ ఉంది. ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేస్తూ ఉంది కేజ్రీవాల్ ప్రభుత్వం. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జనవరి 2021 నుండి 2021 మార్చి వరకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటనలు, ప్రచారం కోసం రూ .150 కోట్లు ఖర్చు చేసిందట.. కేజ్రీవాల్ ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రకటనల కోసం 800 కోట్లకు పైగా ఖర్చు చేసింది.