Special Stories

కేజ్రీవాల్ కక్కుర్తితో ఆక్సిజన్ కోసం అల్లాడిన 12 రాష్ట్రాలు

కరోనా సెకండ్ వేవ్‎లో ఆక్సిజన్ కొరతతో.. ఓవైపు రాష్ట్రాలు అల్లాడుతుంటే.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం అవసరానికి మించి ఆక్సిజన్‎ను పోగేసుకుంది. పక్కోడు చస్తే నాకేంటి.. నేను మాత్రం సేఫ్‎గా వుండాలన్న రీతిలో.. అవసరానికి మించి నాలుగు రెట్లు ఆక్సిజన్‎ను తెప్పించుకుంది. ఇందుకోసం తప్పుడు లెక్కలు చూపించి కేంద్ర ప్రభుత్వం అధికారులను ఏమార్చింది. ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా నేతృత్వంలో.. సుప్రీం కోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ ప్యానెల్.. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తప్పులు లెక్కల్ని బట్టబయలు చేసింది. ప్యానెల్ మధ్యంతర నివేదిక ప్రకారం.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ డిమాండ్‎ను అవసరానికి మించి అంచనావేసింది. ఫలితంగా ఆక్సిజన్ సప్లయి చైన్ గాడితప్పింది. దీంతో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర వంటి 12 రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరాపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కేటాయింపులు సవ్యంగా.. శాస్త్రీయంగా.. సమాన ప్రాతిపదికన జరిగేలా చూసేందుకు.. సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో.. 12 మంది సభ్యులతో.. మే 8న జాతీయ జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ‘ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్’లో పరిస్థితిని అంచనావేయడానికి ఐదుగురు సభ్యులతో సబ్ కమిటీని కూడా నియమించింది. వీరిలో ఏయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్, మాక్స్ హెల్త్ కేర్ డైరెక్టర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకరు, పెట్రోలియమ్ అండ్ ఎక్స్‎ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ఒకరు సభ్యులుగా వున్నారు. మే 11 నుంచి 21 వరకు వరుస సమావేశాలు నిర్వహించిన సబ్ కమిటీ సభ్యులు.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, ఆసుపత్రులు, PESO మరియు ఆక్సిజన్ సరఫరాదారుల నుంచి వివిధ డాక్యుమెంట్లను సేకరించింది. ఆ డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత.. తాజాగా మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.

ఢిల్లీ ప్రభుత్వం 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‎ను డిమాండ్ చేసినట్టు మధ్యంతర నివేదిక స్పష్టం చేసింది. అయితే, ఆ డిమాండ్‎కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చింది. ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు అంచనాలు వేసుకుందని, లెక్కల్లో చాలా తేడాలున్నాయని మధ్యంతర నివేదిక పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ డేటా ఫైల్ చేస్తోంది. అయితే, ఆసుపత్రులు పంపిన డేటాకు, ప్రభుత్వం చెప్పిన లెక్కలకు ఎక్కడా పొంతన లేకపోవడాన్ని ఆడిట్ కమిటీ గుర్తించింది. ఢిల్లీ NCT రీజియన్‎లో 5 వేల 500 ఐసీయూ పడకలు, 18 వేల నాన్ ఐసీయూ పడకలు వున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కానీ, ఆసుపత్రుల డేటాతో సరిపోల్చినప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలని తేలింది. ఆసుపత్రులు పంపిన డేటాలో ఎక్కువ పడకలను చూపించడంతో ఆక్సిజన్ డిమాండ్‎ను అధికంగా లెక్కించినట్టు గుర్తించారు.

వాస్తవ ఆక్సిజన్ వినియోగం, బెడ్ల సామర్థ్యం ఫార్ములా ఆధారంగా లెక్కించినప్పుడు.. అసవరానికి, డిమాండ్‎కు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టు ఆడిట్ కమిటీ గుర్తించింది. కేవలం 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంటే.. దానిని ఏకంగా 1140 మెట్రిక్ టన్నులుగా చూపించింది. అంటే అసలు డిమాండ్ కంటే నాలుగు రెట్లు అధికంగా చూపించింది ఢిల్లీ సర్కార్. ముఖ్యంగా నాలుగు ఆసుపత్రులు ఆక్సిజన్ డిమాండ్‎ను ఎక్కువగా చూపించాయి. సింఘాల్ హాస్పిటల్, అరుణ అసఫ్ అలీ హాస్పిటల్, ఈఎస్ఐ మోడల్ హాస్పిటల్, లైఫ్ రే హాస్పిటల్స్‎లో బెడ్లు తక్కువగా వున్నప్పటికీ.. ఎక్కువ ఆక్సిజన్‎ను డిమాండ్ చేశాయి. నాలుగు ఆసుపత్రుల్లోని వాస్తవ పడకల ఆధారంగా లెక్కించినప్పుడు.. వాస్తవ ఆక్సిజన్ డిమాండ్ చాలా తక్కువగా వున్నట్టు ఆడిట్ కమిటీ సభ్యులు గుర్తించారు. ఇలాంటి తప్పుడు లెక్కల్ని చూపించి భారీగా ఆక్సిజన్‎ను డిమాండ్ చేయడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాలా ఆధారంగానే.. లెక్కలు కట్టామని చెబుతోంది ఢిల్లీ ప్రభుత్వం. నిజానికి, కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ఆధారంగా లెక్కిస్తే కూడా.. ఆక్సిజన్ డిమాండ్ చాలా చాలా తక్కువని తేలింది. దీనినిబట్టి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ అబద్ధాలు చెబుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఢిల్లీ ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తం 183 ఆసుపత్రుల వాస్తవ వినియోగం 1140 మెట్రిక్ టన్నులు. కానీ, నాలుగు ఆసుపత్రుల తప్పుడు డేటాను సరిదిద్దిన తర్వాత.. వాస్తవ డిమాండ్ 209 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే, ఢిల్లీ ప్రభుత్వ డిమాండ్.. వాస్తవ డిమాండ్‎కు నాలుగు రెట్లు ఎక్కువన్నమాట.

ఆడిట్ కమిటీ నివేదిక ప్రకారం.. ఢిల్లీలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన మే 3న లెక్కల్ని పరిశీలిద్దాం. ఆరోజు కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ప్రకారం.. ఆక్సిజన్ వినియోగం 289 మెట్రిక్ టన్నులు అనుకుంటే.. ఢిల్లీ ప్రభుత్వ ఫార్ములా ప్రకారం.. 391 మెట్రిక్ టన్నులు ఉండాలి. ఇక, అత్యధిక నాన్ ఐసీయూ పడకలతో పాటు.. 5866 ఐసీయూ పడకలను పరిగణలోకి తీసుకున్నా.. ఆరోజు పడకల సామార్థ్యం ఆధారంగా.. కేంద్ర ప్రభుత్వ ఫార్ములాతో లెక్కించినప్పటికీ.. డిమాండ్ మహా అయితే 415 మెట్రిక్ టన్నులు ఉండాలి. పడకల సామర్థ్యం ఆధారంగా.. ఢిల్లీ ప్రభుత్వ ఫార్ములా ప్రకారం లెక్కించినా.. ఆక్సిజన్ డిమాండ్ 568 మెట్రిక్ టన్నులు ఉండాలి. కానీ, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కల్ని వడ్డించింది. కేంద్ర ప్రభుత్వ ఫార్ములాతో లెక్కించామని చెబుతూ.. 700 మెట్రిక్ టన్నులు.. తమ సొంత ఫార్ములా ప్రకారం 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్‎ను లెక్కల్లో చూపించింది. ఇలాంటి తప్పుడు లెక్కల్ని.. సుప్రీం కోర్టు నియమించిన ఆడిట్ కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది.

ఆక్సిజన్ బెడ్ కేటాయించినంత మాత్రానా.. ప్రతి కొవిడ్ పేషెంట్ కూ ఆక్సిజన్ అవసరం ఉండకపోవచ్చు. అంతేకాదు, ఆక్సిజన్ అవసరం తీరిపోయిన తర్వాత కూడా సదరు పేషెంట్.. వివిధ కారణాలతో అదే బెడ్‎పై కొనసాగే అవకాశం వుంటుంది. ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆక్సిజన్ డిమాండ్ ను లెక్కగట్టాలి. కానీ, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం.. నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్లన్నింటికీ ఆక్సిజన్ అవసరమని భావించి.. తప్పుడు లెక్కలు కట్టింది. కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ప్రకారం.. నాన్ ఐసీయూ ఆక్సిజన్ పడకల్లో కేవలం 50 శాతం పేషెంట్లకు మాత్రమే ఆక్సిజన్ వినియోగిస్తారు. కానీ, ఢిల్లీ మాత్రం 100 శాతం బెడ్లను లక్కలోకి తీసుకుంది. ఇలా ఆక్సిజన్ డిమాండ్ ను లెక్కించడంలో అనేక తప్పులు దొర్లినట్టు ఆడిట్ కమిటీ గుర్తించింది.

నిజానికి, ఏప్రిల్, మే సమయంలో మహారాష్ట్రలో ఢిల్లీ కంటే పరిస్థితి దారుణంగా వుంది. పీక్ టైమ్ లో ఒక్క ముంబయిలోనే మొత్తం NCR ఢిల్లీతో సమానంగా 90 వేల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, ఆ సమయంలో ముంబయిలో 250 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వాడితే.. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం నాలుగు రెట్లు అధికంగా 976 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును డిమాండ్ చేసింది. పైగా, తమకు ఆక్సిజన్ సరిపోవట్లేదని, రోజుకు 700 టన్నుల ఆక్సిజన్ కావాలని అప్పట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం డిమాండ్ మేరకు ఆక్సిజన్ ఇచ్చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, అవన్నీ తప్పుడు లెక్కలనీ.. కావాలనే ఎక్కువ అడుగుతున్నారని.. కేంద్రం వివరణ ఇచ్చినప్పటికీ సుప్రీం కోర్టు పరగణించలేదు. దీంతో ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం సరఫరా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ సమయంలో ఢిల్లీ సగటు వినియోగం 284 టన్నుల నుంచి 372 టన్నుల మధ్యే ఉందని.. ఆడిట్ కమిటీ మధ్యంతర నివేదిక చెబుతోంది.

ఇలా ఢిల్లీ అవసరానికి మించి ఆక్సిజన్ ను తీసుకోవడం, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను ఢిల్లీకే సరఫరా చేయాల్సిరావడంతో.. 12 ఇతర రాష్ట్రాలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయని ఆడిట్ కమిటీ సభ్యులు గుర్తించారు. ఢిల్లీ ప్రభుత్వం పోగుచేసి పెట్టుకున్న ఆక్సిజన్ ను అప్పడే ఇతర రాష్ట్రాలకు తరలిస్తే.. డెత్ రేట్ చాలావరకు తగ్గివుండేదనేది నిపుణుల అభిప్రాయం. మొత్తానికి కేజ్రీవాల్ కక్కుర్తి ఎందరో కొవిడ్ పేషెంట్ల మరణానికి కారణమైందన్నది కాదనలేని సత్యం. కానీ, కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం సుప్రిం కోర్టు నియమించిన ఆడిట్ కమిటీ లెక్కల్నే తప్పుబడుతోంది. అవి బీజేపీ లెక్కలంటూ అలవాటైన రీతిలో కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం మొదలుపెట్టింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 − three =

Back to top button