More

    భారత్-సింగపూర్ దేశాల మధ్య బంధాలను చెడగొట్టేలా కేజ్రీవాల్ వ్యాఖ్యలు

    సింగ‌పూర్ లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ నూత‌న స్ట్రెయిన్ ప‌ట్ల ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భార‌త్ లో కొవిడ్-19 థ‌ర్డ్ వేవ్ వ్యాప్తిలో సింగ‌పూర్ కొవిడ్ స్ట్రెయిన్ విరుచుకుప‌డ‌వ‌చ్చ‌ని ఆయన చెప్పుకొచ్చారు. సింగ‌పూర్ నుంచి విమాన రాక‌పోక‌ల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని, చిన్నారుల‌కు కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. సింగ‌పూర్ స్ట్రెయిన్ థ‌ర్డ్ వేవ్ రూపంలో భార‌త్ ను తాక‌వ‌చ్చ‌ని కేజ్రీవాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చిన్నారుల‌ను కాపాడుకునేందుకు మ‌నం వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేయాల‌ని ట్వీట్ చేశారు.

    అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ స్పందించింది. తమ దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. B.1.617.2 అనే ఈ వేరియంట్ అనేక కరోనా కేసుల్లో బయటపడిందని.. తాజాగా సింగపూర్ లో కూడా వెలుగు చూసిందని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియంట్ ను మొదట భారత్ లోనే గుర్తించారని.. ఇప్పుడు అనేక దేశాల్లో ఈ వేరియంట్ బయటపడుతోందని సింగపూర్ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. కేవలం తమ దేశంలో మాత్రమే పుట్టిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని కేజ్రీవాల్ కు బదులిచ్చారు.

    కేజ్రీవాల్ వ్యాఖ్యలను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్(ఎం.ఇ.ఏ.) తప్పుబట్టింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు భారత్ కు ఆపాదించకండని.. ఆయన మాట్లాడితే భారత్ మాట్లాడినట్లు కాదని తెలిపింది. ‘సింగపూర్ వేరియంట్’ అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కావని తేల్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు భారత్-సింగపూర్ దేశాల మధ్య ఉండే సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని ఎం.ఇ.ఏ. ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

    కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత్-సింగపూర్ కలిసి కరోనాపై పోరాటం చేస్తూ ఉన్నాయని.. ఎన్నో ఏళ్లుగా ఇరు దేశాల మధ్య మంచి అనుబంధం ఉందని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు భారత్ చేసిన వ్యాఖ్యలుగా భావించకూడదని జై శంకర్ అన్నారు. కేజ్రీవాల్ బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని అన్నారు.

    సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. రాజకీయ నాయకులు నిజాలు చెప్పాలని సూచించారు. ‘సింగపూర్ వేరియంట్’ అన్నది లేదని తేల్చి చెప్పారు.

    భారతదేశంలో కేసుల పెరుగుదలకు కారణమైన కరోనా కొత్త స్ట్రెయిన్ బి.1.617 తాజాగా సింగపూర్ లో వెలుగుచూసింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్‌కు బి.1.617 స్ట్రెయిన్ కారణమని పలు అధ్యయనాలు తెలుపగా.. ఇదే తరహా వైరస్ ఇప్పుడు సింగపూర్‌లో కేసుల పెరుగుదలకు కారణంగా మారింది. కరోనా కేసులు మళ్లీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. బి.1.617 స్ట్రెయిన్ పిల్లలపై అత్యధిక ప్రభావం చూపిస్తోందని సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యే కుంగ్ తెలిపారు.

    Trending Stories

    Related Stories