More

  ఆఫ్రికా దేశాలకు భారత ఆయుధాలు.. అగ్రదేశాలను వణికిస్తున్న ‘డిఫెన్స్ ఎక్స్‎పో’..!!

  భారత్ ఆయుధాల దిగుమతి నుంచి ఆయుధాల ఎగుమతుల దేశంగా మారుతోంది. అగ్రదేశాలను ఆయుధాల కోసం అభ్యర్థించే దశ నుంచి అవే అగ్ర దేశాలకు సైతం ఆయుధాలను ఎగుమతి చేసే దశకు చేరుకుంది. ఇప్పటికే పినాక లాంచర్ల నుంచి తేజస్ ఫైటర్ జెట్ల వరకు విదేశాలకు ఎగుమతి చేసే దశకు చేరుకున్న భారత్.. ఈ ఎగుమతులను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సంకల్పించింది. ఇందులో భాగంగా భారత్ ఐదురోజుల పాటు గుజరాత్‎లో రాజధాని గాంధీనగర్‎లో డిఫెన్స్ ఎక్స్‎పోను ప్రారంభించింది. ఈ ఎక్స్‎పోలో దేశంలోని డిఫెన్స్ కంపెనీలన్నీ పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. భారత్‎లో ఉన్న దాదాపు 1,340 డిఫెన్స్ కంపెనీలు ఈ ఎక్స్‎పోలో పాల్గొన్నాయి.

  ఈ ఎక్స్‎పోలో దాదాపు 75 దేశాల ప్రతినిధులు పాల్గొని భారత్‎తో రక్షణ రంగ ఉత్పత్తులపై చర్చలు జరపనున్నారు. పలు ఎంఓయూలు, ఒప్పందాలు, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం లాంటి వాటితో తాజాగా జరిగే డిఫెన్స్ ఎక్స్‎పో కీలకంగా మారనుంది. గత సంవత్సరంలో జరిగిన ఒప్పందాల కంటే తాజా ఒప్పందాలతో దాదాపు రెట్టింపు ఆదాయం వచ్చేలా చర్చలు జరపనున్నారు. ఎక్స్‎పో ప్రారంభోత్సవంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్, డెవలప్‌మెంట్‎తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి వేగంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారత్ అతిపెద్ద రక్షణ దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఈవెంట్‎లో ఎక్కువగా ఆఫ్రికా-ఇండియా డిఫెన్స్ డైలాగ్స్‎కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో 53 ఆఫ్రికన్ దేశాలతో పాటు ఇండియన్ ఓషన్ రీజియన్‎లోని 44 దేశాలతో ప్రత్యేకమైన కాంక్లేవ్‎లను నిర్వహించనున్నారు.

  ఇక ఆఫ్రికన్ దేశాలకు ఆయుధాల ఎగుమతి విషయంలో అమెరికా, రష్యాలు తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తాయి. ఆయా దేశాలకు ఆయుధాలు కావాల్సిన సమయంలో అందజేయకుండా వాటిని ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే ఆయా దేశాలతో భారత్ చర్చలు జరిపి సరైన సమయానికి అందజేస్తామని హామీ ఇస్తే భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీటన్నితో పాటు ఎక్స్‎పోలో మొట్టమొదటి సారిగా ఇన్వెస్ట్ ఫర్ డిఫెన్స్ అనే ఈవెంట్‎ను కూడా నిర్వహిస్తోంది. ఇందులో భారత రక్షణ రంగ తయారీలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది భారత్. దేశంలో డిఫెన్స్ కంపెనీలను స్థాపిస్తే ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాల వంటి వాటిని ఆయాకంపెనీలకు భారత్ తెలియజేస్తోంది. దీంతో భారత రక్షణ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి అవకాశమేర్పడుతుంది.

  ఇక ఈ ఈవెంట్ ముగిసే సరికి భారత డిఫెన్స్ రంగంలో లక్షా యాభై వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరపడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ రంగ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. పెట్టుబడిదారులతో భారత ప్రభుత్వం జరిపే చర్చలన్నీ సఫలమైతే భారత రక్షణ రంగ ఉత్పాదకత మరింత పెరగనుంది. వీటితో పాటు భారత డిఫెన్స్ కొనుగోళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

  ఇక ఈ ఎక్స్ పో విజయవంతమైతే భారత్ కు భారీగా విదేశీ మారకం చేకూరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్రహ్మోస్ నుంచి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ల దాకా భారత్ ఎగుమతుల్లో గత రికార్డులను కూడా బద్దలు కొట్టింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయుధ ఎగుమతుల్లో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గటంలేదు. వీటితో భారత్ ఆర్థికంగా ఎదగటమే కాకుండా రక్షణ రంగం కూడా బలోపేతం కానుంది. స్వదేశీయంగా తయారయ్యే రక్షణ ఉత్పత్తులు తక్కువ ధరకే భారత్‎కు లభిస్తాయి. దీంతో పాటు రక్షణ రంగాన్ని అగ్రదేశాలకు దీటుగా అభివృద్ది చేసి ప్రపంచంలో భారత్ కూడా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా భారత్‎కు కావాల్సిన ఆయుధాల కోసం అగ్రదేశాలను బ్రతిమిలాడే గడ్డు పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి సగర్వంగా తలెత్తుకుని జీవించే స్థాయికి భారత్ ఎదుగుతుంది.

  Trending Stories

  Related Stories