యుద్ధ మైదానంలో మోహరించిన మోదీ బలగం..! సంస్కరణల బాటలో సైన్యం..!!

0
743

ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది మన సైన్యం. విభిన్న క్యాడర్లలో 49,631మంది అధికారులు సహా సుమారు 13 లక్షలమంది సిబ్బంది మన రక్షణ బలగం. అధికారుల్లో ఎక్కువమంది సైనిక ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్‌లను కోరుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. శరవేగంగా మారుతున్న ప్రపంచంతోపాటే సైనిక రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడంతా వేగంగా ముగిసిపోయే మెరుపు యుద్ధాలు, పరిమిత కాలంపాటు కొనసాగే సాయుధ ఘర్షణలే ఉంటాయి తప్ప దీర్ఘకాలిక యుద్ధాలకు కాలం చెల్లింది.

స్వల్పకాలిక యుద్ధాల్లో కూడా కీలకపాత్ర సాంకేతిక నైపుణ్యానిదే. అమెరికా, చైనాలు ఇప్పటికే సాయుధమయ్యాయి. అమెరికన్ రిమోట్‌ కంట్రోల్‌ ఆయుధాలు, డ్రోన్‌ల ద్వారా లక్ష్యాలు ఛేదించడం, కృత్రిమ మేధతో పనిచేసే ఆయుధాల రూపకల్పనను యుద్ధమైదానంలో ప్రవేశపెట్టింది అమెరికా. పదాతి దళాల సంఖ్యను తగ్గిస్తోంది శ్వేతసౌధం. బ్రిటన్‌ తన సైన్యాన్ని 20 శాతం మేర తగ్గించుకుంటున్నట్టు  2012లో ప్రకటించింది.  రష్యా సైన్యం భారీ స్థాయిలో ఉన్న డివిజనల్‌ కార్యాలయాల సంఖ్యను కుదించింది.    

చైనా మూడేళ్లక్రితమే సైనిక సంస్కరణలు మొదలుపెట్టింది. త్రివిధ దళాల్లో మొత్తంగా ఉన్న 20 లక్షలమంది సంఖ్యను సగానికి తగ్గించటమే లక్ష్యమని చైనా సైనిక వ్యవహారాల పత్రిక ‘పీఎల్‌ఏ డైలీ’ 2020లో ప్రకటించింది.

పదాతి దళాల్లో 10 లక్షలమందిని… వైమానిక, నావికా దళాల్లోనూ గణనీయంగా సిబ్బందిని తగ్గించాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆదేశం. నిజానికి 1980 నుంచే ఈ విషయంలో చైనా నాయకత్వం శ్రద్ధ పెట్టింది. సైన్యాన్ని పరిమాణంలో కాకుండా గుణాత్మకంగా మిన్నగా ఉండేలా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు సాయుధ దళాల్లోని అన్ని విభాగాలనూ పర్యవేక్షించే సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌-సీఎంసీ 2021 జనవరిలో ప్రకటించింది.

మన దేశం కూడా ఆ దిశగా అడుగులేయడం ప్రారంభించింది. నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇందుకోసం రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీబీ షెకత్కార్‌ నేతృత్వంలో 12మందితో ఒక కమిటీని నియమించారు. సైన్యం, త్రివిధ దళాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించి పటిష్టపరచడానికి, నిర్వహణా వ్యయాన్ని కుదించడానికీ ఈ కమిటీ తగిన సిఫార్సులు చేసింది.

సాంకేతికత విస్తరించటం, రంగంలోకి ఎప్పటికప్పుడు కొత్త ఉపకరణాలు రావటం వల్ల అధిక సంఖ్యలో సైనిక సిబ్బంది ఉండాల్సిన అవసరం తగ్గిపోయింది. పైగా ఉన్న సిబ్బంది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను అందుకోవాల్సి రావడం అత్యవసరమైంది. ఉపగ్రహాలు అందించే డేటా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్లు, కృత్రిమ మేధ వినియోగం వంటివి పెరుగుతున్నాయి. సైబర్‌ సంగ్రామంలో మెరికల్ని తయారు చేస్తే తప్ప వర్తమాన యుద్ధాలను గెలవటం అసాధ్యం.

 మన రక్షణ రంగ వ్యయంలో సింహభాగం సిబ్బందికే ఖర్చవుతోంది. ఆయుధాలు, అత్యాధునిక ఉపకరణాల కొనుగోలుకు 20 శాతంమించి ఖర్చుచేయటం సాధ్యం కావడం లేదు. 2019లో త్రివిధ దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ అగ్ర రాజ్యాలన్నీ తమ దళాలను తగ్గించుకుని సాంకేతికతపై ఆధారపడుతుంటే మనం మాత్రం సైనిక దళాల సంఖ్యను విస్తరించాలనుకుంటున్నామని, ఇది సరికాదని తేల్చి చెప్పారు.

మన సైనిక దళాలు గత దశాబ్దకాలంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. డిజిటలైజేషన్‌ పెరిగింది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు సమర్ధవంతంగా వినియోగించగల విద్యావంతులైన యువకుల్ని తీసుకోవటం ప్రారంభించింది. దానికి తగినట్టుగా దళాల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయంలో అవసరం కన్నా అధిక సంఖ్యలో అధికారులు, సిబ్బంది ఉన్నారని… అక్కడ వృథాగా ఉన్నవారిని కార్యనిర్వహణ క్షేత్రాల్లోకి మార్చవలసిన అవసరం ఉందని నూతన సైనిక డాక్ట్రైన్ చెబుతోంది.

అలాగే బ్రిగేడియర్‌ ర్యాంకును పూర్తిగా రద్దు చేసి ఏకీకృత బ్రిగేడ్‌లు ఏర్పాటు చేయాలని, ఆ బ్రిగేడ్‌లకు మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారి నాయకత్వంవహించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇప్పుడున్న సాధారణ బ్రిగేడ్‌ వ్యవస్థలో మూడు బెటాలియన్లు ఉంటాయి. ఒక్కో బెటాలియన్‌లో 900 నుంచి 1,100మంది సిబ్బంది ఉంటారు. ఏకీకృత బ్రిగేడ్‌లో ఇలాంటి బెటాలియన్ల సంఖ్యను నాలుగు నుంచి అయిదుకు పెంచాలని పత్రం ప్రతిపాదించింది.

సరిహద్దుల్లో డివిజన్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఈ ఏకీకృత బ్రిగేడ్‌లు నేరుగా సైనిక దళ ప్రధాన కార్యాలయానికి జవాబుదారీగా ఉండేలా రూపొందించాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఒక సైనిక దళ ప్రధాన కార్యాలయం కింద మూడు డివిజన్‌లు, ఒక్కో డివిజన్‌ కింద మూడు బ్రిగేడ్‌లు ఉంటున్నాయి.

దేశం ఏదైనా సరే…ముందు శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తూనే, యుద్ధం వచ్చే పక్షంలో సమర్థవంతంగా తలపడేందుకు వీలుగా సైన్యాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. యుద్ధాన్ని చాలాసార్లు శత్రువే నిర్ణయిస్తాడు. శాంతి అంటే రెండు యుద్ధాల మధ్య ఏర్పడే అయోమయ వాతావరణమే అంటాడు చాణక్యుడు.

పరస్పర ఏకీభావాలతో సంబంధం లేకుండా సైనిక వ్యూహాన్నిరచించాలి.  వర్త మానానికి అనువైన స్మార్ట్‌ ఆర్మీని రూపొందించుకోవాలి. సిబ్బందికి పెనుభారంగా ఉండే కాలం చెల్లిన పరికరాల వినియోగానికి స్వస్తి పలికి చేతుల్లో అమరే, సులభంగా ఎక్కడికైనా మోసు కుపోగలిగే ఉపకరణాలను పెంచుకోవాలి.

స్వీయ బలిమి ఎంత ఉన్నా… శత్రువును ఏ దశలోనూ తక్కువగా అంచనా వేయకూడదన్నది యుద్ధనీతిలో ప్రాథమిక సూత్రం. కనురెప్పపాటు కాలంలో లక్ష్యాలపై గురిపెట్టి ఆధునిక అస్త్ర ప్రయోగాలకు దేశదేశాలు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎవరికైనా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని పోరాడే, క్షణాల్లో నిర్ణయాలు తీసుకోగల సుదృఢ రక్షణ వ్యవస్థ ప్రాణావసరం. ఈ దృష్టితోనే త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం.

సైన్యం, వైమానిక, నౌకా దళాలమధ్య మెరుగైన సమన్వయం సాధించడానికి ఉద్దేశించిన కీలక పదవి తాలూకు విధి నిషేధాలపై అజిత్‌ దోవల్‌ కమిటీ నివేదిక చేతికందిన దరిమిలా- కేంద్ర మంత్రివర్గం తాజాగా పచ్చజెండా ఊపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణమంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్న మహాదళపతి కొలువు తీరాల్సిన ఆవశ్యకతను రెండు దశాబ్దాలక్రితం సుబ్రహ్మణ్యం కమిటీ ప్రస్తావించింది. లాల్‌కృష్ణ అద్వాణీ నేతృత్వంలోని మంత్రుల బృందం జాతీయ భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల విశ్లేషణలో భాగంగా సీడీఎస్‌ అవతరణకు మద్దతు పలికింది. షెకాత్కర్‌ కమిటీ సిఫారసు చేసింది.  

రక్షణ మంత్రిగా మనోహర్‌ పారికర్‌ చొరవతో చేసిన ప్రతిపాదనకు మోదీ ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం ఎన్నో విధాలా శ్రేయస్కరం. మానవ వనరుల గరిష్ఠ వినియోగానికి, త్రివిధ దళాల నడుమ అర్థవంతమైన సంతులనానికి దోహదకారి కానుంది. మొదటి మహాదళపతి నియామకం, డీబీ షెకాత్కర్‌ మాటల్లో- ‘నలుగురు లెఫ్టి నెంట్‌ జనరళ్లు, ఇద్దరు ఎయిర్‌ మార్షల్స్, ఇద్దరు వైస్‌ అడ్మిరళ్లు, ఎందరో బ్యురాక్రాట్ల తెరవెనక అవిరళ కృషి’కి….తాజా సంస్కరణలు ఫలశ్రుతి!

యాభై అయిదు భిన్నాంశాల ప్రాతిపదికన 130కి పైగా ఆధునిక సైనిక దళాల పాటవాన్ని మదింపు వేసి జీఎఫ్‌పీఐ -గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ ఏటా ర్యాంకులు ప్రసాదిస్తుంటుంది.ఇందులో 2020లో అమెరికా, రష్యా, చైనాల తరవాత నిలిచిన భారత్- ఫ్రాన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియాలకన్నా మెరుగనిపించుకుంది. దళాలవారీగా బలసంపన్నతను లెక్కకట్టి, మనపైకి కాలుదువ్వుతున్న దేశాలకన్నా పైమెట్టు మీద ఉన్నామని సంతృప్తి పరిచింది.  

బంగ్లాదేశ్‌ విమోచనలో భారత నౌకదళ, వాయుసేన అధిపతుల సన్నిహితబంధం దేశానికి సాటిలేని విజయం సంపాదించి పెట్టింది. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ మధ్య సమన్వయ రాహిత్యం, త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపించే నాయకత్వ చొరవ కొరవడటం- కార్గిల్‌ పోరులో భారత్‌కు తల బొప్పి కట్టించింది.

దళాల మధ్య సమన్వయం ఎంత మహత్తర పాత్ర పోషించగలదో దాదాపు అయిదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ఘట్టం విశదీకరిస్తుంది. అప్పట్లో కేవలం పన్నెండువేల మందితో కూడిన బాబర్‌ దళం, లక్షమంది సైనికులు కలిగిన ఇబ్రహీం లోడీ సేనను మట్టి కరిపించింది!

యుద్ధ సన్నద్ధతకు, లేక పోవడానికి ఎంత అంతరముందో ఆకళించుకున్న అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ సహా డెబ్భైవరకు దేశాలు సీడీఎస్‌ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశాయి.  వర్తమాన, భావి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాల్సిన భారత్‌- సైనిక బలగాల ఆధునికీకరణకు, దళాల గరిష్ఠ సద్వినియోగానికి విస్తృత ప్రాతిపదికన మార్పులు, చేర్పులు, సంస్కరణలు ఎన్నో చేపట్టాల్సి ఉంది. భిన్న దళాల అవసరాలు, సామర్థ్యాలు, పరిమితులు…వంటి కీలక ప్రక్రియను ఒక కొలిక్కి తేవాల్సిన దశలో- సీడీఎస్‌ నియామకం అత్యంత కీలకంగా మారింది.

పొరుగున ఉన్న చైనా మూడేళ్లుగా సంస్థాగత సంస్కరణలు, సైనిక ఆధునికీకరణ వ్యూహాల్ని పట్టాలకు ఎక్కించి తన కమాండ్‌ వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రక్షాళణ చేసింది. రష్యానుంచి సుఖోయ్‌ ఎస్‌యు-35 యుద్ధ విమానాలను, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకుంది. భూ, సముద్ర, గగనతలాల్లో నిపుణ పోరాటశక్తిగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. మన యుద్ధ సామగ్రిలో 68శాతం కాలం చెల్లినవనీ, 24శాతం ప్రస్తుతానికి నడుస్తాయని, కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఆధునికమైనవి.

త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపించాల్సిన సీడీఎస్‌ ఆధునికీకరణ, శిక్షణ, ఉమ్మడి నిఘా, సంయుక్త దాడులు… సమన్వయమే నేటి సవాల్! ప్రస్తుతం ఆర్మీలో ఏడు, వైమానిక దళంలో ఏడు, నేవీలో మూడు- మొత్తం పదిహేడు సింగిల్‌ సర్వీస్‌ కమాండ్లు ఉన్నాయి.  ఈ దళాలను శత్రుభీకరంగా మలచి మెరుపు వేగంతో విరుచుకుపడేలా కదం తొక్కించే పటిష్ఠ నిర్ణయం కోసం బలగాలు ఎదురుచూస్తున్నాయి.  

 సాధన సంపత్తి కొనుగోళ్లలో త్రివిధ దళాల ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించి, వెచ్చించే ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా చూడాలి. రవాణా, శిక్షణ, కమ్యూనికేషన్లు, నియామకాల్లో వృథాను నివారించి, మూకుమ్మడి తత్వాన్ని తేవాలి.

దీంతో సైనిక బలగాల సామర్థ్యం పెరుగుతుంది. సైన్యం ఎదుర్కొంటున్న యాభై రకాల సమస్యల్ని 2019లో ‘ఆర్మీ డిజైన్‌ బ్యూరో’ నివేదికలో స్పష్టం చేసింది. సీడీఎస్‌ ఏర్పాటు వల్ల- త్రివిధ దళాల్ని శత్రు దుర్భేద్యం చేసేలా మరిన్ని లోతైన సంస్కరణలకు బాటలు పడతాయి!

రెండేళ్ల క్రితం సీడీఎస్‌ పదవి  ఏర్పాటు ప్రకటనతో దేశీయంగా థియేటర్‌ కమాండ్ల ప్రక్రియ ఊపిరి పోసుకొంది. సమష్టితత్వం ఇనుమడించేలా త్రివిధ దళాలను సమ్మిళితం చేసి మూడేళ్లలో థియేటర్‌ కమాండ్లను రూపుదిద్దే గురుతర బాధ్యతను సీడీఎస్‌కు అప్పగించారు. 2020 జూన్‌ నాటికే తొలి కమాండ్‌ ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా జాప్యం జరిగింది.

గగనతల రక్షణ, మారిటైమ్‌ థియేటర్‌ కమాండ్ల ఏర్పాటు దాదాపు ఖాయమైనా- భౌగోళిక సరిహద్దుల ఆధారంగా ఎన్ని కమాండ్లను నెలకొల్పుతారనే అంశంపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వాయుసేన, సైన్యం, నావికాదళాల దగ్గర అవసరాలకు తగినట్లు వేర్వేరు గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. త్రివిధ దళాలను కలిపి ఏర్పాటు చేయబోయే థియేటర్‌ కమాండ్లకు వీటిని కేటాయించాల్సి ఉంటుంది.

ఈ కమాండ్లలో గగనతల రక్షణ విభాగాలు ఉంటాయి. వీటికి అదనంగా ‘గగనతల రక్షణ కమాండ్‌’ ఉంటుంది. దేశవ్యాప్త గగనతల రక్షణ వ్యవస్థకు ఇది బాధ్యత వహిస్తుంది. థియేటర్‌ కమాండ్ల అవసరాలకు కేటాయింపులు పోను త్రివిధ దళాల నుంచి సమీకరించే వనరుల్లో అత్యధికం ఇక్కడే ఉంటాయి.

గగనతల రక్షణ కమాండ్‌కు, మిగిలిన థియేటర్‌ కమాండ్లకు వేర్వేరుగా కేటాయించే స్థాయిలో వనరులు లేవని వాయుసేన వాదిస్తోంది. 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్న యుద్ధవిమానాల కేటాయింపుపైనా పెదవి విరుస్తోంది. వనరుల కొరతతో కదనరంగంలో ఆత్మరక్షణ వైఖరి అవలంబించాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చని వాయుసేన మాజీలు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం వాయుసేనకు ఉన్న ఏడు కమాండ్లకు సాయుధ సంపత్తిని కేటాయించి, అవసరాలకు తగినట్లు వాడుకొంటున్నప్పుడు లేని అభ్యంతరం- వాటి స్థానంలో థియేటర్‌ కమాండ్లకు కేటాయింపులు జరిపితే ఎందుకని సీడీఎస్‌ బిపిన్ రావత్‌ వాదిస్తున్నారు. వనరులను, నిధులను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా సైనిక సంస్కరణలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే థియేటర్ల కమాండ్ల అవసరాలు పూర్తిగా తీరాలంటే అదనంగా కొనుగోళ్లు చేపట్టాల్సి రావచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాలు సైనిక సంస్కరణలను అమలు చేశాయి. అమెరికా సహా చాలా దేశాల్లో ఈ సంస్కరణలు పట్టాలెక్కే సమయంలో దళాల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకొన్నాయి. భౌగోళిక సరిహద్దులకు సంబంధించి పొరుగు దేశాలతో భారత్‌కు వివాదాలు ఉన్నాయి. వీటికి ఉగ్రవాదం జత కలవడం వల్ల సహజంగానే దేశీయంగా పదాతి దళానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది.

దీంతో తమది సహాయ దళంగా మిగులుతుందనే భయం వాయుసేనలో ఉండటం సహజం.  సీడీఎస్‌ తాజా వ్యాఖ్యలు వారి భయాలను పెంచాయి. వాస్తవానికి ఆధునిక యుద్ధ తంత్రాల్లో వాయుసేన అత్యంత కీలకమైనది! అందుకే చైనాతో సహా చాలా దేశాలు పదాతి దళాల సంఖ్యను కుదించుకొంటున్నాయి. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో వాయుసేనను బలోపేతం చేసుకొంటున్నాయి.

ఇరాక్‌ నుంచి ఆఫ్ఘనిస్థాన్ వరకు అమెరికా చేసిన యుద్ధాలను చూస్తే తొలుత వాయుసేన, క్షిపణి దళాల ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి. శత్రువులను కకావికలం చేసి అవి సాధించిన విజయాలను సంరక్షించే బాధ్యతలను పదాతి దళాలు స్వీకరించాయి. రక్షణరంగ సంస్కరణలను వేగవంతం చేసిన కేంద్రం ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే Non contact warfare-NCW ను సైన్యంలో ప్రవేశపెట్టాలని రక్షణశాఖ భావిస్తోంది. మహాదళపతి జనరల్‌ బిపిన రావత్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ Non contact warfare-NCWపై  దృష్టి సారించింది. ప్రధాని మోదీ ఆదేశాల అమలుకు అవసరమైన రోడ్‌మ్యా్‌పను రూపొందించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ లోని సభ్యులు అక్టోబర్ మొదటివారంలో సమావేశం కానున్నారు.

ఇందుకు సంబంధించిన సమాచారం మరో కథనంలో చూద్దాం..

Leave A Reply

Please enter your comment!
Please enter your name here