Right Angle

కరోనా రాబందులు..! ‘విస్టా’ తోడేళ్లు..!! భారీ కుట్ర వెనుక కీలక రహస్యం..!!!

గడచిన ఏడేళ్లుగా భారత రాజకీయాల్లో సైద్ధాంతిక ఘర్షణ తీవ్రమైంది. అందుకు ప్రధాన కారణం రెండు జాతీయ పార్టీల సైద్ధాంతిక ప్రమాణాలు పరస్పరం అభిముఖంగా తలపడటం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ-ఈ రెంటి విశ్వాస మూలాలు వేరువేరు. భిన్నమైన చింతనాజగత్తులో ఆవిర్భవించాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఒకటి ఏ.ఓ.హ్యూమ్ అనబడే బ్రిటీష్ క్రైస్తవ అధికారి బుద్ధిజనితం కారణంగా రాజకీయాల్లోకి వచ్చింది. రెండోది: దేశీయ తాత్వికత, ధార్మిక తాదాత్మ్యం, రాజకీయ, భౌగోళిక సమగ్రత ఈ మూడింటి మేలుకలయికగా రూపొందిన జాతీయత ఇరుసుగా ఏర్పడింది. మొదటిది కాంగ్రెస్-రెండోది బీజేపీ. బీజేపీకి పూర్వ రూపం భారతీయ జనసంఘం.

ఏ అంశంలో అయినా, ఏ విధాన నిర్ణయంలో అయినా ఈ రెండు పార్టీల ప్రామాణిక దృష్టి భిన్నం. అందుకే వాక్సిన్ డ్రైవ్ మొదలు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వరకూ, నోట్ల రద్దు మొదలు న్యాయమూర్తుల నియామకం వరకూ ప్రతిచోట బాహాబాహీకి సిద్ధంగా ఉంటాయి ఈ రెండు పార్టీలు. ఈ విషయం మనకు సరిగ్గా అర్థమవుతే చాలా వాస్తవాలు తేటతెల్లంగా కనిపిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ సెంట్రల్ విస్టా మొదటి దశ పనులకు అంకురార్పరణ చేయగానే కోవిడ్ వాక్సిన్ అందుబాటులో లేనప్పుడు, విస్టా ప్రాజెక్ట్ అవసరమా అనే వాదన రావడం, బుల్లెట్ రైలు ఊసెత్తగానే సేద్యంపై ప్రేమపుట్టుకు రావడం, సంస్కరణల వేగం పెంచితే మోదీ మొత్తం అమ్మేసి గోదాట్లో ముంచుతారనడం విడ్డూరంగా కనిపించే వాదనలు. బోడిగుండుకీ మోకాలికీ ముడివేయడం, పిడుక్కీ బియ్యానికీ ఒకే ఆయుధాన్ని వాడటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. రెండు వేరు వేరు అంశాలను పోటీ పెట్టి చూడటం అన్ని సందర్భాల్లో సముచితం కాదు. కోవిడ్ మహమ్మారి అనేది ఆగంతుకంగా వచ్చిపడిన శతృవు. దానికి మానవ జాతి చెల్లించాల్సిన మూల్యం చెల్లిస్తూనే ఉంది. మరోవైపు కోలుకునేందుకు యాతన పడుతోంది. ప్రధాని మోదీ వద్ద అల్లా ఉద్దీన్ అద్భుత దీపమేది లేదు, క్షణాల్లో మటుమాయం చేసేందుకు.

నిర్ణయాల్లో సందర్భోచిత మార్పులు చేయడం, క్షణక్షణమూ నిర్ణయాలు మార్చడం రెండూ ఒకటి కాదు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ రూపకల్పన-ప్రణాళిక ఎప్పుడో జరిగిపోయాయి. ఈ మధ్యలో ప్రవేశించింది చైనా వైరస్. న్యూ విస్టా ప్రాజెక్ట్ ను ప్రతిపక్షాలు నిక్కచ్చిగా ప్రశ్నించవచ్చు. నిధుల అందుబాటుకు సంబంధించిన వివరాలూ అడగవచ్చు. ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించవచ్చు. అయితే రెండు వేరు వేరు అంశాలను ఒకేగాటన కట్టి విమర్శించడం తగదు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రాణావసరం. న్యూ విస్టా ప్రాజెక్ట్ ఉద్దేశం- వలస వాద చిహ్నాలకు చరమగీతం పాడి దేశీయమైన సాంస్కృతిక గతాన్ని ప్రతిబింబించే ప్రతిరూపాలను ప్రతిష్ఠించడం. బ్రిటీష్ వలస వాదం నుంచి ఈ దేశం విముక్తి సాధించి ఏడు దశాబ్దాల కాలం గడిచిపోయింది. ఇంకా ముస్లీం దాడుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిహ్నాలను, తెల్లదొరల గుర్తులనే ఈ దేశానికి చిరునామాగా ఉండనిద్దామా? దేశ రాజధాని ఢిల్లీ అనగానే షాజహా చక్రవర్తికి మూడోభార్య మృతివల్ల కలిగిన విచారంలో పుట్టిన ప్రేమకు చిహ్నంగా తాజ్ మహాల్ నిర్మించాడు. పధ్నాలుగో సంతానానికి జన్మనిచ్చి లోకం నుంచి నిష్క్రమించింది పాపం షాజహాన్. భార్యపై ప్రేమను ప్రకటించేందుకు ప్రజాధనాన్ని వృధాచేసిన చక్రవర్తి అర్థరహిత ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్ మహాల్ ఈ దేశ రాజధాని నగరానికి చిహ్నంగా ఉంటుందా? ఉండాలా? Edward Lutyens, Herbert Baker,Sir William Emerson లు రూపొందించిన నిర్మాణాలే ఇంకా మన ప్రతిబింబాలా? ఔరంగాబాద్ అనగానే నిరంకుశ ఆలంగిర్ పేరు, తన భార్యకోసం కట్టించిన సమాధి ‘‘బీబీకా మక్ బరా’’ గర్తుకు రావడం అర్థ రహితం కాదా? మెదక్ అనగానే చర్చి గుర్తుకురావడం, హైదరాబాద్ అనగానే మదిలో చార్మినార్ రూపుగట్టడం, ముంబై అనగానే గేట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీలో ఇండియాగేట్, కలకత్తా అనగానే విక్టోరియా మెమోరియల్ – వెయ్యేళ్ల వలసవాదం భారతీయ ఆత్మను ప్రతిబించించే చిహ్నలను మాయం చేసింది.

ఎనమిది వందల ఏళ్ల ముస్లీం దండయాత్రల్లో భారతీయ సాంస్కృతిక, ధార్మిక విశ్వాసాలను ప్రతిబించించే ఆలయాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు అపారమైన భక్తితో పూజించిన దేవతా మూర్తుల విగ్రహాలు భిన్నం చేయబడ్డాయి. రెండు శతాబ్దాల రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నెత్తురు అంటకుండా ధార్మిక విశ్వాసాలను మార్చేసింది. విద్యా, వైద్యం, విలువలు, విశ్వాసాల్లోకి మతాన్ని జొప్పించింది. అందుకు సమ్మతిని సృష్టించుకుంది. బ్రిటీష్ వలసవాదం మనకు తెలియకుండానే మన మూలాలను పెకలించింది. ఆధునికత, నాగరికత పేరిట విస్మృత లోకంలోకి ప్రవేశపెట్టింది. ఈ కారణంగానే తెలుగు సాహిత్య మేరువు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే ఒప్పుకోలేదు. స్వాతంత్ర్యం రావడం అన్నది సాంకేతికంగా, భౌగోళికంగా నిజమే అయినప్పటికీ; వందల ఏళ్లపాటు సాగిన విదేశీ దురాక్రమణల కారణంగా భారతదేశం తన ఆత్మను కోల్పోయింది. అన్ని రంగాల్లో తనదికాని తాత్వికత జీర్ణించుకున్న తర్వాత స్వాతంత్య్రం వచ్చినా ప్రయోజనం లేదన్నారు విశ్వనాథవారు.

ఓ చిత్రమైన ఉదంతం చెప్పి న్యూవిస్టా ప్రాజెక్ట్ విషయంలోకి వెళతాను.

ప్రచ్ఛన్నయుద్ధకాలంలో కేరళలోని కొట్టాయం జిల్లాలో ఓ ఊరిపేరును కమ్యూనిస్టులు సోవియట్ రష్యాపై తమకున్న ప్రేమను ప్రకటించడం కోసం ‘మాస్కో’గా మార్చేశారు. రష్యాలోని ఓ నగరం పేరును భారతదేశంలోని గ్రామానికి తగిలించడమేంటి? అనే ప్రశ్న ఎవరికీ రాలేదు. భారీ సిద్ధాంతాల గురించి మాట్లాడే కమ్యూనిస్టులకు భౌగోళిక పరిధి ఉంటుందనే ఇంగితం ఎందుకు రాలేదు? ఈ దేశంలోని ప్రజలకు ఓ గతం ఉంటుంది, విశ్వాసాలూ, ధార్మిక అంశ ఉంటుంది-వాటిని అనుసరించి కదా ఊరి పేరుపెట్టాలి అనే ప్రశ్నకూడా ఎవరూ వేయలేదు. రాజకీయ సిద్ధాంతాలపై ప్రేమను వెల్లడించేందుకు గ్రామాల పేర్లు మార్చాలన్న మూర్ఖత్వాన్ని ఎవరూ సవాలు చేయరు. న్యూ విస్టా ప్రాజెక్ట్ అనే సరికి భారత దేశ ఆర్థిక స్థితి, ప్రజల ప్రాణాలూ, ప్రజాస్వామ్యం, వాక్సిన్ డ్రైవ్ అన్నీ గుర్తుకు వస్తాయి. న్యూ విస్టా ప్రాజెక్ట్ ను ఎందుకు రాజకీయ చర్చలోకి లాగుతున్నారు?

దీని వెనుక ఏముంది? ప్రతిపక్షాలూ-వారికి దన్నుగా ఉన్న వామపక్ష-సెక్యూలర్ మేధో వర్గాల ఉద్దేశాలేంటి? ప్రధాని నరేంద్ర మోదీని నియంతగా చిత్రించే ‘నేరేటివ్’ అసలు ఉద్దేశమేంటి? మోదీ ప్రభుత్వం నిజంగానే అవసరమైన రంగాలకు కేటాయించాల్సిన నిధులను ‘విస్టా’ ప్రాజెక్టుకు మళ్లిస్తోందా? ఈ విషయాలు తెలుసుకునేందుకు నేను బెల్జియం మేధావి, హిందూత్వంపై అపారమైన కృషి చేసిన కొయిన్రాడ్ ఎల్ట్స్ రాసిన ‘‘Decolonizing the Hindu Mind’’ Ideological Development of Hindu Revivalism పుస్తకం, FROM THE COVER OF “NEGATIONISM ININDIA – CONCEALING THE RECORD OF ISLAM” వ్యాసాలను ఆధారం చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. నేగేషనిజం అనేది ఒక అంశాన్ని పెద్దగా చేసి చూపడం కోసం మరో అంశాన్ని ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్యం చేయడంగా చెప్పుకోవచ్చు. గడచిన ఏడేళ్లుగా భారత దేశంలోని సూడో సెక్యూలర్ లెఫ్ట్ మేధావుల వాదనల ప్రాణరహస్యం ‘నెగేషనిజం’ అనే వాదనలో ఉంది. హిట్లర్ నియంతను చేయడానికి భారతదేశంలో ముస్లీం దండయాత్రల వల్ల సాగిన దారుణ హింసను చిన్నది చేసిన చూపడం, అయోధ్య రామమందిర అంశం తెరపైకి రాగానే గోద్రా అల్లర్ల ఊసెత్తడం, బాబ్రీ అంశం లేవనెత్తగానే లౌకికవాదాన్ని తెరపైకి తేవడం ‘నెగేషనిజం’ మౌలిక సిద్ధాంతం.

భారతదేశ చరిత్రలో ముస్లీం దండయాత్రలూ, బ్రిటీష్ వలసవాదాన్ని పూర్తి అర్థం చేసుకుంటే తప్ప ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చేస్తున్న మార్పులు అర్థం కావు. ఇది మొదటి షరతు. రెండోది: గడచిన ఏడాది కాలంగా జరుగుతున్న మరో ప్రయత్నం ఏంటంటే…బలశాలిగా ఉన్న రాజకీయ ప్రత్యర్థిని భూతంగా ప్రచారం చేయడం. నియంత విగ్రహాన్ని నెలకొల్పడం. స్వపక్షంలో మల్లయుద్ధ బరిలోకి వెళ్లగల ధీశాలి లేనప్పుడు వైరిపక్షంలోని మల్లయోధుడిపై దుమ్మెత్తిపోయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇదే నియమాన్ని అనుసరిస్తోంది. రాహుల్ గాంధీ రవ్వంత ప్రభావాన్ని వేయలేని వాస్తవాన్ని కప్పిపుచ్చాలంటే మోదీని నియంతగా అయినా నిలపాలి అనే ‘నేగేషనిజం’. కరోనా రాబందులూ-విస్టా తోడేళ్ల సైద్ధాంతిక పునాది ఇదే!

ముస్లీం దండయాత్రలూ, బ్రిటీష్ వలసవాదం కేవలం సంపద లూఠీ, అధికార లాలస కోసం మాత్రమే భారత్ లోకి ప్రవేశించలేదు. ఒక సుదీర్ఘమైన, ప్రణాళిక బద్ధమైన సాంస్కృతిక దాడి చేశాయి. సూఫీ తత్వం పేరుతో ఇస్లాం విస్తరణను యూనానీ వైద్యం ఆధారంగా చేపట్టారు ముస్లీం మతగురువులు. ఆల్లోపతి వైద్యం పేరుతో క్రైస్తవాన్ని విస్తరించింది ఈస్ట ఇండియా కంపెనీ. 16,17 శతాబ్దాల చివరినాటికి భారతదేశంలోని లోతట్టు అటవీ ప్రాంతాలకు చేరాయి క్రైస్తవ మిషనరీలు. విద్యను, వైద్యాన్ని ఎరగా వేసి విశ్వాసాలను మార్చాయి. గిరిజన యోధుడు బిర్సాముండా క్రైస్తవ మిషరీల్లో చదువుకుని చివరకు మతాన్ని మార్చుకున్నారు. కొమురం భీం చదువుకున్నది క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లోనే. వారి త్యాగాన్నీ, వీరత్వాన్నీ తక్కువ చేయడం కాదు, ఆనాటికే మిషనరీలు అడవుల్లోకి ప్రవేశించాయని చెప్పడానికే ఈ ఉదాహరణ.
దేశ రాజధాని ఢిల్లీలోని కట్టడాలన్నీ ముస్లీం, బ్రిటీష్ ఏలికల కాలంలో రూపుదిద్దుకున్నవి. స్వాతంత్ర్యం వచ్చేనాటికి వాటిలో చాలా భాగం శిథిలావస్థలో ఉన్నాయి. వాటన్నిటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాల్సిన నాటి ప్రభుత్వం తాత్సారం చేసింది. వలస చిహ్నాలుగా ఉన్న పాత నిర్మాణాలను గర్వకారణమని ప్రచారం చేసింది.

జీర్ణావస్థకు చేరుకున్న ప్రాచీన ఆలయాలను విస్మరించిన నాటి ప్రభుత్వం అన్యవర్గాల మత చిహ్నాల విషయంలో అనేక జాగ్రత్తలు పాటించింది. ఎడ్వర్డ్ లూటియెన్స్ దేశం విడిచి, లోకం విడిచి వెళ్లినా ఆయన విశ్వాసాలకు వారసులు మిగిలిపోవడం వల్ల సైద్ధాంతిక రంగంలో లూటియెన్స్ అంశ కొనసాగుతూ వచ్చింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పై స్టే ఇవ్వాలన్న అభ్యర్థన వెనుక శతాబ్దాల సైద్ధాంతిక బానిస మనస్తత్వం ఉంది. ఢిల్లీ హైకోర్టులో సీవీపీపై వేసిన పిటిషన్ లో అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు పిటిషన్ దారు. “Auschwitz” అంటే జర్మనీలో హిట్లర్ యూదు సంహారం కోసం నిర్మించిన కాన్సన్ ట్రేషన్ క్యాంపులకు వాడిన పరిభాషను సీవీపీలో పనిచేసే కార్మికుల ఆవాసాలకు ఆపాదించారంటే ఉద్దేశాలు చాలా సులభంగా అర్థమవుతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

12 − 1 =

Back to top button