ఎప్పటిలాగే అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని ఎంతో మంది భక్తులు భావిస్తూ ఉన్నారు. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర ఉంటుందా..? లేదా అనే విషయమై కూడా సందేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వార్షిక అమర్‌నాథ్ తీర్థయాత్రపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం నాడు చెప్పుకొచ్చారు. అమర్‌నాథ్ యాత్ర నిర్వహణపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనోజ్ సిన్హా తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే దాని ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో యాత్రపై సందిగ్ధం నెలకొంది. కరోనా మహమ్మారిని పరిగణలోకి తీసుకొని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పుకొచ్చారు. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి, భద్రతా పరిస్థితులపై కేంద్ర మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర ప్రభుత్వ ఉన్నత భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులు, జమ్మూ పరిపాలన హాజరైంది. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులు, భద్రతా చర్యలు.. పాక్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట పరిస్థితులపై ఉన్నతాధికారులకు కేంద్రమంత్రికి వివరించారు.
సముద్రమట్టానికి 3,880 మీటర్ల ఎత్తున, హిమాలయాల్లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు అమర్ నాథ్ యాత్ర కోసం ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 28న పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో ప్రారంభమై ఆగస్టు 22తో ముగియనుంది. ప్రజల ప్రాణాలను కాపాడటం మరింత అవసరమని నేను ఇప్పటికే చెప్పాను.. కోవిడ్ మహమ్మారిని పరిగణనలోకి తీసుకుంటే, మేము త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మనోజ్ సిన్హా వెల్లడించారు.