More

    ‘మహాత్ముడి’ చేత.. ‘మహాత్ముడి’గా కీర్తింపబడిన మాలవ్య

    ‘మహాత్ముడు’ అంటే.. చాలామందికి గాంధీజీ మాత్రమే గుర్తుకొస్తారు. కానీ, స్వయంగా గాంధీజీనే.. ‘మహామాన’ అని కీర్తించిన ఓ మహనీయుడి గురించి చాలామందికి తెలియదు. ఆయనే పండిట్ మదన్ మోహన్ మాలవ్య. అనంతర కాలంలో ఆయన గాంధీజీతో సహా ‘మహాత్ముడు’గా కూడా సంబోధించబడ్డారు. సనాతన విద్యను భావితరాలకు అందించాలన్న తపనతో.. 1915లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన మహనీయుడు. నేడు మనం గంగా ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, వందేళ్ల క్రితమే గంగానది పరిక్షణ కోసం ఉద్యమించిన దార్శనికుడు మాలవ్య.

    డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్‎పాయి జయంతి మాత్రమే కాదు.. మదన్ మోహన్ మాలవ్య జయంతి కూడా. 1861, డిసెంబర్ 25 తేదీన ప్రయాగరాజ్‎లో మూనాదేవి, బ్రిజ్‌నాథ్ దంపతులకు జన్మించారు మదన్ మోహన్ మాలవ్య. ఆయన పూర్వీకులు మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం నుండి వలస వచ్చారట. అందుకే ఆయన ఇంటి పేరు కూడా మాలవ్యగా సార్థకమైంది. నిజానికి, ఆయన అసలు ఇంటి పేరు చతుర్వేది. మాలవ్యాలు బెనారస్‎లోని అగర్వాల్ వర్తకులకు ఇంటి పురోహితులుగా ఉన్నారు. ఆయన తండ్రి సంస్కృత గ్రంథాలను అభ్యసించేవాడు. శ్రీమద్బాగవతాన్ని బోధించేవాడు.

    మాలవ్య సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. పాఠశాల రోజుల నుండే మకరంద్ అనే కలంపేరుతో కవిత్వం రాయడం ప్రారంభించారు మాలవ్య. 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాద్ విశ్వ విద్యాలయంగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీఏలో పట్టభద్రులయ్యారు మాలవ్య. గ్రాడ్యుయేషన్ పూర్తిగానే.. ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అంతకు ముందే ఆయన ‘ది ఇండియన్ ఒపీనియన్’ అనే పత్రికకు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు.

    1907లో మాలవ్య స్వయంగా ‘అభ్యుదయ’ అనే వార్తాపత్రిక ప్రారంభించారు. తర్వాత ‘లీడర్’ పేరుతో ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. అటు తర్వాత నష్టాల్లో ఉన్న హిందుస్తాన్ టైమ్స్ పత్రికను కూడా తీసుకొని నడిపారు. అయితే చాల కొద్ది కాలం మాత్రమే ఆయన దానికి ఛైర్మన్‌గా ఉన్నారు. 1908లో బ్రిటీష్ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా అలహాబాద్‌‌లో అఖిల భారత కాన్ఫరెన్స్‎ను నిర్వహించారు మాలవ్య.

    బ్రిటీష్ నియంతల రాజ్యానికి ఊతమిచ్చేందుకు ప్రారంభించిన సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన నేతల్లో మాలవ్య ఒకరు. సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమర యోధులతో కలిసి ఉద్యమించారు.

    1915లో మాలవ్య కాశీలో గంగానదీ తీరాన హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అదే నేటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. మాలవ్య విస్తృత కార్యదక్షతకు ఇది తార్కాణమని చెప్పవచ్చు. చేతిలో చిల్లిగవ్వ లేని ఒక సాధారణ వ్యక్తి కేవలం తన తపోశక్తి త్యాగశీలతలో, ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నిర్మించగలిగారు. వేలాది మంది యువకులైన విద్యార్థులలో జూతీయ భావాలు నాటుకునేలా చేశారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వ విద్యాలయం. ప్రపంచంలోనే పెద్ద విశ్వ విద్యాలయం. ఇందులో 12 వేలకు పైగా విద్యార్థులు కళలు, విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్, టెక్నాలజీలలో విద్యనభ్యసిస్తున్నారు. 1919 నుంచి 1938 వరకు మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్ లర్ గా కూడా పనిచేశారు.

    1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. 1909, 1913,1919,1932 సంవత్సరాల్లో మాలవ్య నాలుగుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. 1922లో హిందూ మహాసభ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని తొలినాళ్లలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాలవ్యనే. ఆయన గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను అనుక్షణం అనుసరించడానికి ఇష్టపడే వాడు. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించారు.

    1922 లో చౌరీ చౌరా దాడుల ఘటనలో మరణశిక్ష పడిన 225 మంది స్వాతంత్ర్య సమరయోధులు, సాధారణ ప్రజానీకం తరపున వాదించి వారిలో 153 మందికి ఆ శిక్ష పడకుండా కాపాడారు మాలవ్య. గంగా నది పరిరక్షణ కోసం ‘గంగా మహాసభ’ పేరుతో ఉద్యమాన్ని కూడా లేవదీశారు మాలవ్య. భారతీయ స్కౌట్స్ మరియు గైడ్స్ వ్యవస్థాపకులలో మాలవ్య కూడా సభ్యుడు. 1932లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన పూనా పాక్ట్ అగ్రిమెంట్‎పై ఆయనతో కలిసి సంతకం చేశారు తొలి వ్యక్తి మాలవ్య.

    1932 ఆగష్టులో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిషు ప్రభుత్వం.. కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. ప్రభుత్వం అల్ప సంఖ్యాక మతస్తులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ఈ అవార్డు లక్ష్యం. అయితే ముస్లింలు, సిక్కులతో పాటు, దళితులను కూడా అల్ప సంఖ్యాక మతస్తులుగా ఈ అవార్డు ప్రకటించింది.

    బి.ఆర్.అంబేద్కర్ ప్రతిపాదన మేరకే బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును తీసుకొచ్చింది. అయితే మహాత్మా గాంధీ దీన్ని వ్యతిరేకించారు. దళితులను విడదీస్తే హిందూ మతం విచ్ఛిన్నం అవుతుందని భావించి, అందుకు నిరసనగా గాంధీ పూనాలోని ఎరవాడ జైల్లో నిరాహారదీక్ష చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు గాంధీ వాదనకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో అంబేద్కర్ ఎరవాడ జైల్లో గాంధీతో చర్చలు జరిపాడు. వారి చర్చల ఫలితంగా వెలువడిందే పూనా ఒప్పందం.

    జీవితకాలం మొత్తం ఆజన్మబ్రహ్మచారిగానే గడిపిన మాలవ్య 1946 నవంబరు 12న బనారస్ మరణించారు. 2014 డిసెంబర్ 24న మదన్ మోహన్ మాలవ్యను ఆయన మరణాంతరం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ను అందించింది మోదీ ప్రభుత్వం.

    Trending Stories

    Related Stories