Right Angle

బజరంగబలీ నీ జన్మస్థానమేది..?

నవ్యాంధ్ర రాజకీయాల్లో ధర్మసంబంధ అంశ తొంగి చూడటం ముదావహం. కాకపోతే, అది ప్రతికూల దృష్టితో చర్చకు రావడమే దురదృష్టకరం. విగ్రహ విధ్వంసం, ఆలయ భూముల అన్యాక్రాంతం, అన్యమత ప్రచారం, అమ్మవారి సన్నిధిలో క్షుద్రపూజల కలకలం, అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అవినీతి బాగోతం, అప్పన్న ఆలయ ట్రస్టు వివాదం, శ్రీవారి నగల మాయం, పోతులూరి వీరబ్రహ్మం వారసుల పీఠం వివాదం, ధార్మిక అంశతో ముడివడి ఉన్న ఆయుర్వేదం…తాజగా హనుమ జన్మస్థల వివాదం ఇలా చాలా అంశాలు రోజువారి దినపత్రికల్లో దర్శనమిస్తున్నాయి.

రాజకీయ ఉద్దేశాలను నేరుగా ప్రస్తావించకుండా దైవసంబంధ అంశాల చుట్టూ అల్లడమన్నది ఇవ్వాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది లగాయితూ ఇలాంటి వివాదాలూ చాలానే జరిగాయి, సమసిపోయాయి. దైవం చుట్టూ వివాదాన్నిసృష్టించడం నేతలకు అలవాటు. కానీ, వాటిని పరిష్కరించి దారినపెట్టే కాషాయధారులు కరువు కావడమే తాజా స్థితికి కారణం. ‘హనుమ’ జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉమ్మడిగా గతేడాది డిసెంబర్ లో వేసిన పండితుల, చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారుల బృందం హనుమ జన్మస్థలం తిరుమల కొండల్లోని అంజనాద్రి పర్వతమని తేల్చింది. శివ‌, బ్రహ్మ, బ్రహ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హాత్మ్యం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్రకారం అంజ‌నాద్రి.. ఆంజ‌నేయుని జ‌న్మస్థాన‌మ‌ని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు. దీన్ని పుస్త్క రూపంలో తీసుకు వస్తామని ప్రకటించినా ఆఖరుకు వాయిదా పడింది. హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్‌జీ హనుమత్‌ ప్రసాద్ కూడా ఓ పుస్తకాన్ని ప్రచురించారు.

మరోవైపు, చరిత్రకారులు మాత్రం హంపి లేదా విజయనగర సామ్రాజ్య పరిధిలోని కిష్కింద క్షేత్రం హనుమాన్‌ జన్మస్థలమని వాదిస్తున్నారు. అందుకు ఆధారాలున్నాయంటున్నారు. సంగంకల్లు, బెళకల్లు ప్రాంతాల్లోని గుహల్లో హనుమకు సంబంధించి తోక ఆకారంలో కుడ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. బళ్లారి ప్రాంతంలో చాలా పెయింటింగ్స్‌లో మనుషుల ఆకారంలో ఉంటూ.. వెనుక భాగంలో తోకలు ఉన్నట్టుగా గుర్తించారని చెబుతున్నారు. హంపి చుట్టు పక్కల వెయ్యికి పైగా హనుమంతుడి శిల్పాలున్నాయంటున్నారు. తిరుమలలో కాకుండా ఎక్కువగా హనుమంతుని శిల్పాలు హంపి ప్రాంతంలోనే ఎందుకున్నాయనేది మరో వాదన. హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటక పంపాక్షేత్రంలోని కిష్కింధేనని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామివారి ఉద్ఘాటన. టీటీడీ కమిటీ అధ్యన అంశాలను వారు ప్రస్తావిస్తూ… అందులో లోపాలున్నాయని ఆరోపించారు. దేశంలో పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు, దిగ్గజ సిద్ధాంతులు ఉన్నారని వారిని సంప్రదించకుండా చరిత్రపై పట్టులేని నలుగురితో కమిటీ వేసి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ఎవరికి వారు తేల్చడం తగదని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంజనేయుడు ఆంధ్రుడే అంటోంది టీటీడీ. కానే కాదు.. కన్నడిగుడే అంటోంది కర్ణాటక. మొత్తంగా ప్రాంతీయవాదంలోకి దైవాన్ని దూర్చడం తెలుగువారికే చెల్లింది. ఇద్దరిలో ఎవరి వాదన నిజం? కలియుగ దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమ జన్మించాడా? అసలు హనుమ జన్మస్థలాన్ని నిరూపించాలన్న ఆలోచన వెనుక ఉన్న వివేచనారాహిత్యం ఏంటి?

భారతీయుల విశ్వాసాలను పాశ్చాత్య ప్రమాణాల ఆధారంగా నిరూపించాలన్న తాపత్రయం దేనికి? ‘శాస్త్రీయ రచనా పద్ధతి’ అని తనకు తాను కితాబు ఇచ్చుకున్న పాశ్చాత్య చరిత్ర రచన విధానాన్ని సాధికారికమని పండితులు నమ్మడమేమిటి? ఆధునిక, శాస్త్రీయ చరిత్ర రచన పద్ధతిపై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన చర్చ ఏంటి?

భారతీయుల సనాతన విశ్వాసాలను ఎందుకు పాశ్చాత్య ప్రమాణాలతో నిరూపించే ప్రయత్నం చేయకూడదో…తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

‘హిస్టొరియా’ అనే ప్రాచీన గ్రీకు మాట లాటిన్ మీదుగా ఆంగ్లభాషలోకి ప్రవేశించి ‘హిస్టరీ’గా మారింది. ఇది ‘హిస్టరీ’ అనేమాటకు etymological origin. ఈ హిస్టరీ అనేమాట సంస్కృతంలో ‘చరిత్ర’గా అనువాదమై తెలుగు నిఘుంటువులోకి చేరింది. చరిత్ర అంటే అచ్చతెలుగులో ‘నడవడి’ అని అర్థం. చరిత్ర లేదా చరిత్ర రచన అనే భావన పూర్తిగా పాశ్చాత్య దేశాలకు సంబంధించింది. వలసపాలన కాలంలో భారతీయుల మేధలోకి ప్రవేశించింది. ఆధునిక చరిత్ర రచన, పరిశోధనకు దానిదే అయిన కొన్ని ప్రమాణాలున్నాయి. వాటిని పాశ్చాత్య చరిత్రకారులే నిర్ధారించారు. ఆధారాల్ని స్థూలంగా 4 రకాలుగా నిర్ధారించారు.

  1. సాహిత్య ఆధారాలు-literary sources
  2. 2. పురావస్తు ఆధారాలు-archaeological sources
  3. శాసన ఆధారాలు-epigraphic sources
  4. 4. నాణేల అధ్యయనం-numismatics

సాహిత్య ఆధారాలంటే మత గ్రంథాలు, కాల్పనిక సాహిత్య కావ్యాలు, రాజవంశాల అనువంశిక ఆస్థాన చరిత్రలు, పరిపాలనా సంబంధమైన రికార్డులు. పురావస్తు ఆధారాలంటే గతకాలపు ఆవాసాలు, దేవాలయాల కట్టడాలు-architecture, వాడిన పనిముట్లు, ఆయుధాలు, ఆలంకరణ సామాగ్రి, కర్మకాండ సంబంధ ఆధారాలు వగైరా. రాజుల శాసనాలు, ఆయాకాలాల్లో వాడిన నాణేలు సరేసరి. ఇదీ పాశ్చాత్య శాస్త్రీయ చరిత్ర రచనలో వాడే ప్రామాణిక పరికరాలు. వీటి ఆధారంగా ‘హనుమ’ జన్మస్థలాన్ని నిర్ణయించడానికి పూనుకోవడమే హాస్యాస్పదం. ‘హనుమ’ యుగయుగాలుగా అశేష భారతీయుల ఆరాధ్యదైవం. హనుమ అంటే భక్తి, యుక్తీ, శక్తి, సాహసం అంతకు మించి అచంచల విశ్వాసం కదా! దేనివెంటపడి దేనికోసం దేబిరిస్తున్నాం? అసలు పాశ్చాత్య చరిత్ర రచనను భారతీయులు ప్రామాణికంగా, సాధికారికంగా భావించడమేంటి? భారతీయుల ఇతిహాస పరంపరను మరిచిపోయి…నిరూపణకోసం పాకులాట దేనికి? చరిత్రకు-ఇతిహాసానికే ఉన్న వ్యత్యాసం గమనిస్తే మరింత వెలుగు కనిపిస్తుంది. ఇతిహాసం అంటే విషయం చెప్పే పాత్ర విషయిలో భాగం కావాలి. ఉదాహరణకు రామాయణం చెప్పిన వాల్మీకి తనూ ఒక పాత్రగా అందులో భాగమైనట్టు. పాశ్చాత్యులు పదే పదే చెప్పే ‘చరిత్ర’ గురించి అమెరికన్ ఆవిష్కర్త హెన్రీఫోర్డ్. “history is more or less bunk” అభూత కల్పనల చిట్టాగా కొట్టిపారేశాడు. నిజానికి పాశ్చాత్య చరిత్ర ప్రమాణాలు కూడా కొన్ని సాంకేతిక సందర్భాల్లో ఉపయోగపడతాయి. అదెలాగో తర్వాత వివరిస్తాను.

సుమారు ఎనమిది వందల ఏళ్ల ముస్లీం దండయాత్రల కాలంలో ఆలయ సంపద, శాసన ఆధారాలూ ధ్వంసమైపోయాయి. ముస్లీం పాలకులు తమ సోత్కర్షకోసం పుస్తకాలు రాయించుకున్నారు. 15 శతాబ్దం చివరినాటికి వాణిజ్యం పేరిట ఫ్రెంచీ, డచ్, బ్రిటీష్ వలసలు మొదలై… ప్లాసీ యుద్ధం తర్వాత 1757 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ తన పాలనను సుస్థిరం చేసుకుని భారతదేశ చరిత్రను తన ఇష్టానుసారంగా రాస్తూ వచ్చింది. అందుకోసం నిధులను, వనరులను భారీగా కేటాయించింది. వలసవాద పద్ధతిలో చరిత్ర అధ్యయనం మన దేశంలో అట్లా మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనదేశంలో విద్యాసంస్థల్లో చరిత్ర అధ్యయనం ఒక అంశంగా చేరింది. 1920-22 నాటికి బెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని అనేక మంది భారతీయ చరిత్రకారులు పాశ్చాత్య చరిత్ర రచనా పద్ధతిని వ్యతిరేకించారు. ముఖ్యంగా బెంగాల్ కు చెందిన సర్ జాదూనాథ్ సర్కార్ లాంటివారు ‘‘Scientific history’’ అనే ఆంగ్ల పదబంధం విషయంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. 12వ శతాబ్దంలో వచ్చిన కల్హణుడి ‘రాజతరంగిణి’ కట్టుకథల పుట్టగా పేర్కొన్నారు బ్రిటీష్ చరిత్రకారులు. ఆ తర్వాత మార్క్సిస్ట్ చరిత్రకారుడు డి.డి.కొశాంభి కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మొత్తంగా బ్రిటీష్ చరిత్రకారులకు భారతీయ చరిత్ర రచన పద్ధతిపై అభ్యంతరం ఉన్నది. భారతదేశ ప్రాచీన చరిత్రపై, ధార్మిక పరంపరపై తమ అభిప్రాయాలనే మన అభిప్రాయాలుగా మార్చడంలో వలసపాలకులు విజయవంతమయ్యారు. సనాతన ధర్మం మౌఖిక పరంపరపై ఆధారపడింది. సనాతన రుషులు మౌఖిక భోదననే ప్రమాణంగా భావించారు. వేదాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు, సూక్తాలు, భారతం, రామాయణం, భాగవతాల రూపంలో యుగయుగాలుగా ఐతిహాసిక మౌఖిక రచనా పద్ధతి భారతదేశంలో ఉంది. శ్రోత మస్తిష్కంలోనే మన పరంపర తాలూకు మూలాలు ఇమిడి ఉన్నాయి. కర్మకాండ తంతును గమనిస్తే మన పూర్వీకుల మూలాల ప్రస్తావన తెలుస్తుంది. ఆ తర్వాత తాటాకులపై మన గతాన్ని భద్రపరిచినా కాల క్రమంలో అవి శిథిలమైపోయాయి. కృతిని వనరుగా చూసే పాశ్చాత్య పోకడకు-ఆరాధించిన భారతీయ తాత్విక, ధార్మిక చింతనకు ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే scientific evidence పై మనకున్న భ్రమలు పటాపంచలవుతాయి. ప్రకృతిలోని సమస్త జీవకోటి దైవంగా మన పురాణేతిహాసాల్లో దర్శనమిస్తుంది. వృషభం నుంచి వృశ్చికం వరకు-చీమ నుంచి పాము వరకూ అంతా దైవంగానే భావిస్తుంది ప్రాచీన భారతం. హేతువు ఆధారంగా నిరూపించే తత్వం, విచక్షణ లేకుండా కార్యకారణ సిద్ధాంతాన్ని నమ్మడం, లేబొరెటరీని నమ్మడం లాంటి rational thinking అనే భావన పాశ్చాత్య చరిత్ర రచనకు మూలం. దేని మూలంగా ఏది ఉద్భవించిందో తెలిస్తే తిరిగి దాన్ని పునరుత్పత్తి ప్రక్రియకు అనుసంధానించడం కోసమే ఈ తరహా పద్ధతిని ఆశ్రయించారు పాశ్చాత్యులు.

ఇలాంటి తాత్విక, శాస్త్రీయ భావనలను పట్టుకుని సనాతన ధర్మాన్ని, మన్వంతరాల విశ్వాసాలను నిరూపించే ప్రయత్నం చేయడం అర్థరహితం కాక మరేమిటి? ధార్మిక చింతనా జగత్తులో దైవం లేదా దైవ ప్రార్థనా అన్నది మనిషిని ముందుకు నడిపించేది, నడవడిని కట్టడి చేసేది, ఆరాధనా భావనను పెంచేది, వినమ్రతను నేర్పించేది. అలాంటి సనాతన సంప్రదాయాన్ని, దైవాంశను Utilitarian సిద్ధాంతాన్ని ప్రతిపాదించే తాత్విక సంప్రదాయ చట్రంలో ఇరికించి నిరూపించే ప్రయత్నం చేయడం మూర్ఖత్వం కాదా? బైబిల్ చెప్పే ఆడం-ఈవ్ పక్కటెముక కటుకథను పాశ్చాత్య శాస్త్రీయ చరిత్ర నిరూపించిందా? ఆమాటకు వస్తే ప్రాచీన ప్రపంచ చరిత్ర రాసిన అనేక మంది పాశ్చాత్య చరిత్రకారులు పరస్పరం విభేదించుకోలేదా? వేల ఏళ్లకాలం గడిచిపోయాక-మన పురాణాల్లోని మహాపురుషుల మూలాలు వెతకబోతే దొరుకుతాయా?మనిషి పుట్టుక గురించి ఎన్ని సిద్ధాంతాలు రాలేదు? కోతి నుంచి అని ఒకరంటే లేదు నాచు నుంచి మనిషి ఉద్భవించాడని వాదించుకున్నారు? ఆధునిక విజ్ఞాన శాస్త్రం తనను తాను ఎన్నివేల సార్లు పూర్వపక్షం చేసుకున్నదో గుర్తించలేని అంధత్వంలో ఉన్నామా? పాశ్చాత్యదేశాల శాస్త్రీయ ప్రమాణాలన్నీ వలస దేశాలను న్యూనతకు గురిచేయడం కోసమే తప్ప నిజనిర్ధారణ కోసం పుట్టినవి కావని గమనించాలి. బైబిల్ లోని ప్రతి కథను నిరూపించి చూపిన తర్వాత modern scientific method of history writing ని మనమూ ఆమోదిద్దాం. పాశ్చాత్య చరిత్ర రచనా పద్ధతి ఎప్పుడు ఉపయోగ పడుతుందో చూద్దాం…

బాబర్ దండయాత్రలో రామజన్మభూమి విధ్వంసానికి గురైంది. రాముడు పుట్టిన చోట మసీదు నిర్మాణం జరిగింది. అది వివాదంగా మారింది. న్యాయస్థానాల్లో రామజన్మభూమి అని నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కు ప్రాధాన్యత ఏర్పడుతుంది. మసీదు గర్భంలో మందిరం ఉందని పురావస్తు శాఖ నిరూపించింది. దీంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఆధునిక నాగరికత వల్ల వచ్చిన న్యాయస్థానాల వాదవివాదాల సందర్భంలో అదే నాగరికత వల్ల అబ్బిన పాశ్చాత్య రచనా పద్ధతి ఉపయోగపడుతుంది. అది కూడా అక్కడ ఓ కట్టడం ఉండబట్టీ అది వీలుపడింది. ఏ కట్టడాలూ కొండల్లో జన్మస్థానాన్ని నిర్ణయించడానికి పూనుకోవడం ఎందుకు? అంతిమంగా అభాసుపాలు కావడం దేనికి? అందుకే మనదైన చారిత్రక పరిశీలనా పద్ధతిపై ఆధారపడదాం. పాశ్చాత్య రచన సంప్రదాయాన్ని ఇకనైనా వదులుకుందాం. అనవసర నిరూపణలకు దిగి, ఖండన మండనలు చేసుకుని…చర్చావస్తువుగా మారకుండా ఉందాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − one =

Back to top button