National

హనుమంతుడి జన్మస్థానంపై హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, టీటీడీ మధ్య చర్చ

హనుమంతుడి జన్మస్థానంపై వివాదం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు హనుమంతుడి జన్మస్థానం కిష్కింద అని చెబుతుండగా.. హనుమంతుడి జన్మస్థలం తిరుపతిలోని అంజనాద్రే అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది. దీనిపై చర్చకు సిద్ధమని ఇరు వర్గాలు తెలిపాయి. నేడు హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, టీటీడీ హనుమంతుడి జన్మస్థానంపై చర్చించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత పీఠంలో హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, టీటీడీ వర్గాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో చర్చ అసంపూర్ణంగా ముగిసినట్లు తెలుస్తోంది.

అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ ఓ కమిటీని నియమించింది. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ పాటు ఇస్రో శాస్త్రవేత్త, రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పరిశీలన చేసి బలమైన ఆధారాలు సేకరించింది. వివిధ గ్రంథాల ప్రకారం శ్రీవేంకటేశ్వరస్వామి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీ ప్రకారం నిర్ధారించారు. అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించామని టీటీడీ బలంగా తెలిపింది. దీన్ని కిష్కింధ సంస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది.

కిష్కింధ సంస్థాన్ కు చెందిన హనుమద్ జన్మస్థల తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ హనుమంతుడి జన్మస్థల అంశంపై సంస్కృత విద్యాపీఠంలో చర్చించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర పుణ్యక్షేత్రమని.. తమకు కిష్కింధ ఒక కన్ను అయితే, తిరుమల మరో కన్ను అని తెలిపారు. నేటి సమావేశానికి సంబంధించిన అజెండా బుక్ లెట్ లో ఉన్న అంశాలపై ప్రస్తావనే లేదని గోవిందానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంజనేయుడి జన్మ తిథిపై స్పష్టత లేదని అన్నారు. హనుమంతుడి జన్మ తిథి అంటూ మూడు తిథులు ఎలా పెడతారని నిలదీశారు. టీటీడీ వాళ్లు ఎప్పుడైనా పంపా ప్రాంతానికి వచ్చారా? అసలు, దీనిపై టీటీడీ కమిటీకి అధికారం ఉందా? కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు తిరుమల పెద్దజీయర్ స్వామిని అడిగారా? ఆ కమిటీలో పెద్దజీయర్ స్వామి ఎందుకు లేరు? రామానుజ సంప్రదాయం ప్రకారం ఆంజనేయస్వామి వారికి వివాహం చేస్తారా? ఎన్నో కల్పాలు, మన్వంతరాలు గడిచాక ఈ చర్చ ఏంటి? అంటూ గోవిందానంద సరస్వతి తమ ప్రశ్నలను ముందుంచారు. రామాయణం ప్రకారం కిష్కింధనే మారుతి జన్మస్థలం అని.. హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణకు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీకి ప్రామాణికత లేదని అన్నారు.

ధార్మిక విషయాలను నిర్ణయించాల్సింది ఎవరు? అని గట్టిగా అడిగారు. శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోఠి పీఠాధిపతులు, మధ్యాచార్యులు, తిరుమల పెద్దజీయర్, చినజీయర్ స్వాముల సమక్షంలో చర్చించాల్సిన అంశాలివి అని అన్నారు. సామాన్య భక్త జనాలను గందరగోళంలోకి నెట్టేలా టీటీడీ వాదనలు ఉన్నాయని గోవిందానంద విమర్శించారు. టీటీడీ తీసుకువచ్చిన బుక్ లెట్ పై తాము జీయర్ స్వాముల వద్దకు వెళతామని అన్నారు. ధర్మం గురించి తేల్చాల్చింది ధర్మాచార్యులేనని అభిప్రాయపడ్డారు. కాలం విషయంలో టీటీడీకి స్పష్టత లేదు. మూడు తిధులు రాశారు. జన్మ తేదీ లేనప్పుడు స్థలం ఎలా స్థిరీకరిస్తారు?.. హనుమంతుడు జన్మ విషయంలో పురణాలతో తేల్చలేమన్నారు. రామాయణంలో జన్మ స్థలం పంపా అని ఉంది. పురాణం ప్రమాణం కాదు, రామాయణాన్ని టీటీడీ ప్రమాణంగా తీసుకోవాలి. చర్చను పబ్లిక్‌గా పెట్టాలి, ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పంపాకు కమిటీ వచ్చిందా అని కూడా ఆయన అడిగారు. విజయవాడలో కూడా అయోధ్య ఉంది, అంత మాత్రాన అది అయోధ్య అవుతుందా అని ప్రశ్నించారు. కర్ణాటకలో అంజనాద్రి ఉంది, ఆ ప్రభుత్వాన్ని అడిగారా అంటూ గోవిందానంద సరస్వతి ప్రశ్నల వర్షం కురిపించారు. నెగ్గడం, ఓడిపోవడం కాదని, సత్యం ఏంటో తేలాలని గోవిందానంద సరస్వతి చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

3 × three =

Back to top button