పాక్ పాయింట్ బ్లాంక్‎లో తాలిబాన్ గన్..!?

0
913

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్.. ఈ రెండు దేశాలు చిరకాల మిత్రులేం కాదు. తరిచి చూస్తే ఇరు దేశాల మధ్య అనేక వివాదాలున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‎ను స్వాధీనం చేసుకోవడంలో తాలిబన్లకు పాకిస్తాన్ సాయం చేసింది. దీంతో మరోసారి ఉగ్రబంధం బలపడింది. అయితే, అలా బలపడిందో లేదో అప్పుడే బీటలువారే పరిస్థితికి చేరుకుంది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోగానే ఇరు దేశాలు చెట్టాపట్టాలేసుకుని.. ప్రపంచ దేశాల ముందు ఫోజుకొట్టాయి. కానీ, అది మూణ్ణాళ్ళ ముచ్చటేనని తేలిపోయింది. తాలిబాన్లకు కాబూల్‎ వశం కాగానే కథ మారిపోయింది.

ప్రస్తుతం పాకిస్తాన్, తాలిబాన్లకు మధ్య ఏమాత్రం పొసగడం లేదు. తాలిబన్లు అణువణువునా ఇస్లామిక్ మతోన్మాదాన్ని నింపుకున్న ముష్కరులు. అసలే వాళ్లు ఆటవిక ఉగ్రవాదులంటే.. వారి వద్ద ఇప్పడు అత్యాధునిక ఆయుధాలున్నాయి. అమెరికా వదిలివెళ్లిన తుపాకులు, జీపులు, ఇతర ఆయుధాలు అనేకం వున్నాయి. చెప్పాలంటే, తాలిబాన్లు ఇప్పుడు ఓ ప్రాణాంతక ముఠా. అలాంటి ముఠాను గుప్పిట్లో పెట్టకుని ఆటలాడాలని చూసింది పాకిస్తాన్. వారికి పట్టాభిషేకం చేయించి పబ్బం గడుపుకోవాలని కలలు కన్నది. కానీ, ఆ ప్రయోగం బెడిసికొట్టింది. దీంతో తాను చేసింది ఎంత తప్పో ఇప్పుడు పాకిస్తాన్‎కు అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అంతటా తాలిబాన్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ఓవైపు ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టమని చెబుతూనే.. మరోవైపు తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు తాలిబాన్ల దృష్టి పాలనపైనే కాకుండా విస్తరణవాదం వైపు కూడా మళ్లింది. తమ ఏకైక మిత్ర దేశం చైనా అడుగుజాడల్లో విస్తరణవాద పాఠాలు వల్లెవేస్తోంది. అయితే, వారి తొలిచూపు ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ పైనే పడింది. ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణకు అండగా నిలిచిన తమ మిత్రదేశమే టార్గెట్ అయ్యింది. తాలిబాన్లు తమ భూదాహానికి మొదటి లక్ష్యంగా పాకిస్తాన్‎నే ఎంచుకున్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాలిబాన్లు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్ వ్యతిరేక చర్యల్లో నిమగ్నమైవున్నారు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్‌’కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినట్లే,.. ఇస్లామాబాద్‌కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపారు తాలిబాన్లు. డ్యూరాండ్ లైన్ విషయంలో తమ వాదనను అంగీకరించాలని.. లేదంటే, ఆ రేఖను చెరిపేయాలని ఆల్టీమేటం జారీ చేశారు. అంతేకాదు, తాజాగా నంగర్‌హర్ వద్ద డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను తొలగించారు. వెంటనే పాకిస్తానీ దళాలు ముళ్ల కంచె పునర్నిర్మించేందుకు ప్రయత్నించాయి. అయితే తూర్పు నగర్‌హార్ ప్రావిన్స్ చీఫ్ డాక్టర్ బషీర్ నేతృత్వంలోని తాలిబాన్ దళాలు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి.

ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ సమయంలో, తాలిబాన్ దళాల కమాండర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చరించాడు. దుర్భాషలాడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హద్దుమీరితే యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనా వేస్తే.. స్వయంగా తానే వచ్చి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాని బెదిరించాడు. మీతో యుద్ధం చేయాల్సివస్తే.. ముందు వరుసలో వుండేది తానేనని తెగేసి చెప్పాడు. అంతటితో ఆగకుండా.. యూదులతో యుద్ధం చేయడం కంటే మీతో యుద్ధం చేయడం నాకు సంతోషాన్ని కలిగిస్తుందని నేను అల్లాపై ప్రమాణం చేస్తున్నాను అంటూ.. పాకిస్తాన్ సైన్యాన్ని హెచ్చరించాడు. ఈ క్రమంలో తాలిబాన్లు ‘పాకిస్తాన్‎కు కుక్కచావు’ తప్పదంటూ నినాదాలు చేశారు. ఘర్షణలు జరిగిన ప్రాంతం పాకిస్తాన్‎కు కేవలం 100 మీటర్ల దూరంలో వుంది. గుష్టా జిల్లాలోని నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని ఈ ఘటన జరిగిన తర్వాత.. అదే రోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్‎లోని కునార్ ప్రావిన్స్‌పై పాకిస్తాన్ బలగాలు ఫిరంగులను ప్రయోగించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‎లో పాక్ వ్యతిరేక భావజాలం బాగా విస్తరిస్తోంది. తాలిబాన్ల పష్టూన్ జాతీయవాదం ఇందుకు ఊతమిస్తోంది. తాలిబాన్లు డ్యూరాండ్ రేఖను ససేమిరా గుర్తించడం లేదు. ఇస్లామాబాద్, కాబూల్ మధ్య ఈ సరిహద్దు వివాదం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‎ను ఆక్రమించుకున్న తర్వాత ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది. ప్రస్తుతం తాలిబాన్లు ‘పష్టూనిస్తాన్’ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‎కు వ్యతిరేకంగా ఇస్లామిక్ రాజ్యస్థాపనకు తాలిబాన్ నాయకుడు మౌలానా అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చాడు. పాకిస్తాన్‌లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి మా పోరాటంపై ఖచ్చితంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని.. అయితే తమ విజయం దేవుని చేతుల్లోనే ఉందని అన్నాడు.

నిజానికి, తాలిబాన్లను సృష్టించింది.. తాజాగా పున:సృష్టి చేసింది కూడా పాకిస్తానే. 1990వ దశకంలో తాలిబాన్లను తయారుచేయడంలో.. వారికి శిక్షణ ఇవ్వడంలో పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ప్రముఖ పాత్ర పోషించాయి. 1996లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించినప్పుడు, తాలిబాన్ పాలనను గుర్తించిన మూడు దేశాలలో పాకిస్తాన్ ఒకటి. అయితే, అదే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ పాలిట యముడిగా మారింది. డ్యూరాండ్ రేఖ విషయంలో తాము చెప్పిందే ఫైనల్ అంటున్న తాలిబాన్లు.. అవసరమైతే ఎప్పుడైనా పాకిస్తాన్‌తో పోరాడేందుకు సిద్ధమంటూ తొడగొడుతున్నారు. అంటే, పాకిస్తాన్‎కు బ్యాడ్ డేస్ మొదలైనట్టేనంటున్నారు విశ్లేషకులు.

మొత్తానికి, తాను పెంచి పోషించిన ఉగ్రవాద కాలనాగు.. ఇప్పుడు తననే కాటేసేందుకు బుసలు కొడుతోంది. దీని భారి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయింది. మరోవైపు ఉగ్రవాద ఫ్యాక్టరీగా మారిపోయిన ఆ దేశానికి అండగా నిలిచేందుకు ఏ దేశం కూడా ముందుకు రాదు. ఉన్న ఏకైక మిత్ర దేశం చైనా కూడా కలిసిరావడం సందేహమే. ఎందుకంటే, ఆఫ్ఘనిస్తాన్‎తో డ్రాగన్‎కు చాలా పనులున్నాయి మరి..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

8 − 1 =