అమెరికాపై ఇడా తుపాను విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు న్యూయార్క్ లో ఆకస్మిక వరదలకు కారణం అయ్యాయి. కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలను ‘చారిత్రాత్మక వాతావరణ సంఘటన’గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. NYC మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ సేవలను మూసివేసింది. సబ్వే ప్లాట్‌ఫారమ్‌లలో వరదలు సంభవించాయి. వీధులు కాస్తా నదులుగా మారాయి. “నా వయస్సు 50 సంవత్సరాలు. ఇంత ఎక్కువ వర్షాన్ని నేను ఎన్నడూ చూడలేదు” అని మెటోడిజా మిహాజ్లోవ్ చెప్పారు. తన మన్హట్టన్ రెస్టారెంట్ యొక్క బేస్‌మెంట్ మూడు అంగుళాల నీటితో నిండిపోయిందని.. ఇది నమ్మశక్యం కానిది. ఈ సంవత్సరం అంతా చాలా వింతగా ఉందని చెప్పుకొచ్చారు.
న్యూయార్క్ నగరంలో తొలిసారిగా ‘ఫ్లాష్ ఫ్లడ్’ ఎమర్జెన్సీని విధించారు. నగరంలో రికార్డ్ స్థాయిలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1869 నుంచి నమోదైన వర్షపాతాల్లో ఇదే రికార్డ్. 500 ఏళ్లలో ఒకసారి వచ్చే అత్యంత భారీ వర్షపాతం ఇదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్వోఏఏ) ప్రకటించింది.నెవార్క్, న్యూజెర్సీల్లో 21.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ నగరాల వర్షపాత చరిత్రల్లోనూ ఇదే రికార్డ్ అని చెబుతున్నారు. అంతకుముందు 1977లో 17.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెవార్క్ లో కురిసిన వర్షం వెయ్యేళ్ల చరిత్రను తిరగరాసిందని చెబుతున్నారు.
వరద బీభత్సం నేపథ్యంలో న్యూయార్క్ లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు. జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో వందలాది విమానాలు నిలిచిపోయాయి. టెర్మినల్స్ ను వరద నీరు ముంచెత్తింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ… ఈ విపత్కర పరిస్థితుల్లో అందరం సమష్టిగా ఉందామని పిలుపునిచ్చారు. న్యూయార్క్ కు సాయం చేసేందుకు దేశమంతా సిద్ధంగా ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ న్యూయార్క్ మరియు న్యూజెర్సీ గవర్నర్‌లతో మాట్లాడినట్లు చెప్పారు. “చాలా నష్టం చోటు చేసుకుంది, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తో పాటూ మరిన్ని బృందాలు అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని నేను గవర్నర్‌లకు స్పష్టం చేసాను” అని వైట్ హౌస్ నుండి బిడెన్ ప్రసంగించారు.
ఈ వరదల కారణంగా పలువురు మరణించారని అధికారులు తెలిపారు. క్వీన్స్ మరియు బ్రూక్లిన్ లోని వివిధ గృహాలలో మరణించిన వాళ్లు కనుగొనబడ్డారని అధికారులు తెలిపారు. ఇక గురువారం నాడు న్యూయార్క్ నగరంలో పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. నగరం నెమ్మదిగా తిరిగి జీవం పోసుకుంటోందని న్యూయార్క్ వాసులు తెలిపారు. గురువారం నాడు అందమైన నీలి ఆకాశాన్ని చూస్తున్నామని పలువురు తెలిపారు. సబ్వే సేవలు పునః ప్రారంభమయ్యాయి. నివాసితులు రహదారుల నుండి పడిపోయిన చెట్ల కొమ్మలను తరలించారు. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎంత పెద్ద నగరాలైనా తట్టుకోలేవని న్యూయార్క్ ఓ ఉదాహరణగా మారిందని.. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ‘క్లైమేట్ చేంజ్’ గురించి ఆలోచిస్తే బాగుంటుందని నిపుణులు హితవు పలుకుతూ ఉన్నారు.