ముగిసిన గడువు.. మూగబోయిన లౌడ్ స్పీకర్లు

0
766

ఆజాన్‌ వర్సెస్‌ హనుమాన్‌ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన చీఫ్‌ రాజ్‌ థాక్రే విధించిన డెడ్‌ లైన్‌ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్‌ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్‌ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్‌ థాక్రే గతంలో హెచ్చరించారు. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించాడాయన. ఆజాన్‌ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు.

ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్‌ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ‍ప్రార్థనల సమయంలో లౌడ్‌ స్పీకర్లు బంద్‌ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్‌ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్‌స్పీకర్లు బంద్‌ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్‌ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు.

మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్‌ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్‌ఎస్‌ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్‌తో సేన ఓట్లను ఎంఎన్‌ఎస్‌ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here