More

    ప్రభుత్వ ఆస్తులపై మతపరమైన జెండాలను నిషేధించిన రాజస్థాన్ ప్రభుత్వం

    రామ నవమి, దుర్గా అష్టమి, హనుమాన్ జయంతి, మహావీర్ జయంతి వంటి ఇతర ప్రధాన హిందూ పండుగలు జరగడానికి కొన్ని రోజుల ముందు.. రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు, స్థలాలపై మతపరమైన జెండాలను ఎగురవేయడాన్ని నిషేధించింది. కోటా, అజ్మీర్, జోధ్‌పూర్, బికనీర్‌తో సహా వివిధ జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. అజ్మీర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నీరజ్ జైన్ ట్వీట్ చేస్తూ, “కోటా, బికనీర్, జోధ్‌పూర్, అజ్మీర్ మరియు ఇతర నగరాల్లో మత చిహ్నాలు ఉండేలా జెండాలు పెట్టడం, డీజే వాయించడం నేరం” అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేశారు. మహావీర్ జయంతి, దుర్గాష్టమి, అంబేద్కర్ జయంతి, రామ నవమి, హనుమాన్ జయంతిలలో ఊరేగింపు, శోభా యాత్రకు ముందు ఈ ఆదేశాలు రావడం గమనార్హం.

    అజ్మీర్ జిల్లా కలెక్టర్ అన్ష్ దీప్ సంతకం చేసిన ఉత్తర్వును కూడా నీరజ్ జైన్ జతపరిచారు, “అజ్మీర్ జిల్లాలో మతపరమైన ప్రయోజనాల కోసం కొందరు శాంతిభద్రతలను ప్రభావితం చేయడం ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ సంస్థలు, బోర్డ్ కార్పొరేషన్ భవనం, పబ్లిక్ కమ్యూనిటీ భవనం/ విశ్రాంతి గృహాలు, పబ్లిక్ పార్కులు, సర్కిల్ ఎలక్ట్రిక్- టెలిఫోన్ స్తంభాలు, కూడళ్లు, ప్రభుత్వ ఆస్తులపై మతపరమైన చిహ్నాలతో కూడిన జెండాలను ఎగురవేయడం నిషేధం. ఇది ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తుంది. శాంతిభద్రతలకు, సామాజిక సామరస్యానికి ప్రతికూలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సామరస్యం, శాంతిని కాపాడేందుకు తక్షణమే నివారణ చర్యలు అవసరం.” అంటూ అందులో తెలిపారు.

    అన్ష్ దీప్ తన ఆర్డర్‌లో ద్వారా “ఈ ఆర్డర్ 7 ఏప్రిల్ 2022 ఉదయం 10 గంటల నుండి వచ్చే నెల వరకు అజ్మీర్ జిల్లాలోని మొత్తం పట్టణ, గ్రామీణ ప్రాంతంలో అమలులో ఉంటుంది.” అని తెలిపారు. 2022 ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్‌లోని కరౌలిలో హిందూ నూతన సంవత్సరం సందర్భంగా చేపట్టిన బైక్ ర్యాలీపై ముస్లింలు అధికంగా ఉండే హత్వారా బజార్ గుండా వెళుతుండగా దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. హిందువుల ర్యాలీపై రాళ్లు రువ్వారు. డజనుకు పైగా దుకాణాలు, మూడు బైక్‌లకు నిప్పు పెట్టారు. హిందూ నూతన సంవత్సరంను పురస్కరించుకుని ఈ ర్యాలీని నిర్వహించారు. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

    Trending Stories

    Related Stories